.
కన్నీటితో తడిసిన కరెన్సీ కాగితాలు… ఓ తండ్రి ఆవేదన…
ఆ రోజు, శివకుమార్ జీవితంలో చీకటి రోజు… ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో చదివి, కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతురాలిగా ఎదిగిన తన ముద్దుల కూతురు అక్షయ శివకుమార్ (34), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) కారణంగా హఠాన్మరణం చెందింది…
Ads
ఒక మాజీ BPCL CFO (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా, అత్యున్నత స్థానంలో పనిచేసి రిటైర్ అయిన ఆ తండ్రి, తన కూతురి మృతదేహాన్ని పట్టుకొని నిస్సహాయంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది… ఆయకు తెలిసింది ఒక్కటే… తన కూతురికి చివరి వీడ్కోలు గౌరవంగా పలకాలి…
గుండె పగిలిన తండ్రి… గుండె కరగని అధికారులు
కూతురు మరణించిన బాధను దిగమింగుతూ, ఆమె అంత్యక్రియలకు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేయడానికి శివకుమార్ అడుగడుగునా ఎదుర్కొన్న అవమానం, ఆ వ్యవస్థలోని అమానవీయ కోణాన్ని ప్రపంచానికి చూపింది…
- అంబులెన్స్ వద్ద తొలి దెబ్బ: అంబులెన్స్ డ్రైవర్ “చాయ్ ఖర్చుల” పేరుతో డబ్బు డిమాండ్ చేసినప్పుడు, కళ్లలో నీళ్లతోనే జేబు తడిపాడు ఆ తండ్రి… తన బిడ్డను తీసుకెళ్లే బండిలోనూ లంచం ఇవ్వాల్సి రావడం ఆయన హృదయాన్ని తొలిచేసింది…
- పోలీస్ స్టేషన్‌లో పరమ అవమానం: పోస్ట్‌మార్టం కోసం ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీ అవసరం కాగా, పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. అక్కడ బెళందూర్ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్, “తన ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకున్న తండ్రి పట్ల కనీస సానుభూతి లేకుండా, చాలా అహంకారంగా మాట్లాడాడు” అని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు… కళ్ల ముందు కన్నీళ్లు కనబడుతున్నా, ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వడానికి నగదు (లంచం) డిమాండ్ చేయడంతో, ఆ తండ్రి విధిలేని పరిస్థితుల్లో ఇచ్చాడు…
- వైద్యుల ప్యాకేజీ: పోస్ట్‌మార్టం పూర్తి కావడానికి డాక్టర్లు కూడా సిగ్గులేకుండా “ప్యాకేజ్” పేరుతో డబ్బులు వసూలు చేశారు… పోస్టుమార్టం పత్రాల కోసం లంచం ఇవ్వడం ఆ తండ్రిని కలచివేసింది…
- అంతిమ సంస్కారంలోనూ ఆపద: అంత్యక్రియలు పూర్తయిన తర్వాత, శ్మశాన వాటిక సిబ్బంది కూడా “రశీదు” ఇవ్వడానికి అదనపు డబ్బులు అడిగారు…
- చివరికి, డెత్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ ఆఫీస్‌కు (BBMP ఆఫీస్) వెళ్ళినప్పుడు కూడా లంచం అడిగారు… ఇన్ని చోట్ల డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చిన శివకుమార్, కళ్ల నుంచి ధారగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, జేబులోంచి నోట్లను తీసి వారికిచ్చాడు…
ఆ లంచగొండులు, ఆ కన్నీటి తడి అంటిన కరెన్సీ నోట్లను ఏమాత్రం సంకోచం లేకుండా తుడుచుకుని తమ జేబుల్లో పెట్టుకున్నారు…
“నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించాను… మరి పేదవాడు ఏం చేయాలి? తన బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్న తండ్రి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ఈ అధికారులకు కనీస మనసు, కుటుంబం లేదా? బెంగళూరులో ఈ అరాచకాన్ని ఆపడం ఎవరికి సాధ్యం?”
అని శివకుమార్ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు… ఆయన ఆవేదనకు లక్షల్లో స్పందన వచ్చింది… ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తమవడంతో, ఆ పోలీసు స్టేషన్‌కు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు…
ఒక ఉన్నత అధికారి అయి ఉండి కూడా, తన బిడ్డ చివరి ప్రయాణంలో కన్నీటితో లంచాలు ఇవ్వాల్సి రావడం, ఈ వ్యవస్థ ఎంత లోతుగా పాతుకుపోయిన అవినీతిలో కూరుకుపోయిందో తెలియజేస్తుంది…
ఇదీ నిన్నటి నుంచీ వైరల్ అవుతున్న వార్త… ఎవడైనా మారతాడని ఆశపడుతున్నారా..? ప్చ్, నిరాశే… రోజురోజుకూ అవినీతి వ్యవస్థీకృతమవుతోంది, భూతంలా రూపం పెంచుకుంటోంది… ఇదంతా కామనే అని సమర్థించుకుంటోంది… అన్ని రంగాల్లోనూ అంతే… ఎవడికీ శిక్షలు పడవు, ఎవడూ మారడు… సాక్షాత్తూ ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో వందల కోట్ల నోట్ల కట్టలు దొరికితేనే, ఈరోజుకూ తన తలవెంట్రుక కూడా పీకలేకపోయింది మన వ్యవస్థ…!!
హైదరాబాదే తీసుకుందాం… కొన్నేళ్లుగా 25 నుంచి 150, 200 కోట్ల దాకా అక్రమాస్తులు వెలికితీయబడిన అవినీతి లంచగొండులు బోలెడు మంది దొరికారు… ఒక్కడంటే ఒక్కడికీ శిక్ష పడలేదు, చాలామంది మళ్లీ కొలువుల్లోకి చేరిపోయారు… ఒక్కడూ జైలులో లేడు… ఉండరు… అన్నిచోట్లా లంచమే కదా పనిచేసేది మరి..!!
Share this Article