.
Prasen Bellamkonda ………. బౌలర్ బచావ్ పథకం ప్లీజ్
……………………………..
అవును…
ఇప్పుడు ఇది బాట్స్మన్స్ గేమ్. బౌలర్లు సెకండ్ క్లాస్ సిటిజెన్లే.. పాపం.
క్రికెట్ కు పేరు మార్చి బ్యాటింగ్ అని పెట్టుకోండి అని ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ ఎక్కిరించాడూ అంటే ఎక్కిరించడా మరి…
**
పృడెన్శియల్ కప్ ఫైనల్ లో బల్విందర్ సింగ్, గ్రీనిడ్జ్ కు వేసిన బంతిని ఎవరు మరిచిపోగలరు. వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టిక్ పడ్డ బంతిని రాక్షసుడు గార్డన్ గ్రీనీడ్జ్ వెల్ లెఫ్టనుకున్నాడు. అది సొగసుగా లోపలికి మెలి తిరిగి స్టిక్స్ ని చెదరగొట్టింది.
నలభై రెండేళ్ల క్రితపు జ్ఞాపకం ఇంకా కళ్ళ ముందే ఉంది.
Ads
**
చంద్ర చంద్ర చంద్ర అని స్టేడియం మొత్తం లయబద్ధంగా అరుస్తుంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అని విదేశీ మీడియా వెటకరించిన మన అనార్థడాక్స్ స్పిన్నర్ చంద్రశేఖర్ వేసే బంతిని టానీ గ్రేగో, ఫ్రెడ్రిక్సో ఆడలేకపోవడం ఎంత సౌందర్య సందర్భమో.
చంద్ర, బేడీ, ప్రసన్న ల త్రిశూల వ్యూహం కన్నుల పండువే కదా.
**
షేన్ వార్న్ వేసిన ఒక బంతి లెగ్ స్టిక్ కి సుదూరంగా పడి బ్యాట్స్మన్ కాళ్ళ వెనుక నుంచి ఆఫ్ స్టిక్ ను ఎగరగొట్టడం ఎంత అద్భుత దృశ్యమో కదా.
క్రికెట్ ప్రేమికుడనేవాడు క్లీన్ బౌల్డ్ కాక ఏమవ్వగలడు ఆ అరౌండ్ ది లెగ్స్ బంతికి.
**
యాండీ రాబర్ట్స్ భీకరంగా ఉరికొచ్చి విసురుగా విసిరినా
మాల్కమ్ మార్షల్ సుతారంగా కదిలి కూడా అంతే వేగంతో వేసినా బ్యాటర్ ముక్కు ముందు నుంచి వెళ్లే బంతి భయధసౌందర్యం అబ్బురమే కదా.
వెస్టిండీస్ బౌలర్ల రనప్ లన్నీ
గజగమనాలే.
**
తన బంతి ఎన్ని మెలికలు తిరుగుతుందో అన్ని మెలికలు తను కూడా తిరిగే అబ్దుల్ ఖాదిర్ స్పిన్ ను దాయాది వైరమూ మరిచి షెభాషన్న మంచితనం వెనుక ఉన్నది బౌలింగ్ కళారాధనే కదా.
అదీ స్పిన్ చమత్కారం.
**
బాడీలైన్ సిరీస్ లో జోర్డన్, వొస్ లు లగెత్తుకొచ్చి బ్యాటర్ల డొక్కలకు గురి పెడుతుంటే ఆస్ట్రేలియన్లు సుస్సు పోసుకున్న క్రూర వ్యూహమూ
బంతి విసురు నైపుణ్య పరాకాష్ట కాదా.
బౌలింగ్ నియమాలనే తిరగరాసిన భీకర విసుర్లు అవి.
**
తన క్రికెట్ కేరీర్ మొత్తంలో ఒక్క నోబాల్ కూడా వేయని
కపిల్ దేవ్ క్రమశిక్షణ అచ్చెరువే కదా.
నోబాల్ లేని మ్యాచు మేడిన్ ఓవరూ ఒన్స్ ఇన్ ఏ బ్లూ మూనే మరి.
**
కొన్ని క్రోసుల దూరం నుంచి షోయబ్ అఖ్తర్ వడిసెల వదిలిన రాయిలా వచ్చి వేసిన బంతితో బ్యాట్స్మన్ కు నషాళం మండచ్చు కానీ క్రికెట్ లవర్ కు మాత్రం అది ప్రియ గోళమే .
అఖ్తర్, బ్రెట్లీ కలిస్తే అది నిజంగా మర్మకళే.
**
వరల్డ్ కప్ సెమిస్ లో మోహిందర్, కీర్తి ఆజాద్ 24 ఓవర్లు వేసి కేవలం 55 పరుగులే ఇచ్చారని చెపితే నమ్ముతారా ఎవరైనా..
ఏమయ్యాయివన్నీ…
ఏం జరుగుతోంది?
300 లోడింగ్ అట…
అదీ ఇరవై ఓవర్లలో…
బౌలర్లేమై పోవాలి..
*****-
గతేడాది SRH vs RCB మాచ్ లో రెండు జట్లు నలభై ఓవర్లలో 549 పరుగులు చేయడం కళ్ళారా చూసిన నాకు ఒకసారి రింగులు రింగుల్లో వెనక్కి వెళితే పొట్ట ‘చెక్కా’లయ్యే నవ్వొచ్చింది.
