ముందు నుంచి అనుకుంటున్నదే ఇది…. అంతా బాగున్నప్పుడు… కేసీయార్‌తో బాగున్నప్పుడు… అందరూ కలిసి కొత్తకొత్తగా తెలంగాణ సమాజాన్ని దంచుకుంటున్నప్పుడు… దండుకుంటున్నప్పుడు… ప్రజలు లేరు, ఆత్మాభిమానం లేదు… ఇప్పుడు కేసీయార్‌కూ, తనకూ పడకపోతే అకస్మాత్తుగా తెలంగాణ ప్రజలు, బానిస భవన్ గట్రా గుర్తురావడం కరెక్టు కాదని….!! ఒకటి మాత్రం ఈటల చెప్పింది నిజమే… ఐదేళ్లుగా కేసీయార్‌తో గ్యాప్ ఉందనేది… కానీ తెలంగాణ ప్రజలు, వాళ్ల సంక్షేమం అనే సోయి నిజంగానే ఉండి ఉంటే, అక్కడ బానిసగా ఎందుకిన్నేళ్లు బతికినట్టు..?! ఓ లెఫ్ట్ ఐడియాలజీ ఆ నెత్తురులో ఏం ఉన్నట్టు..? ఆయన చెప్పినట్టు మంత్రి హరీష్ కూడా అక్కడ అవమానాల పాలవుతూ ఉండొచ్చుగాక… కానీ అది ఆ కుటుంబ రక్తం…! అది ఓ కుటుంబపార్టీ…!! కానీ అది ఓ ఉద్యమపార్టీ, సూపర్‌గా తెలంగాణ ప్రజల్ని ఉద్దరించే పార్టీ అని తనలాంటోళ్లే జనాన్ని మభ్యపెట్టారు అన్నట్టేనా… మరి ఆ తప్పుకి ప్రాయశ్చితం ఏమిటి..? ఇప్పుడు టరమ్స్ దెబ్బతిన్నయ్ కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు, లేకపోతే ఆ బానిస బతుకులోనే సార్థకతను వెతుక్కునేవాడివా రాజేంద్రన్నా… నిజాలు ఇలాగే నిష్ఠురంగా ఉంటయ్…
ఇక నమస్తే తెలంగాణ… ఇదొక అక్షర భాగ్యం తెలంగాణ సమాజానికి… కేసీయార్‌కు అర్థమవుతుందో లేదో తెలియదు గానీ… ఇది కేసీయార్‌కే నష్టదాయకం చాలాసార్లు…!! ఏది రాస్తే కేసీయార్‌కు మంచిదో, ఏది నష్టకారకమో కూడా తెలియనితనం… ఎందుకోగానీ దాన్ని చూస్తూ కేసీయార్ పొంగిపోతుంటాడు… ఉదాహరణకు… ఈ వార్త చూడండి… ‘‘రైతుబంధును విమర్శిస్తున్నాడు కదా ఈటల… మరి తనెందుకు లక్షల రూపాయలు తీసుకున్నాడు… ఇప్పుడు దాన్ని నిందించే నైతిక అర్హత ఉందా..? బెంజ్ రాజేంద్రుడు ముచ్చటగా నాలుగుసార్లు ఏటా 3 లక్షల చొప్పున తీసుకుని, ఇప్పుడు నీతులు చెబుతున్నాడు’’ అంటోంది ఈ గులాబీ కరపత్రిక… పైగా దానికి ఓ దిక్కుమాలిన బొమ్మ కూడా వేశారు… అంటే ఒకరకంగా కేసీయార్‌ను వెక్కిరిస్తోందా ఈ కథనం..? ఏమిటి ఈ దిక్కుమాలిన స్కీం..? మన బెంజ్ మంత్రులకు కూడా డబ్బులు వస్తున్నయ్ ఈ పథకం ద్వారా… అసలు దీనికి ఓ విలువ, సార్థకత ఉన్నాయా అని ఎత్తిచూపిస్తోందా..? హహహ… ఏమో, కేసీయార్ ఇష్టపుత్రిక కదా… తనే రాయించుకుని ఉంటాడు… అలా తప్పులో కాలేశాడు… తమ టీం గాయ్ గత్తర చేస్తున్న ఆ దేవరయాంజాల్ భూములకు రైతు బంధు ఎవరు ఇచ్చినట్టు… ముందు ఆ బాధ్యుల్ని లోపలేయండి… హమ్మా…
Ads
పంటసాయం తనకు వద్దని ఏనాడూ చెప్పలేదుట రాజేందర్… నిజమే… ఆయన కక్కుర్తి పడ్డాడే అనుకుందాం… తన మంత్రివర్గంలోని మంత్రులంతా అటుకులు బుక్కి, కనీన స్థితిలో బతికే వాళ్లు కాబట్టి మూణ్నాలుగు లక్షలకూ కక్కుర్తిపడే కేరక్టర్లు అని పెద్ద సారే చెబుతున్నాడు అనుకుందాం… అసలు ఈ పథకమే లోపభూయిష్టం, ధనిక రైతులకు రైతుబంధు సాయం ఏమిటి అనేదే కదా ఇన్నేళ్ల విమర్శ… ఇప్పుడు ఆ తప్పు తెలిసొస్తున్నదా..? ‘ముచ్చట’ మొదటి నుంచీ చెబుతోంది… రైతుబంధు నిజంగా వ్యవసాయం చేసేవాడికి దక్కాలి, పథకం ఆశయం, సంకల్పం, ఆచరణ సరిగ్గా లేవు అని..! తెలంగాణలో ప్రాణాలకు రిస్క్ తీసుకుని, బోలెడు వ్యయప్రయాసలకోర్చి సాగు చేసేది కౌలు రైతులు… వాళ్లను కాదని, పొలం ఎవరి పేరిట ఉంటే వాళ్లకు వ్యవసాయంతో నిమిత్తం లేకుండా, ఏటా వేల కోట్ల ప్రజాధనం ఇవ్వడం ఓ అరాచకం అని చెప్పింది… ఎస్, నమస్తే తెలంగాణ వార్త ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఆ నిజం అంగీకరించింది… బెంజ్ మంత్రులకూ రైతుబంధు దక్కుతోంది అని… మరి ఈ పథకం ఎవరి కోసం కేసీయార్..? కౌలు రైతులకు కనీస భరోసా దక్కని ప్రభుత్వ విధానాల సార్థకత ఏమిటి సార్..?
ఈ రైతుబంధు వివరాలు కూడా పరమరహస్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ పొంకనాలు పోతోంది, చూశారుగా… పోనీ, కేసీయార్ పాత జిగ్రీ దోస్త్ ఈటల యవ్వారంతో, కేసీయార్ పత్రిక రాసిన ఈ వార్తతోనైనా ఈ పథకం కళ్లు తెరుచుకుంటాయా..? నిజంగా సాయం అందాల్సిన వాళ్లను పట్టించుకుంటుందా ఈ ప్రభుత్వం..? అబ్బే, తూచ్… అవన్నీ ఆలోచించడం మా ఇంటావంటా లేదంటుందా..? అంతేలే… ఈటల మీద మరో నాలుగు తిట్లు సంధించండి… అవి ఉల్టా తగిలేవి అంతిమంగా మన పథకాలకే…!! చివరగా :: రాజేంద్రలాగే ఇంకా ఏయే మంత్రులు ఏటా ఎంత సొమ్ము రైతుబంధు పేరిట కక్కుర్తిపడి తీసుకున్నారో కూడా రేపు బ్యానర్ స్టోరీ ప్రచురించి, ఆ కక్కుర్తిరాయుళ్లను ఇలాంటి కేరికేచర్లతోనే వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి… అన్నట్టు కేసీయార్ ఫామ్ హౌజుకు ఏమైనా సాయం దక్కుతోందా లేదా…? ఫాఫం..!!
Share this Article