.
గుర్తుంది కదా… మాల్దీవుల మంత్రులు మన దేశం మీద విషం కక్కారు… తరువాత మోడీ వెళ్లి లక్షద్వీప్ బీచులో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎఫెక్ట్ మాల్దీవుల మీద విపరీతంగా పడింది…
ఇండియన్ టూరిస్టులు దాదాపు నిషేధించారు అక్కడికి వెళ్లడాన్ని… మరీ కొందరు చెత్తా సెలబ్రిటీలు తప్ప… మొదట్లో చైనా మీద ఆశలు పెట్టుకున్నా, ఫలించక, ఇక తరువాత మాల్దీవుల నాయకులు కాళ్లావేళ్లా పడినంత పనిచేశారు.., మీ టూరిస్టులు రాకపోతే చచ్చిపోతాం అని…
Ads
పహల్‌గామ్ ఉగ్రఘాతుకం, ఆపరేషన్ సిందూర్ దేశప్రజల్లో ఎంతటి భావోద్వేగాల్ని రేకెత్తించాయో తెలుసు కదా… ఆ ధూర్త ఉగ్రదేశం పాకిస్థాన్‌కు మద్దతు పలికిన దేశాలు ఏమిటో తెలుసా..? తుర్కియే, అజర్ బైజాన్… ఆమధ్య మన పర్యాటకులు మాల్దీవులతోపాటు ఎక్కువగా ఈ రెండు దేశాలకు కూడా వెళ్లేవాళ్లు…
ఎప్పుడైతే ఆ రెండు దేశాలూ పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించాయో, ఇక పర్యాటకులు అక్కడికి వెళ్లడం మానుకుంటున్నారు… స్వచ్ఛందంగా… ఎవరూ పిలుపునివ్వలేదు… ఎవరూ ఆంక్షలు పెట్టలేదు… ఎవరికి వాళ్లే ఆ రెండు దేశాలకు వెళ్లకుండా నిగ్రహం పాటించడం… అది ఆ రెండు దేశాల మీద ఆగ్రహ ప్రకటన…
తుర్కియేకి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గత మూడు నెలల్లో సగం తగ్గినట్టు ఇప్పటికే నివేదికలు వెలుగులోకి వచ్చాయి… ఇప్పుడు అదే పరిస్థితి అజర్‌బైజాన్‌ది కూడా…
జూన్‌లో 66% తగ్గిన భారతీయ పర్యాటకులు
అజర్‌బైజాన్ అధికారిక పర్యాటక గణాంకాల ప్రకారం.., 2024 జూన్ నెలలో కేవలం 9,934 మంది భారతీయ పర్యాటకులు మాత్రమే ఆ దేశానికి వెళ్లారు… గత సంవత్సరం ఇదే జూన్ నెలలో ఈ సంఖ్య 28,315... ఇది దాదాపు 66 శాతం తగ్గుదల... మే నెలలో 23,326 మంది భారతీయులు అజర్‌బైజాన్‌కి వెళ్లగా, జూన్‌లో ఓ భిన్నమైన స్పష్టంగా కనిపించింది…
భారత మ్యాపును తప్పుగా చూపిన అజర్‌బైజాన్
అజర్‌బైజాన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో భారతదేశ భూచిత్రాన్ని తప్పుగా చూపించడం కూడా పర్యాటకుల ఆగ్రహానికి మరో కారణం… జమ్ము కాశ్మీర్‌లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారతదేశానికి చెందని భాగాలుగా చూపించారు… ఇది కూడా భారతీయులలో దేశభక్తిని రేకెత్తించింది…
పాక్‌కు మద్దతు — త్రైపాక్షిక సమావేశాలు
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మే నెలలో అజర్‌బైజాన్‌కి వెళ్లి, ఆ దేశ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు… తుర్కియే, అజర్‌బైజాన్, పాకిస్థాన్‌ల మధ్య త్రైపాక్షిక సమావేశాలు కూడా జరిగాయి… అజర్‌బైజాన్ గతంలో భారత్‌ను కీలక పర్యాటక మార్కెట్‌గా పేర్కొనగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది…
తుర్కియేకు కూడా గట్టి ఎదురుదెబ్బ
తాజా గణాంకాల ప్రకారం.., 2024 జూలైలో తుర్కియేను సందర్శించిన భారతీయుల సంఖ్య కేవలం 16,244 మాత్రమే… ఇది మే నెలలో వచ్చిన 31,659 పర్యాటకులతో పోలిస్తే సగానికి తగ్గిపోయినట్టు చూపిస్తుంది… గత ఏడాది ఇదే నెలలో 28,875 మంది భారతీయులు తుర్కియేకు వెళ్లారు… అంటే, ఇది 44 శాతం తగ్గుదల…
పర్యాటక సంస్థల చర్యలు
భారతదేశపు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్ అయిన MakeMyTrip, EaseMyTrip వంటి సంస్థలు తుర్కియే, అజర్‌బైజాన్‌కు ప్యాకేజీలను తగ్గించడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో అసలు ప్రోత్సహించడం లేదు. సామాజిక మాధ్యమాల్లో కూడా #BoycottTurkey , #BoycottAzerbaijan వంటి క్యాంపెయిన్‌లు ఊపందుకున్నాయి…
ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత సార్వభౌమత్వంపై దూషణలు చేసిన దేశాల ధోరణిపై భారతీయుల అవగాహన, ఆగ్రహం పెరిగింది… ఇది పర్యాటక రంగంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోంది… మన ప్రజల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…!
Share this Article