మొన్నటికి మొన్న అదే srh 286 కొట్టినపుడూ అలానే అనిపించింది. ఎందుకంటే ఆఫ్ అండ్ మిడిల్ స్టిక్ మీది బాల్ ను ఆఫ్ సైడ్ మాత్రమే ఆడాలనుకునే మూఢత్వం ఒకప్పుడు ప్రబలంగా ఉండేది . మరి ఇప్పుడేమో వైడ్ అవుటాఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ను ఫైన్ లెగ్ మీంచి కొట్టే కాలం.
కనుక నవ్వే వస్తది.
పృడెన్శియల్ కప్ రోజుల్లో 60 ఓవర్ల మ్యాచ్ లో 240 డిఫెన్డబుల్ స్కోర్ అనుకునేవాళ్ళం. ఫైనల్ లో 60 ఓవర్లలో 183 కొట్టలేక వెస్టిండీస్ కప్పు చేజార్జుకుందని ఐపిఎల్ స్టేడియం లో కూచున్న ఇవాల్టి కుర్రోళ్లకు చెపితే నోటితోనే నవ్వుతారనే గ్యారెంటీ లేదు.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 60 ఓవర్లలో 250 చేస్తే చాలు తడిగుడ్డేసుకుని పడుకుని గెలిచేసేది.
అలా అలా ఒకవైపు ఓవర్లకు కోతపెట్టుకుంటూ స్కోర్లేమో వటుడింతింతై అన్నట్టు పెరిగి పెరిగి ఇలా ఇరగదీస్తోంది.
అవును ఇట్స్ బ్యాట్స్మన్స్ గేమ్.
60 ఓవర్ల మ్యాచ్ లో అత్యధిక స్కోర్ 334 మాత్రమే. ఆ తరవాత 60 ఓవర్లు కాస్తా 50 కి తగ్గాక కూడా 250 డిఫెండబుల్ గా ఉండేది. మెల మెల్లగా అది 300 కు చేరింది. ఆస్ట్రేలియా మీద 434 ఛేజ్ చేస్తూ దక్షిణాఫ్రికా గెలుపు కొట్టినపుడు కలీస్ ‘ వాళ్ళు ఇంకో పదిహేను పరుగులు తక్కువ కొట్టారు ‘ అన్నాడంటే ఎంత మార్పో అర్ధం చేసుకోవచ్చు.
అప్పటికి 50 ఓవర్ల అత్యధిక స్కోర్ 481.
ఒక 50 ఓవర్ల మ్యాచ్ లో ఇంగ్లాండ్ 470 కొడితే హమ్మయ్య 500 కొట్టకుండా ఆపగలిగాం అనుకుందట ఆస్ట్రేలియా.
ఆ తరవాత 50 ఓవర్ల మ్యాచ్ లు కూడా బోర్ కొట్టడం మొదలయాక పొట్టి ఫార్మాట్ 20 కి మరుగుజ్జయిన మొదట్లో 160 కొడితే చాలనుకునేవాళ్ళు. అది అలవోకగా 180 మీదుగా 200 కు చేరింది. ఇప్పుడు 225 ను, 250 ని కూడా సులాగ్గా ఛేజ్ చేసేస్తున్నారు. 277 ఛేజ్ చేస్తూ 241… 287 ఛేజ్ చేస్తూ 262 కొట్టడం 60 ఓవర్ల పృడెన్శియల్ కప్ రోజుల్లో కలలో కూడా లేదు.
Ipl రికార్డ్ 287, టి ట్వంటి రికార్డ్ 314. బహుశా ముందు ముందు 50 ఓవర్లలో 400….
20 ఓవర్లలో 250 సర్వ సాధారణం అయిపోతుందేమో.
ఇప్పుడేమో 300 లోడింగ్ అంటున్నారు.
ఇప్పటికీ అందమైన యార్కర్ వేసే భూమ్రా, ఇప్పటికీ బౌలింగ్ మాంత్రికుడిగా నిలిచిన రషీద్ లాంటి కొందరు ఈ చౌకే చెక్కా లోకంలో పాపం లివింగ్ డేంజరస్లీ.
ఓవర్ కు నాలుగు ఇచ్చే ఇరుకు నుంచి ఓవర్ కు 15 ఇచ్చే ఉదారతకు బౌలర్ ఎదిగాడని మనోభావాలను దెబ్బ తీసుకుంటూనే ఈ ఊచకోతలో కూడా బ్యాటర్లను గింగిరాలు తిప్పుతున్న వరుణ్, అశ్విన్, నరైన్, షమీల లాంటి చాలా మందికి, బౌలింగ్ అనే థాంక్ లెస్ జాబ్ ను, కొడి గడుతున్న దీపాన్నీ అరచేతులు అడ్డు పెట్టి ఆ చేతులు కాల్చుకుంటూనే కాపాడుతున్న అందరికీ సలాం కొడుతూ…
ఎందరో బౌలర్లు అందరికీ రిప్పులు.
***
ప్లీజ్
క్రికెట్ నియమాలను కొంచెం బౌలర్లకు అనుకూలంగానూ చెయ్యండి గురూ. వాళ్ళ కోసమున్ను పిచ్ లు వేయండి సారూ.
సిక్సులు ఫోర్లలోనే కాదు మజా… ఒక జట్టు 90 కి ఆలవుటయితే రెండో జట్టు ముక్కీ మూలిగీ చివరి బంతికి 91 వ పరుగు తీస్తే కూడా, లేదూ తీయలేకపోతే కూడా బోలెడంత కిక్కుంటది..
బౌలింగ్ ఒక కళ.
అది అంతరించి పోకుండా కాపాడుకుందాం.
బౌలర్ బచావ్!
Share this Article