ఇదేంటి, నా టీలో ఈగ ఉంది అంటుంది ఇంద్రజ… అదేంటి, నా రేంజుకు నా టీలో ఏనుగు ఉండాలి కదా అంటుంది రోజా… అందరూ పడీ పడీ నవ్వుతారు… నవ్వాలి, లేకపోతే రోజా ఫీలవుతుంది ఫాఫం… ఈ జోకు మీకు వెగటు పుట్టించినా సరే, చచ్చినట్టు నవ్వాల్సిందే అంటుంది ఈటీవీ… దీపావళి పండుగపూట వినోదం పేరిట ఓ చిత్ర నరకాన్ని చూపించాడు రామోజీరావు సాబ్… అసలు ఈటీవీ క్రియేటివ్ విభాగాన్ని ఎవరు చూసుకుంటున్నారో గానీ పండుగపూట ప్రేక్షకుల్ని చావగొట్టి చెవులు మూయించారు… అరె, రోజా ఈమధ్యే సర్జరీ చేయించుకుంది, బోలెడు రాజకీయ ఒత్తిళ్లు, వయస్సు మీద పడుతోంది, బోలెడు బరువు… ఐనా సరే, ఆయాసతో, ప్రయాసతో స్టెప్పులు వేయించి, కష్టమ్మీద ఆమెతో ఓ డాన్సు చేయించారు… అదేం డాన్సో, అది కంపోజ్ చేసిన బుర్రకే తెలియాలి… చూసేవాడికి మాత్రం దేవుడా, ఈ దీపావళి ఇంత దయనీయంగా గడుస్తున్నదేమిట్రా బాబూ అనిపించింది… ప్రతి ఈటీవీ స్పెషల్ షోలో ఈ డాన్స్ అనబడే ఓ ప్రహసనం ఉండాలా అమ్మా..?
ఒక దశకు చేరాక, మరీ రాజకీయాల్లో మునిగిపోయి, జనం సేవలోనే తరించిపోవాలని ఆశించే రోజులేమీ కావు ఇప్పుడు… పోనీ, జబర్దస్త్‌లోని వెగటు స్కిట్లకు చప్పట్లు కొడుతూ, నవ్వుతూ ఏదో జడ్జిమెంట్లు చెబుతూ ఉన్నదంటే ఈటీవీ చూసే ప్రేక్షకుల ఖర్మకు ఎవరు బాధ్యులులే అనుకోవచ్చు… నెలనెలా డబ్బులు తెచ్చిపెట్టే ప్రోగ్రాంను ఆమె వదులుకోవాల్సిన అవసరం లేదులే అని కూడా సానుకూల దృక్పథంతో అనుకోవచ్చు… కానీ ఈ డాన్సులు చేయడం జీవహింస కాదా మేడమ్ గారూ..?! ఇంతేనా..? మొత్తం మూడు గంటల దీపావళి స్పెషల్ షో ‘తగ్గేదేలే’ అంతా పరమ బోర్… ఒకరిని మించి మరొకరు తగ్గేదేలే అనుకుంటూ విసిగించేశారు… వేరే టీవీలేవీ పండుగ స్పెషల్స్ ఏమీ వేయలేదు, బహుశా సరిపడా యాడ్స్, డబ్బు దొరకలేదేమో… ఈటీవీకి ఆస్థాన కళాకారులున్నారు కదా, ఓ పదిమందినీ పిలిచి కథ నడిపించేసింది… మామూలుగా పండుగ స్పెషల్స్‌లో కనిపించినట్టు హంగామా లేమీ లేదు… జస్ట్, ఓ కిట్టీ పార్టీ తరహాలో… నిజంగా అంతే… ప్రదీప్ ప్లస్ నలుగురు జడ్జిలు… వీళ్లు గాకుండా రోహిణి, చంటి, పండు, మరో ఢీ డాన్సర్, ఆది, రాంప్రసాద్, రీతూ, మరో ఒకరిద్దరు… ఎలాగూ ఆది ఓవరాక్షన్ సరేసరి… తను పంచులు అనుకుంటున్నాడు గానీ అవి రానురాను చిరాకెత్తిస్తున్నయ్… (అసలు సుడిగాలి సుధీర్‌ను పక్కన పెట్టేయడం ఎందుకో అర్థం కాలేదు…)
Ads
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ జడ్జిలు పూర్ణ, రోజా, ప్రియమణి, ఇంద్రజ… అయిదుగురు హీరోయిన్లు అంటూ ముసలోళ్లు, నడివయస్సోళ్లతో పాటు ఆ మున్నార్ చోప్రా అనబడే ఓ పసిబాలికను ఎందుకు వాళ్ల సమానస్థాయిలో ఎందుకు కూర్చోబెట్టారో మరి తెలియదు… ఆమెకు తెలుగు రాదు, తెలియదు… ఓ పాటకు డాన్స్ చేసింది… అసలు ఆమె డాన్సించిన లాహే లాహే పాట భక్తిపాటో, రక్తిపాటో, విముక్తిపాటో, ప్రేక్షకుల వైరాగ్యపాటో అర్థం గాకుండా స్టెప్పులు వేసింది… అంతే, ఇక బొమ్మలా కూర్చుండి పోయింది… పూర్ణ ఏదో ఓ పిచ్చిపాటకు నాలుగు స్టెప్పులు వేసి, నాలుకను అటూఇటూ తిప్పి, నడుంను కూడా తిప్పినట్టు కష్టపడి షో ఆరంభంలోనే వెళ్లిపోయింది… మళ్లీ కనిపిస్తే ఒట్టు… రీతూ ఎందుకొచ్చిందో తెలియదు… వీళ్లతో డాన్సులు చేయించడం వరకూ వోకే… ఏదో కష్టపడ్డారు… ప్రియమణి డాన్సులో గ్రేస్ ఉంటుంది, మిగతావాళ్లు హోప్లెస్… అన్నింటికీ మించి విసిగించింది ఆది, రాంప్రసాద్ తదితరుల పాటలు… మీకో దండంరా బాబూ అనాలనిపించింది… ఇదేం వినోదమో ఈటీవీకే తెలియాలి… పండుగ స్పెషల్ అంటే ఇలా హింసపెడతారా..? మీ జిమ్మడిపోను…!! కాకపోతే వేరే దిక్కులేదు కాబట్టి, వేరే చానెళ్లలో దిక్కుమాలిన సినిమాలు ఏవో వేశారు కాబట్టి, ఈ ఈటీవీ షోకు రేటింగ్స్ బాగానే వస్తాయి… సో, ఇది బాగానే ఉంది కదానుకుని వచ్చే మరో పండక్కి ఇంకొకటి ఇలాంటి తిక్క స్పెషల్ ప్లాన్ చేస్తారు, అది మరో ఖర్మ…!!
Share this Article