Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. కోటి రూపాయలకు ఓ కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను

August 19, 2025 by M S R

.

నిజమే… మనం చదివే పుస్తకంలోని ఏదో ఓ వాక్యం, ఏదో సినిమాలో చూసే ఏదో ఓ సీన్, ఎక్కడో కంటబడే ఏదో సంఘటన, ఎవరో గురువు చెప్పే ఏదో ఓ సూక్తి మన జీవితాల్ని మారుస్తుంటుంది… మన బాటను మళ్లిస్తుంది…

ప్రఖ్యాత రచయిత Veerendranath Yandamoori సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఓ అనుభవం అలాంటిదే… ఓసారి చదవండి…

Ads


నిన్న ఒకరు ఫోన్ చేసి “హైదరాబాదులో కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టాను. మీరు వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి” అన్నారు.

“కొత్త హోటల్ అన్నారు కాబట్టి మా పనివాళ్ళ, స్నేహితుల పిల్లల్ని కూడా తీసుకొస్తాను. తప్పని సరిగా బిల్లు తీసుకునే పక్షంలో” అని చెప్పాను. వద్దన్నాడు. అలా అయిన పక్షంలో నాకూ రావటం కుదరదన్నాను. 50 శాతం రిబేట్‌కి అగ్రిమెంట్ కుదిరింది.

అక్కడికి వెళ్ళాక తన కథ చెప్పాడు. “దాదాపు 30 సంవత్సరాల క్రితం మీరు మా షెడ్డు యజమానికి ఫోన్ చేసి ఒక తారీఖు చెప్పి, ‘… లోయలో తోసేయడానికి ఒక కారు కావాలి’ అన్నారు. నేను అదే మెకానిక్ షాపులో హెల్పర్ కుర్రాడిని.

ఆ రోజు ఇంజన్ లేని కారు తోసుకుంటూ మేము నలుగురు కుర్రాళ్ళం సారధి స్టూడియోస్‌కి వచ్చాం. మీరు షూటింగ్లో ఉన్నారు. మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, అడగలేక పోయాను. ఆ తర్వాత నేను “విజయానికి ఐదు మెట్లు. ఆరో మెట్టు” చదివి ‘ఇది కాదు జీవితం’ అనుకుని దుబాయ్ వెళ్లిపోయాను.

yandamuri

అక్కడ చాయ్ దుకాణం పెట్టి, పారిశ్రామికవాడలో కార్మికులకి తెల్లవార్నే రూపాయికి కప్పు ‘టి’ ఇవ్వసాగాను. టీ పొడి, పాలు శ్రద్ధగా చూసుకునేవాడిని. మంచి టీ, చౌకగా ఇవ్వటంతో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి నా కజిన్‌ని ఇండియా నుంచి పిలిపించి, దుబాయ్‌లోనే “హైదరాబాద్ బిర్యాని రెస్టారెంట్” స్థాపించాను.

నా కజిన్ క్యాష్-కౌంటర్లో కూర్చుంటే, నేనూ, మరో కుక్ చాలా రుచిగా వండే వాళ్ళం. ఇంకో వెయిటర్. మొత్తం నలుగురమే. ఇరవై సంవత్సరాలు చాలా బాగా నడిపాము.

నా తల్లిదండ్రులని చూసుకోవటానికి ఆరు నెలల క్రితం శాశ్వతంగా హైదరాబాదు వచ్చి మొన్నే ఈ రెస్టారెంట్ పెట్టాను. దీనికి కారణమైన మీకు ఈ సందర్భంగా ఆతిథ్యం ఇవ్వాలన్నది నా కోరిక” అన్నాడు. ప్రేరణ కలిగించే కథ.

”భీమవరం పక్కన పల్లెటూరు మాది. మా తాతయ్య తాలూకు గేదెలు కాస్తూ విమాన శబ్దం వినబడినప్పుడు ఉద్వేగంగా పైకి చూసేవాడిని. నాలాగా ఎంతో మంది మధ్యతరగతి వారికి విమానం ఎక్కాలని ఉంటుంది. కానీ ఆ కోరిక తీరదు. అందుకనే కోటీ ఇరవై లక్షలకి కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను. (Kvr flight retaurant. గండి మైసమ్మ).

yandamuri

ఆకాశ౦లో జర్నీ అనుభవం ఇవ్వటం కోసం రిమోట్స్ ఏర్పాట్లు చేశాము. కేవలం వెజ్, నాన్-వెజ్ బిర్యాని, శుద్ధమైన పాలతో చేసిన కోవా, ఒకటి రెండు కూరలు 600 కు ఇస్తాము. ఇంట్లో పెద్దవారిని తీసుకొచ్చి ఈ విమానంలో కూర్చునే అనుభవం ఇవ్వాలనుకుంటే వారి పెద్దలకి ‘సగం ధర’ మాత్రమే ఛార్జ్ చేస్తాము. దీనికి కూడా ప్రేరణ మీరే.

‘…ఆటో దిగినప్పుడు 40 రూపాయలు మీటర్ ఛార్జీ అయితే, ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇవ్వు. పది రూపాయలు నీకు చిన్న అమౌంట్. కానీ అతనికి పెద్ద ఆనందం’ అని విజయానికి ఆరవ మెట్టు పుస్తకంలో వ్రాసారు. అదే నాకు ప్రేరణ” అన్నారు.

ఎవరన్నారు పుస్తకాలు మనుషుల్ని మార్చలేవని? పుస్తకాలు విత్తనాలు కాకపోవచ్చు. కానీ పుస్తక పఠనం నిశ్చయంగా మనసులో ‘కోరిక’ అనే విత్తనం. వృక్షమవటానికి కావలసిన నీళ్ళు పోస్తుంది..! ఎరువు అవుతుంది..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాళేశ్వరం గంతలు… హరీష్‌రావు వృథా ప్రయాస..! ఇవీ నిజాలు..!!
  • …. కోటి రూపాయలకు ఓ కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను
  • ఈరోజు నచ్చిన వార్త… అర్ధరాత్రివేళ మన వ్యోమవీరుడికి ఘనస్వాగతం…
  • నేల మీదే నడుద్దాం… పడే ప్రమాదముండదు… ఓ డైరెక్టర్ విలువైన మాట…
  • భగవాన్ శ్రీరాం సర్..! విశ్వాసులకు దేవుడే… అంతగా ప్రభావితం చేస్తారు..!!
  • పూప్ సూట్‌కేస్..! పుతిన్ పర్యటనల్లో కనిపించే ఈ భద్రత కథేమిటి..?!
  • మంచి సోర్స్, గైడ్, అప్‌‌డేషన్, క్రాస్‌చెక్… ఆ బ్యూరో చీఫ్‌ల రోజులే వేరు…
  • లేడీ విలన్…! అతిరథుల్ని దాటేసిన ఆమె నటనకు అంతటా చప్పట్లు…!
  • అప్పట్లోనే ఇది ఓ మహా బాహుబలి..! అందుకే తను సూపర్‌స్టార్..!!
  • సరోగేట్ ప్రమోషన్..! ఇది సరైన పద్ధతి కాదు మిస్టర్ జగపతిబాబూ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions