బ్రహ్మాస్త్ర సినిమాకు వెళ్లాలని భావించే ప్రేక్షకుల కోసం చిన్న చిన్న క్లారిటీలు… 1) పురాణాల్లోని దివ్యాస్త్రాల వాస్తవ వివరణ ఏమీ ఉండదు ఈ సినిమాలో… ఆ బ్రహ్మాస్త్రం పేరు వాడుకున్నారు, అంతే… అన్నింటికీ మించి బ్రహ్మాస్త్రం ఒకటే అన్నట్టుగా చిత్రీకరించడం, దాన్ని 3 భాగాలుగా ముక్కలు చేసి, వేర్వేరు చోెట్ల దాచినట్టు చూపడం ఇంకా అబ్సర్డ్… కథలో చూపించిన మిగతా అస్త్రాల ప్రస్తావన కూడా ఏమాత్రం పౌరాణిక జ్ఞానం లేని రచన మాత్రమే… బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలిసిన వ్యక్తులు ఇద్దరో ముగ్గురో ఒకేసారి దాన్ని సంకల్పించి, మంత్రిస్తే అందరి ధనుస్సుల మీదకూ బ్రహ్మాస్త్రాలు వస్తాయి… సో, బ్రహ్మస్త్రం అనేది ఒక స్థిర భౌతికరూపం కాదు, ముక్కలు చేసి దాచిపెట్టే ఆయుధమూ కాదు…
2) అమిష్ త్రిపాఠీ అనే ఇంగ్లిష్ పాపులర్ ఫిక్షన్ రచయిత శివ ట్రయాలజీ (శివ త్రయం) రాశాడు… అనేక భాషల్లోకి దాన్ని అనువదించారు… శివపురాణాన్ని కొత్తగా తన దృక్కోణం నుంచి రాశాడు… తెలుగులో నాగా రహస్యం, మెలూహా మృత్యుంజయులు, వాయుపుత్ర శపథం పేరిట వచ్చాయి ఆ పుస్తకాలు… అదొక అడ్డదిడ్డం ఆలోచనల సమాహారం… అయితే ఇప్పుడు తీసిన బ్రహ్మాస్త్రం సినిమా ఆ అమిష్ త్రిపాఠీ కథ ఒక్కటేనా అని చాలామంది సందేహం… ఇది ఆ కథకాదు, ఆ శివత్రయానికి సంబంధమే లేదు… ఇదొక చందమామ కథ… కాకపోతే కథానాయకుడి పేరు శివ… అంతే…
…. సహజంగానే పిల్లలు త్రీడీ, గ్రాఫిక్స్, ఫాంటసీలను ఇష్టపడతారు కాబట్టి బ్రహ్మాస్త్రం సినిమా పట్ల ఆసక్తి కనబరుస్తారు… అందుకే ముందుగా కాస్త కథాకమామిషు తెలుసుకుని వెళ్తే బెటర్ కాబట్టి ఈ క్లారిటీ… బ్రహ్మాస్త్రం మూడు ముక్కలుగా చీల్చబడి, వేర్వేరుచోెట్ల దాచిపెట్టబడి ఉంటుంది… వాటిని సాధించి అపూర్వశక్తుల్ని పొందాలని దుష్టశక్తుల ప్రయత్నం… వాటిని అడ్డుకునే శక్తిమంతుడిగా కథానాయకుడు… తనకు ఓ ప్రేమకథ… ఇదీ సంక్షిప్తంగా బ్రహ్మాస్త్రం సినిమా కథ…
Ads
మరి సినిమా ఎలా ఉంది..? అమెరికా ప్రీమియర్ షోల ఫీడ్ బ్యాక్ ప్రకారం ఇది మరీ బ్రహ్మాస్త్రం ఏమీ కాదు… కాకపోతే మరీ తీసిపారేయదగిన సినిమా కూడా కాదు… ఎందుకంటే..? కాస్త నాణ్యమైన గ్రాఫిక్ వర్క్ కనిపిస్తుంది… పెట్టిన వందల కోట్ల ఖర్చుకు సరిపడా భారీతనం కూడా గ్రాఫిక్స్‌లోనే ఉంది… అంతేతప్ప కథ, కథనాల్లో పెద్దగా కొత్త పోకడలు, ఆసక్తికరమైన థ్రిల్లింగ్ నడక ఏమీ కనిపించవు… పైగా ఫస్టాఫ్ ఎక్కువగా రణబీర్, ఆలియాల ప్రేమ వ్యవహారానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు… వాళ్ల కెమిస్ట్రీ బాగానే ఉన్నా సరే, వాళ్ల ప్రేమకథ ఉత్త రొటీన్, బోరింగ్ యవ్వారం…
దర్శకుడు కూడా ఎంతసేపూ గ్రాఫిక్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు తప్ప, పలుచోట్ల సీన్లను ఇంకాస్త ఎలివేట్ చేయడానికి ఉపయోగపడే బీజీఎం మీద దృష్టిపెట్టలేకపోయాడు… ఇలాంటి సినిమాలకు ప్రాణం బీజీఎం… తనకు కావల్సిన ఔట్‌పుట్ సంగీత దర్శకుడి నుంచి సాధించడంలో దర్శకుడి వైఫల్యం ఇది… గ్రాఫిక్స్ ప్రధానమైన సినిమా కాబట్టి పెద్దగా డైలాగులకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు… రణబీర్ తనకు చేతనైనంతగా బాగానే కష్టపడ్డాడు… తన నిజజీవన సహచరి ఆలియాభట్ నటనకు వంకపెట్టడానికి ఏముంటుంది..? అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్… చివరకు విలన్‌గా చేసిన మౌనీరాయ్ సహా అందరూ బాగానే చేశారు…
కాకపోతే హిందీ నుంచి తెలుగు డబ్బింగ్ కదా, కృతకంగా అనిపిస్తూ ఉంటుంది… మూడు పాటల రచన కూడా అంతే… ఆ ట్యూన్లలో సరైన తెలుగు పదాల్ని ఇరికించడానికి చంద్రబోస్ బాగానే కష్టపడ్డాడు… కానీ సరిగ్గా అతకలేదు… ఆ భావమేమిటో ఓపట్టాన అర్థం కాదు… చివరగా… త్రీడీ, గ్రాఫిక్స్, ఫాంటసీ ఇష్టపడేవారు, ఇలాంటివి థియేటర్లలోనే చూస్తే బాగుంటాయి అనుకునేవాళ్లు ఓసారి సినిమా వీక్షణానికి సాహసించవచ్చు… పర్స్ ఖాళీ కూడా తప్పదు… ఎటొచ్చీ ఇతర ప్రేక్షకులు పురాణకథల్లోని దివ్యాస్త్రాల విశేషాల్ని కూడా మన సినిమావాళ్లు భ్రష్టుపట్టించారు అని బాధపడితే మాత్రం లాభం లేదు..! కథాకథనాల్ని గాలికి వదిలేసి, కేవలం గ్రాఫిక్స్‌తో రంజింపచేస్తానని అనుకున్న దర్శకుడి ఆలోచన సక్సెస్ అవుతుందో లేదో వసూళ్లలో చూడాలిక…!!
Share this Article