.
Prabhakar Jaini …… నేను ప్రస్తుతం రాస్తున్న ఒక నవలలో అత్యాచారానికి గురయిన రజనికి, ఆమె స్నేహితురాలు, ఈ క్రింది ఉదంతాన్ని చెప్పి జీవితంలో ముందుకు సాగమని, లక్ష్యాన్ని సాధించమని ప్రోత్సహిస్తుంది.
….
రజనీ! నీకొక అద్భుతమైన వ్యక్తి గురించి చెబుతాను. విను.
ఆమె పేరు లినార్ అబార్గిల్ (Linor Ab argil) ఆమె ఇజ్రాయెల్ దేశస్థురాలు. వయసు పద్దెనిమిది సంవత్సరాలు, మాడల్. 1998 లో మిస్ ఇజ్రాయెల్ గా ఎంపికయి, ‘సీషెల్స్’ దేశంలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీకి తయారవుతుంది.
Ads
పోటీ ఇంకో ఏడు వారాల్లో ఉందనగా, ఆమె పోటీలకు గాను ఇజ్రాయెల్ నుండి బయల్దేరింది. ఆమెకు సహాయంగా ఉంటాడనీ, పోటీలు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ కు వెళ్ళడంలో తోడ్పడతాడనీ, ఇటాలియన్ మాడల్ ఏజెన్సీ ‘యూరీ ష్లోమో నూర్’ అనే వ్యక్తిని, లినార్ కు అటాచ్ చేసింది.
ఆ నూర్ అనే వ్యక్తి ‘రోమ్’ నుండైతే విమానాలు సులభంగా దొరుకుతాయని చెప్పి ఆమెను తన కారులో ఎక్కించుకుని, నిర్మానుష్యమైన ప్రాంతంలోకి రాగానే, ఆమె, కాళ్ళూ చేతులు కట్టేసి బలాత్కారం చేసి, కత్తితో పొట్టి చంపబోతుంటే, ఆమె అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయనని, ఇజ్రాయెల్ దేశ పేరు ప్రతిష్ఠలను నిలపడానికి, ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్నానని, సాటి ఇజ్రాయెల్ పౌరుడిగా కనికరించమని, లినార్ వేడుకుంది.
దాంతో, అక్కడి నుండి తప్పించుకుని, రోమ్ రైల్వే స్టేషనుకు చేరుకుని, జరిగిందంతా తల్లికి చెప్పింది. తర్వాత పోలీస్ స్టేషనుకు వెళ్ళి కంప్లైంట్ చేసి, మెడికల్ ఎగ్జామినేషన్ కు వెళ్ళింది. కానీ, ఇటాలియన్ పోలీసులు ‘నూర్’ ని అరెస్ట్ చేసి, తర్వాత విడుదల చేసి, కేసును నీరుగార్చారు.
ఈ దుర్ఘటనతో లినార్ కృంగిపోలేదు. ‘అదొక చిన్న యాక్సిడెంట్. దాని గురించి మరిచి పో! నీ ముందున్న లక్ష్యం ఏమిటో దాన్ని సాధించడానికి నీ మనసును, శరీరాన్ని సమాయత్తం చేసుకో! నీ యావత్ శక్తిని నీ లక్ష్యాన్ని ఛేదించడం మీదనే కేంద్రీకరించు. ఫోకస్ సడలనీయకు.’ అని తల్లి చెప్పిన మాటలతో రెట్టించిన ఉత్సాహంతో తనను తాను మోటివేట్ చేసుకుంది. తనపై జరిగిన మానభంగాన్నే ఒక ఆయుధంగా వాడుకుంది.
ఆ సంవత్సరం జరిగిన ప్రపంచ సుందరి అందాల పోటీలో గెలిచి ప్రపంచ సుందరి అయింది. మన భారతదేశానికి చెందిన, 1997 సంవత్సరానికి ప్రపంచ సుందరి అయిన ‘డయానా హేడెన్’ చేతుల మీదుగా ప్రపంచ సుందరి కిరీటాన్ని అలంకరించుకుంది.
అది కదా పట్టుదల అంటే!
ఆ సంఘటన జరిగి సుమారు ఇరవై ఏడేళ్ళు అయింది. లినార్ ప్రపంచ సుందరి అయిన తర్వాత అఖండమైన కీర్తి ప్రతిష్ఠలను మూటగట్టుకుని ఇజ్రాయెల్ గడ్డ మీద అడుగుపెట్టింది. ఆ మరుక్షణం నుండే తన మీద అత్యాచారం చేసిన ‘నూర్’ మీద కేసు మోపి, అతన్ని అరెస్ట్ చేయించేంత వరకు విశ్రమించలేదు.
నూర్ కు పదహారేళ్ళ జైలు శిక్ష పడేటట్టు చేసింది. అంతే కాకుండా తన మీద జరిగిన అత్యాచారం, ప్రపంచ సుందరి పోటీలో గెలవడం, అటు తర్వాత తను గడిపిన జీవితం గురించి, ‘బ్రేవ్_మిస్ వరల్డ్’ #Brave_Miss_World అనే ఒక సినిమాను, పదేెళ్ళ తర్వాత తనే నిర్మించింది.
డిసెంబర్, 2023 లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, లినార్ ఉపన్యసించింది కూడా. ప్రస్తుతం లినార్, ఇజ్రాయెల్ లో న్యాయవాదిగా పనిచేస్తుంది….
Share this Article