సినిమా వాళ్లకు ప్రేక్షకులంటే… వాళ్ల జ్ఞానమంటే పరమ అలుసు…. ఎందుకంటే, తామే గొప్పవాళ్లమనీ, తమకు అన్నీ తెలుసని, తామేం చెప్పినా ప్రేక్షకుడనే ఎడ్డి ఎదవ నమ్మేస్తాడనీ, చప్పట్లు కొట్టేసి, జేబులు ఖాళీ చేసేసి, తమ బొక్కసం నింపేస్తాడనీ ఓ పిచ్చి భరోసా… చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసేది దిక్కుమాలిన మీడియా… నిజం… నిన్న నాగశౌర్య అనబడే ఓ కుర్ర హీరో ఏమన్నాడో తెలుసా..? ‘‘దేహంలో నీళ్లుంటే కండలు ఎక్స్‌పోజ్ కావు, అసలు ఎయిట్ ప్యాక్, అందుకే తొమ్మిది రోజులపాటు నీళ్లు తాగలేదు…’’ హహహ… నాగశౌర్య బుర్రలాగే ఉంది తన తాజా సినిమా లక్ష్య కూడా… మీరు లక్ష చెప్పండి, అది సినిమా ప్రారంభం నుంచే గతి తప్పింది, గురి తప్పింది, దారితప్పింది… ప్రేక్షకుడి గుండెల్లోకి కసుక్కున దిగింది… (ఓహో, ఎప్పటికప్పుడు నీళ్లు తాగితే అవి కండల్లో అలాగే ఉండిపోతాయా..? నీళ్లు తాగకపోతే మీ దేహం ఎండిపోయి, పదును తేలి, నూనెతో మర్దన చేసినట్టు కొత్త షైనింగుతో మెరుస్తుందా..? ఓహో, అందుకని అన్నిరోజులు పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదా..? అసలు ఈ జ్ఞానానికి కదా ఇంటర్నేషన్ అవార్డు ఇవ్వాల్సింది, తొక్కలో ఆర్చరీలో ప్రతిభ ఎవడిక్కావాలి..?)
భారతీయ ప్రేక్షకుడికి జల్లికట్టు ఎక్కుతుంది, క్రికెట్ ఎక్కుతుంది, కబడ్డీ ఎక్కుతుంది… సరిగ్గా కష్టపడాలే గానీ ఆర్చరీ కూడా ఎక్కుతుంది… అప్పుడెప్పుడో సై అనే సినిమాలో రాజమౌళి రగ్బీ అనే ఓ అపరిచిత ఆటను కూడా ప్రేక్షకులకు సరిగ్గా ఎక్కించగలిగాడు… అదీ నితిన్ అనే భావరహిత టీన్స్ హీరోతో… అంటే, ప్రేక్షకుడికి సినిమాలో ఓ ఎమోషన్ కావాలి, ఓ థ్రిల్ కావాలి, ఆ కథలో లీనం కావాలి, దాంతోపాటు ఓ కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకుంటే అదనంగా అలరిస్తుంది, ఆకట్టుకుంటుంది… నిజానికి ఆర్చరీలో హీరో శ్రమపడటం, అడ్డంకులు గట్రా మంచి వంటకమే… కానీ అది మరీ పథ్యం తిండిలా, రుచీపచీ లేని పచ్చడిలా వండేసి, నూరేసి, పొయ్యి మీద పెట్టేస్తే అది తుకపెక ఉడికి, చేదుగా గొంతు దిగదు… ఇదీ అంతే…
Ads
