Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవినీతి యందు జగము వర్ధిల్లుచున్నది… అది వ్యవస్థకు కందెన గ్రీజు…

July 28, 2024 by M S R

సత్యంతో మహాత్ముని ప్రయోగం … అవినీతితో సామాన్యుడి ప్రయోగం

సివిల్ సర్వీస్ కు ప్రిపేరయ్యే వారికి శిక్షణ ఇచ్చే ప్రొఫెసర్ సలోని కన్నా వీడియో ఒకటి విన్నాను .. అవినీతి కొంత వరకు ఆమోదించాలి . కొద్దిపాటి అవినీతి ఆర్థిక వ్యవస్థకు గ్రీజ్ లాంటిది … ఇదీ ఆమె చెప్పిన విషయం … వందకు వంద శాతం మంది దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు … ఆ వంద శాతం మంది ప్రభుత్వ పనుల కోసం ఎక్కడో ఓ చోట ఎంతో కొంత లంచం ఇచ్చే ఉంటారు …

దీనిని వారు అవినీతిగా భావించరు . ఏ పని అవసరం లేని వాడు … వ్యవస్థలతో పని లేనివాడు . నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూసేవారు లంచం ఇచ్చి ఉండకపోవచ్చు కానీ కనీసం ఓ ఇంటిని నిర్మించుకున్న వారు ఎక్కడో ఓ చోట ఎంతో కొంత లంచం ఇవ్వని వారు లేరు అని నా నమ్మకం .

Ads

ఈ మధ్య ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచి చంద్రబాబు సిఎంగా బాధ్యతలు చేపట్టే ముందు ఆసక్తికరమైన ఓ చిన్న వార్త అవినీతిపై నా నమ్మకాన్ని మరింత పెంచింది . బాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కుప్పంలో ఇంటి నిర్మాణం అనుమతి కోసం అక్కడి ఉద్యోగికి లంచం ఇస్తే తప్ప పని కాలేదు . టీడీపీ గెలవగానే అతన్ని సస్పెండ్ చేశారు .

14 ఏళ్ళు సీఎం , 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత , కేంద్రంలో చక్రం తిప్పిన అనుభవం … ఐనా ఊరిలో ఇంటి నిర్మాణానికి లంచం తప్పనిసరి …. అవినీతి పట్ల ఆ ఉద్యోగి నిబద్ధతకు ముచ్చటేసింది . 96 ఏళ్ళ వయసు , చలికాలంలో సైతం సంధ్యా వందనం చేయనిదే మంచి నీళ్లు ముట్టరు అని తమ పెద్ద వారి గురించి గర్వంగా చెప్పుకున్నట్టే ఢిల్లీలో చక్రం తిప్పేవారి వద్ద కూడా మా వారు డబ్బు లేనిదే పని చేయలేదు అని వాళ్ళ వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారో …

సత్యంతో నా ప్రయోగాలు అని మహాత్ముడు తన ఆత్మ కథ చెప్పుకున్నారు .. బ్రిటిష్ కాలంలో కాబట్టి సత్యంతో ప్రయోగం చేసి విజయం సాధించారు కానీ స్వతంత్ర దేశంలో అవినీతితో నా ప్రయోగాలు అని ప్రయోగాలు చేసి ఉంటే కచ్చితంగా ఓడిపోయేవారు ..

అవినీతితో నేనూ ఓ ప్రయోగం చేశాను …
ఒక్క పైసా లంచం ఇవ్వవద్దు అనేది నా పాలసీ … ప్రభుత్వ కార్యాలయాలతో పని లేనంత కాలం ఈ పాలసీ అద్భుతంగా పని చేస్తుంది .. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో బాబు ఓటమితో టీడీపీ రిపోర్టర్ ను కాబట్టి కాస్త సమయం దొరికింది … అపార్ట్ మెంట్ పై ఆసక్తి లేదు . నాలుగు మొక్కలు పెంచుకోవచ్చు అని ఊరు అవతలయినా పరవాలేదు అని అల్వాల్ లో ఓ వెంచర్ లో ఇంటి స్థలం కొన్నాను …

స్థలం రిజిస్ట్రేషన్ వద్ద లంచం నుంచి తప్పించుకున్నాను . ప్లాట్స్ అమ్మిన వ్యక్తే ఇల్లు కట్టే కాంట్రాక్టర్ … పనులు సాగుతున్నప్పుడు …ఒక్క పైసా లంచం ఇవ్వకూడదు అనే ప్రయోగం గురించి అతనికి చెబితే … అతను చిద్విలాసంగా నవ్వి – ఇలాంటి వారు ఉంటారు సార్ మాకు తెలుసు, ఐతే మీకు తెలియందేమంటే, మీకు ప్లాట్ ధర చెప్పేప్పుడే అందులో లంచం అమౌంట్ కూడా ఉంటుంది అని కళ్ళు తెరిపించాడు … ఐనా నా చేతితో నేను లంచం ఇవ్వలేదు కదా అని సర్ది చెప్పుకున్నాను .. మధ్యలో లోకల్ రిపోర్టర్లం మా సంగతి ఏంటి అని ముఠా మేస్త్రి బిల్డర్ కు ఫోన్ చేసి బెదిరిస్తే – వాళ్ల హెడ్ ఆఫీసులకు ఫోన్ చేసి చెప్పాను .

