Amarnath Vasireddy……. చైనీయులు , మెక్సికన్లు , భారతీయులు – అమెరికాను గత కొన్నేళ్లుగా ముంచెత్తుతున్న వారు . మెక్సికన్లు ఎక్కువమంది అక్రమంగా ; భారతీయులు ఎక్కువ మంది వీసా చట్టాల్లోని లోపాల ఆధారంగా ; చైనీయులు తమదైన పద్దత్తుల్లో…
ఉన్నత చదువులకని పోవడం , అక్కడే స్థిరపడిపోవడం ; దరిమిలా అమెరికాలో కొత్తగా వలస వచ్చిన వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం . ఒక పక్క తమ ఉపాధికి గండిపడడతో, అక్కడి పౌరుల్లో వీరి పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది .
శ్వేత జాతీయుల్లో రంగు జాతి { అంటే బ్రాన్ కలర్ లో ఉన్న ఇండియన్స్ , ఎల్లో కలర్ లో ఉన్న చైనీస్ ఇంకా మెక్సికన్స్ } పట్ల పెరిగిన వ్యతిరేకత కు చిహ్నమే- డోనాల్డ్ ట్రంప్ … ట్రంప్ ఓడిపోయాడు- బిడెన్ గెలిచాడు . లేకుంటే ఇప్పటికే అక్రమ వలసదారులపై కఠినమయిన చర్యలు ఉండేవే .
Ads
ట్రంప్ జాత్యహంకార చర్యలను, ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికాకు వెళ్లి ఇప్పుడు అక్కడి పౌరసత్వం సాధించిన భారత మూలాలు కలిగిన వారు వ్యతిరేకించారు . భారత మూలాలు గణనీయంగా ఉన్న కాలిఫోర్నియాలాంటి రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ, అదే ట్రంప్ ఓడిపోవడానికి ఇది ప్రధాన కారణం .
ఇక్కడి మీడియా “మనాళ్ళు” “మనాళ్ళు” అని అందర్నీ గంపగుత్తగా పిలిస్తుంది . ఏదైనా విషయంపై లోతైన అవగాహహన లేకుండా విశ్లేషణ చేస్తే అలాగే ఉంటుంది . మనాళ్ళు స్థూలంగా మూడు రకాలు .
కొబ్బరి వారు : వీరు y2k సంక్షోభానికి ముందు అంటే 2000 సంవత్సరానికి ముందు అక్కడికి పోయిన వారు . ప్రతిభ కలిగిన వారు . ఇప్పుడు వీరు అక్కడి పౌరులయి పోయారు . వీరి సంతానం , మనవళ్లు అమెరికా పౌరులు . “2000 సంవత్సరం తరువాత కుప్పలుతెప్పలుగా భారతీయులు వచ్చేస్తున్నారు . కనీసం ఇక్కడి చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడం రాదు . దీనితో ఇక్కడి వారిలో భారతీయులంటే అసహనం , ద్వేషం పెరుగుతోంది . దీని ప్రభావం మనపై, ముఖ్యంగా కొత్త తరం అంటే… మన మనవళ్లు, మనవరాళ్ళపై పడుతుంది “అని వీరు ఆందోళనలో వీరున్నారు .
మధ్య రకం : వీరు 2000 సంవత్సరం తరువాత వెళ్లిన వారు . వీరి పిల్లలు ఇప్పుడు అక్కడి పౌరులు . వీరిలో కొంతమేర కొబ్బరి వారి ఆలోచనలు వస్తున్నాయి .
కొత్త సరుకు- చెత్త సరుకు సరిగ్గా గిరి గీసి, ఫలానా సంవత్సరం నుంచి అని చెప్పడం కష్టమే కానీ ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది . కొత్తగా వెళ్లేవారందరూ ఎందుకు పనికిరాని వారు అని చెప్పడం సత్య దూరం అవుతుంది . 2000 సంవత్సరానికి ముందు వలస వెళ్లిన వారికంటే ఇంకా ప్రతిభావంతులు, కష్టపడే స్వభావం కలిగిన వారు ఈ యంగ్ జనరేషన్ లో కూడా వున్నారు . కానీ సమస్య ఏంటంటే ఇలాంటి వారి సంఖ్య తక్కువ .
2000 సంవత్సరానికి ముందు అమెరికా కు వెళ్లాడంటే ” అమ్మా ! ఎంత గ్రేట్ అచీవ్మెంట్” అనే పరిస్థితి . ఇప్పుడో ?
గుజరాతీయులది మరో దారి . వారు వ్యాపారంలో కింగ్ లు . లొసుగుల్ని వాడుకోవడం వారికి డోక్లాతో పెట్టిన విద్య . ఇక తెలుగు వారిది మరో దారి . ప్రాక్సీ దారిలో వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది . చైనీయులు తెలివైన వారు సుమీ .. వారికి మంచి విజన్ ఉంటుంది . గొర్రె దాటు తనం తక్కువ . రాబోయే సమస్యలని పసికట్టారు . కరోనా తరువాత అమెరికాకు ఉన్నత విద్య కోసం { ఉన్నత విద్య ఉత్తుత్తి మాట . ఉన్నత విద్య అయిన వెంటనే తిరిగి వచ్చేస్తాను అని సైన్ చేసిన వారిలో ఒక శాతం కూడా తిరిగి రారు కదా . అసలు వెళ్ళేదే ఉపాధి కోసం } వెళ్లే చైనీస్ సంఖ్య ఇప్పుడు యాభై శాతానికి పడిపోయింది . భారతీయుల సంఖ్య మాత్రం తగ్గడం అటుంచి, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది .
” అప్పుడు పోయిన వారు సెటిల్ అయిపోయారు . మనం మాత్రం ఎందుకు కాకూడదు?” అని వీరి ఆలోచన . సక్రమ మార్గంలో వెళితే అదొక పధ్ధతి . ఆలా కాకుండా తప్పుడు మార్గాల్లో వెళితే ? గతంలో, అంటే 2000 సంవత్సరం తరువాత అక్రమ మార్గంలో వెళ్లిన వారి సంఖ్య తక్కువ . క్రమేపీ ఇలా అక్రమంగా వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది . ఇప్పుడు సంతృప్త స్థాయికి చేరుకొంది .
ఇప్పుడు శ్వేత జాతి వారి ఆగ్రహమే కాదు . కొబ్బరివారి ఆగ్రహానికి కూడా వీరు గురికావలసి వస్తోంది . ఎవరి ఆగ్రహం అనే పాయింట్ కన్నా .. చట్టాన్ని తుంగలో తొక్కి అడ్డదారుల్లో వెళ్లి” అంతా శుభమే జరగాలి” అనుకొంటూ .. “మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి .. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి ” అంటూ పాడుదాము అనుకోవడానికి ఇదేమైనా సినిమానా?
మరింత గడ్డుకాలం రానుందా ? ట్రంప్ స్థానంలో బహుశా, వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అవుతాడు . రిపబ్లికన్ పార్టీకి శ్వేత జాతీయుల్లో ఆదరణ ఇప్పటికే ఉంది. ఇప్పుడు కొబ్బరి వారి ఆదరణ జోడవుతోందా? ఎస్ అనే చెప్పొచ్చు . లక్షలాది మంది వలస వచ్చేస్తే శ్వేత జాతీయులకంటే తమకే ఎక్కువ నష్టం అనే భావన వారిలో పెరుగుతోంది . 10 డౌనింగ్ స్ట్రీట్ లోనే కాదు { అది కేవలం పబ్ అనుకొనే వారూ వుంటారు } శ్వేత సౌధంలో కూడా భారత మూలాల వ్యక్తుల్ని, బహుశా మనం త్వరలో చూస్తాము .
వివేక్ కాకపోతే మరొకరు . ఏ దేశమైనా తన ప్రయోజనాలని కాపాడుకుంటుంది . చట్టాన్ని తుంగలో తొక్కి లక్షలాది మంది వస్తుంటే అది తమ దీర్ఘ కాలిక ప్రయోజనాలకు విఘాతం అని చర్యలు తీసుకుంటుంది . కదా ? వివేకా లేక ఇంకొకరా అని కాదు సమస్య . మన వివేకం ఏమైంది అని ప్రశ్నించుకోవాలి . ఎందుకు ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ సంపాదించే వయసులో అక్కడికి వెళ్లి పోవాలి అనుకొంటున్నారు ? ఎందుకు ప్రతి తల్లితండ్రి ” బిడ్డ అక్కడికి పోతేనే హ్యాపీ” అని ఫీల్ అవుతున్నారు ?
ఇప్పుడు మనం గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఉన్నాము. ఎక్కడికైనా పోవచ్చు . అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చు . తప్పు కాదు . న్యాయం ..
కానీ వెళ్ళడానికి అనుసరించే పద్ధతులు ? వెళుతున్న వారి సంఖ్య ? ఇక్కడి ప్రభుత్వాల్లో , నాయకుల్లో , విద్యావేత్తల్లో, సమాజంలో మేధో మధనం జరగాలి . అమెరికాకు ఎగుమతి చెయ్యడానికే బిడ్డల్ని కనే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ? ఎన్నాళ్ళు ? పోనీ ఇప్పుడు సమస్య రాదనుకొంటే ఇలాగే మరో వందేళ్లు .. వెయ్యేళ్లు సాగుతుందా ?
రాబోయే రోజుల్లో దక్షిణ కొరియా , వియత్నాం , జపాన్, చైనా , తైవాన్ అగ్ర రాజ్యాలుగా రూపొందుతాయి అని విశ్లేషణలు నిజమా? మన దేశం కూడా అదే జాబితాలో చేరే అవకాశం ఎంత వరకు ? దాని కోసం ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలు ఏమి చేయాలి ? .. అందరూ ఆలోచించాలి . మేధో వలస అని ఒకప్పుడు అనేవారు . అటుపై మేధో వలస కాదు .. మేధో బ్యాంకు అన్నారు . ఇప్పుడేమనాలి ?
Share this Article