ఆర్చరీ మనకు కొత్తేమీ కాదు… వందలు, వేల ఏళ్ల తరబడీ జాతికి తెలిసిన యుద్ధవిద్యే… మనిషికి బాణం తెలిశాకే వేట పెరిగింది, రక్షణ కుదిరింది, ఆ ఆయుధం దేహంలో ఓ భాగంగా అమరింది… బాణవిద్యలో భారతీయులు అద్భుతాలు సృష్టించారు… ఎటొచ్చీ దాన్ని ఓ ఆటగా చూపించినప్పుడు, వర్తమాన క్రీడల్లో ఒకటిగా చూపించినప్పుడు, అవార్డులు, లక్ష్యాల నేపథ్యంలో చూపినప్పుడు… ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలంటే చాలా కసరత్తు అవసరం… ఓ కొత్తదనం అవసరం… ఆఫ్టరాల్, హీరో ఎయిట్ ప్యాక్ చేస్తే ఏమిటట..? ఐనా తొక్కలో బాడీ కాదు, ఆర్చరీలో నైపుణ్యానికి..! ఫిట్‌నెస్ అనేది ఏ ఆటకైనా అవసరమే… కానీ ఆర్చరీ నైపుణ్యానికి కాన్సంట్రేషన్, మెళకువ, సాధన, ఏకాగ్రత, బుర్ర ప్రధానంగా అవసరం… బట్టలిప్పి ఎనిమిది ప్యాకులు కాదు, ఎనభై ఆరు ప్యాకులు చూపినా సరే… ‘ప్యాకప్పే… ఇక్కడా అదే జరిగింది… అసలు కథానాయకుడి బవిరి గడ్డం, జుత్తు ముడి ఏమాత్రం సూట్ కాలేదు… గడ్డం ఈరోజుల్లో ట్రెండ్ కావచ్చు, సిక్స్-ఎయిట్ ప్యాకులు హీరో కష్టాన్ని చూపిస్తాయేమో తప్ప… ప్రేక్షకుడికి అవి ఆఫ్టరాల్ అంశాలు… ఓ హీరో దేహాన్ని చూడటానికి బోలెడు డబ్బు ఖర్చుచేసి, ఒమైక్రాన్ భయం నడుమ థియేటర్ దాకా రావాలా..?
ఈమాత్రం దానికి ముగ్గురు ప్రొడ్యూసర్లు అట… అసలు హీరో కేరక్టరైజేషనే సరిగ్గా లేనప్పుడు ఎంత మంది చేతులేస్తేనేం… చేతులెత్తేయడమే…! ఈ కథ లేవలేదు, వంట కుదరలేదు… ఓ తాత, ఓ మనవడు… ఆర్చరీలో తీర్చిదిద్ది, తన కొడుకు కల నెరవేర్చాలని అనుకుంటాడు… కానీ మధ్యలో ఏవో అడ్డంకులు… తాత చనిపోతాడు, వీడు డ్రగ్స్ కి బానిసవుతాడు… అలా దిగజారిపోయినవాడు తిరిగి నిలదొక్కుకోవడం అంటే బలమైన ఎమోషన్ కథలో చేరాలి… హీరో ప్రయత్నాల పట్ల సింపతీ ఏదో క్రియేట్ కావాలి… తనలో కసి పెరిగి, లక్ష్యం వైపు దూసుకుపోవడానికి బలమైన ‘కాన్‌ఫ్లిక్ట్ కావాలి, అవేవీ లేవు… ఏదో దిక్కుమాలిన తెలుగు టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా కథనం సా-గు-తూ ఉంటుంది… నాగశౌర్యుడిని వదిలేయండి కాసేపు… జగపతిబాబును ఆ రొటీన్ లుక్కులో చూసీచూసీ జనానికే విసుగొస్తోంది… మొహంలో కూడా ఆ ఒక్క ఎక్స్‌ప్రెషనే ఏళ్లుగా… ఏళ్లుగా…! ఏ పాత్రయినా అంతే… హీరోయిన్ కేతికశర్మ ఉందంటే ఉంది, అంతే… మిగతావాళ్ల గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు… ఎహె, సినిమా గురించే చెప్పుకోవడానికి ఏమీలేదు..!! అవునూ, లక్ష్యం అని గాకుండా లక్ష్య అని పేరెందుకు పెట్టారు..? భలేవారే, ఇదొక్కటేనా సినిమాలో రీజనింగు లేని అంశం… అన్నీ అంతే కదా..!!
Share this Article