ఓ వైపు మున్సిపల్ పర్మిషన్ రాలేదు అని ఆందోళన.. ఈ లోపు మున్సిపల్ కమిషనర్ ను ఏసిబి వాళ్ళు వల పన్ని పట్టుకున్నారు … బిల్డర్ బ్యాంకులో చిన్న ఉద్యోగి . సైడ్ బిజినెస్ గా ఇలా చిన్న చిన్న వెంచర్లలో ఇల్లు నిర్మిస్తాడు … ఓ రోజు కష్టాల్లో ఉన్నాను, ఓ సారి రండి అని వేడుకుంటే వెళ్ళాను .. మున్సిపల్ కమిషనర్ ను ఎసిబి వాళ్ళు పట్టుకున్నారు కదా ? అతన్ని విడిపించడానికి అయ్యే ఖర్చు మొత్తం బిల్డర్స్ మీద వేశారు … నాకు ఈ వెంచర్ లో లాభం రాలేదు, అనుభవం లేదు, దెబ్బతిన్నాను .. ప్లీజ్, ఒప్పుకున్న దాని కన్నా కొంచం ఎక్కువ ఇవ్వాలి అని బతిమిలాడాడు …

నాతో పాటు వచ్చిన జర్నలిస్ట్ మిత్రుడు శైలేంద్ర బిల్డర్లు ఇలా ఉండరు .. అహంకారంతో ఉంటారు .. ఇతనెవరో అమాయకుడు ఎంతో కొంత ఇచ్చేయండి అని సలహా … లంచం ఇవ్వను కానీ నీకు ఒప్పుకున్న దాని కన్నా ఎక్కువ ఇస్తా అని ఇచ్చాను .
ఎసిబి లంచం కేసులో అరెస్ట్ అయితే పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి కేసు నుంచి బయట పడడం గురించి అప్పుడే తెలిసింది … వింతగా అనిపించింది . ( తదనంతర కాలంలో ఆ మున్సిపల్ కమిషనర్ అత్యున్నత స్థాయికి ఎదిగారు . విలువల గురించి బాగా మాట్లాడారు )

ఇల్లు పూర్తి అయ్యాక మంచినీటి కనెక్షన్ … ఎన్నిసార్లు అయినా తిరుగుదాం, ఒక్కడికీ పైసా ఇవ్వ వద్దు అని భీషణ ప్రతిజ్ఞ . కాలనీ ప్రెసిడెంట్ చదువుకున్న వ్యక్తి, అతనూ అదేమాట . మూడు ఏళ్ల పాటు తిరిగాక తత్త్వం బోధ పడింది .. ఓ రోజు వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి నీటి కోసం దరఖాస్తు చేసిన అందరికీ ఓ లెటర్ ఇచ్చి వెళ్లారు … గూగుల్ ను ఆ లెటర్ కు అర్థం ఏమిటీ అని అడిగితే మీ ఇంటికి నీటి కనెక్షన్ కావాలంటే సమస్త ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తెచ్చుకోవాలి అనేది సారాంశం .

రోడ్ కటింగ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీసు మొదలుకొని అనేక ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకోవాలి . వాటర్ వర్క్స్ చుట్టూ తిరిగేందుకే తాతలు దిగి వచ్చారు … ఇన్ని శాఖలు నేనేం తిరుగుతా అని ఆ లెటర్ ను కాలనీ ప్రెసిడెంట్ కు ఇచ్చేసి … నా వంతు వాటా నేను ఇస్తా, ఏం చేస్తారో చేయండి అని చేతులు దులుపు కున్నాను …

ఏదో ఓ చోట , ఎంతో కొంత , పరోక్షంగానో , ప్రత్యక్షంగానో లంచం ఇవ్వనిదే ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేయలేరు అనే జ్ఞానోదయం అయింది … చాలా రోజుల క్రితం ఎక్కడో చదివాను . ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు తరుచుగా ఎవరో ఒకరి ఇంట్లో కలిసి భోజనం చేసేవారు .. అందులో ఒకరు మరణిస్తే పెన్షన్ , గ్రాట్యుటీ వంటి వాటి కోసం తోటి ఉద్యోగులే లంచం తీసుకున్నారు .. ఇంట్లో అంతా కలిసి భోజనం చేసిన వారే లంచం తీసుకోవడంపై ఆ వ్యక్తి భార్య ఏదో పత్రికలో రాశారు .. లంచం విషయంలో వారి నిబద్దత అది …

ప్రతిపక్ష నాయకుని ఇంటి నిర్మాణానికే లంచం ఇచ్చారంటే సీఎంయకూడా మినహాయింపు కాదేమో, నేరుగా సీఎం ఇవ్వక పోయినా ఓ ఇంటి నిర్మాణం అంటే ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ ఎంతో కొంత ఇచ్చే ఉంటారు అనిపిస్తుంది …

సివిల్ సర్వీస్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే సలోనా అవినీతి ఆర్థిక వ్యవస్థకు గ్రీజ్ లాంటిది . అది లేకపోతే ఆర్థిక వ్యవస్థ వేగం మందగిస్తుంది అని చెబితే ఇదంతా గుర్తుకు వచ్చింది . అంతా చదివి అప్పుడు మీరు రిపోర్టర్ కదా ? అంటున్నారా ? సర్లే. చక్రం తిప్పిన వారికే తప్పలేదు అని నేను చెబుతుంటా …. [ బుద్దా మురళి ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions