అందరిలోనూ ఓ సందేహం… మమ్ముట్టి నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాను ప్రేక్షకగణం ఆదరిస్తుందా..? తను పేరొందిన స్టార్ హీరో… సుదీర్ఘమైన కెరీర్… తనతో సినిమా అంటే బోలెడు సమీకరణాలు, కమర్షియల్ జోడింపులు… కానీ ఓ పాతకాలం కథను బ్లాక్ అండ్ వైట్‌లో, అదీ ఓ అగ్లీ రగ్గడ్ లుక్కుతో… కేవలం మూడే పాత్రలతో… ఏ అట్టహాసాలు లేని ఓ అటవీగృహంలో… అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..?
సాధ్యమేనని నిరూపించాడు మమ్ముట్టి… సినిమా పట్ల, పాత్ర పోషణ పట్ల, నటన పట్ల, తన వృత్తి పట్ల తన ప్యాషన్, తన డెడికేషన్ సంపూర్ణంగా ఆవిష్కరించాడు… ఆ సినిమా పేరు భ్రమయుగం… కలియుగానికి ఓ వికృతరూపం… తెలుగులో ఎందుకో లేటు… కానీ వేరే భాషల్లో రిలీజ్ అయిపోయింది… జనం యాక్సెప్ట్ చేశారు, ఆదరిస్తున్నారు… మునుపటి ప్రేక్షకజనం… అభిరుచి పెరుగుతోంది… ఇదుగో ఈ మమ్ముట్టి సినిమాకు అభినందనలు, మెచ్చుకోళ్లు… గుడ్… ఆశించిన మంచి సంకేతమే… వసూళ్ల లెక్కల్లో కాదు, మమ్ముట్టి తన నటనకు తను పెట్టుకున్న ఓ పెద్ద పరీక్షలో డిస్టింక్షన్ పాస్… (ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం ఊహించగలమా..? ‘కాదల్ ది కోర్’లో చేశాడు మమ్ముట్టి)…
Ads
ఐతే అందరికీ నచ్చుతుందా..? నచ్చదు… ఎందుకంటే, మనం వేప చేదు తినీ తినీ దాన్నే తీపిగా బుర్రల్లోకి ఇంజక్ట్ చేసుకున్నాం, మనకు సినిమా అంటే ‘చాలా చాలా’ కావాలి… సినిమా అనే ఒక బలమైన కమ్యూనికేషన్ మార్గాన్ని మన ఇండస్ట్రీలు ఓ రోత పరిశ్రమగా మార్చేశాయి, మనల్నీ అందులోనే ముంచేశాయ్… సరే, ఇక భ్రమయుగం విషయానికి వద్దాం…
తేవన్ (అర్జున్ అశోకన్) జానపద గాయకుడు… తల్లి దగ్గరకు వెళుతూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఓ పాడుబడ్డ ఇంటికి చేరుకుంటాడు… అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు… ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్)… మరొకరు యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి)… తక్కువ కులానికి చెందిన వాడని చూడకుండా, ఇంటికి వచ్చిన అతిథి అంటూ తేవన్‌ను తనతో పాటు సమానంగా చూస్తాడు…
అయితే… తనను కుడుమోన్ పొట్టి ట్రాప్ చేశాడని తక్కువ సమయంలోనే తేవన్ తెలుసుకుంటాడు… ఆ ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు… అయితే… తన తాంత్రిక విద్యలతో అతడు మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు కుడుమోన్ పొట్టి… తరువాత ఏం జరిగిందనేది కథ… ప్రేక్షకుల్ని ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్ళడానికి దర్శకుడు కొంత సమయం తీసుకున్నాడు… పాత్రల పరిచయం, ఆ సన్నివేశాలు నిదానంగా సాగుతూ… విశ్రాంతి వరకు సర్‌ప్రైజ్ గానీ, షాక్ గానీ ఉండవు…
‘భ్రమయుగం’లోకి ఒకసారి వెళ్లిన తర్వాత అంత సులభంగా బయటకు రాలేం… ఆ అటవీగృహానికి వెళ్లినట్టుగానే… ప్రతి మాటలో, దృశ్యంలో ఓ అర్థం… ఆ కాలంలో కులవివక్షను చర్చించిన తీరు సూటిగా, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంటుంది… సరే, నటీనటుల విషయానికి వస్తే…
మమ్ముట్టి ఇరగదీశాడు, పదే పదే చెప్పడం అనవసరం.,. మన స్టార్ హీరోలు ఓసారి తప్పకుండా చూసి తీరాల్సిన నటన… ఐతే మిగతా ఇద్దరు నటులు కూడా మమ్ముట్టిని స్పూర్తిగా తీసుకున్నారేమో, అక్షరాలా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు… మమ్ముట్టికి దీటుగా నటించారు… దాన్ని మెచ్చుకోవాలి… అర్జున్ అశోకన్‌ను మరీ మరీ ప్రస్తావించవచ్చు… అఫ్‌కోర్స్, సిద్ధార్థ భరతన్ కూడా పోటీపడ్డాడు…
మేకింగు కోణంలో, టెక్నికల్ స్టాండర్డ్స్ కోణంలో కూడా చెప్పుకోదగిన సినిమా… వందల కోట్ల గ్రాఫిక్స్, రెమ్యునరేషన్లు, టికెట్ల దందాల నడుమ ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఓ అబ్బురాన్ని కళ్లముందు ఉంచుతుంది… తక్కువ ఖర్చే… చివరగా… సీన్లకు తగినట్టు ఆప్ట్ బీజీఎం ఏమిటో ఇందులో క్రిస్టో జేవియర్ అందించిన సంగీతాన్ని చూసి తెలుసుకోవచ్చు… మొత్తానికి భలే సినిమా తీశారు బ్రదర్… చివరగా మరోసారి, అందరికీ నచ్చుతుందా..? లేదు… కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, స్టాండర్డ్స్‌ను, వైవిధ్యాన్ని కోరుకుంటూ సినిమాను బాగా ప్రేమించేవాళ్లకు మాత్రం బాగా నచ్చేస్తుంది..!! (ఓ మలయాళీ ప్రేక్షకమిత్రుడి ఇన్‌పుట్స్ ఆధారంగా…)
Share this Article