.
ఎన్ ఆర్ నంది … (ఎన్. రాజనంది ) అనగానే నాకు ముకుందరావు గుర్తొస్తాడు… ముకుందరాయ్ అని బెంగాలీ లుక్కిచ్చి పోస్టర్లేస్తే … జనం అవార్టు సినిమా అనేసుకుని థియేటర్లకు వచ్చేస్తారనీ ..
ఆనక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కన్షూజనులో ఉన్న అవార్డులన్నీ ముకుందరాయ్ కే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటాయనీ …
Ads
జోకేసిన నంది గారూ పాపం చాలా సినిమాలకు కనిపించకుండానూ … కొన్ని సినిమాలకు మాత్రం కనిపించేట్టుగానూ పన్జేశారు. చాలా క్రిటికల్ సినిమాలకు ఆయన తన మేధ అందించారు. ఆయన కనిపించి రాసిన సినిమాల్లో కూడా ఆయన ప్రమేయం తక్కువే అని నా అనుమానం.
సరిగ్గా ఈ అనుమానం చేతే ఎందుకేనా మంచిదని నంది నాటక రచయితగా నవలా రచయితగా తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు.
టెలీపతీ అంటే … వెంకటాచలపతి కజినా లేక … అల్లోపతీకి సీక్వెల్లా అనే అనుమానాలకు తెర దించి, దృష్టి అనే నవల రాసి తెలుగు పాఠకుల్ని ఖంగారు పెట్టేడు. తర్వాత్తర్వాతంటే …
యండమూరీ, మల్లాది వచ్చి మేల్ ఈగోను కాపాడారు గానీ … లేకపోతే పాపం మన రచయితలందరూ తోటకూర ఆశాలతలో పాలకూర పాపాయమ్మలో అయిపోయేవారు కాదూ … కానీ వీళ్లెవరూ రాకముందే …
సినీజనారణ్యంలో … ఎలాగైతే ముకుందరావు పోరాడతాడో అలాగే … నవలా ప్రపంచలోనూ , రంగస్థలం మీదా కూడా పోరాడాడు నంది. కొత్త తరహా ఆలోచనలు … ఇంగ్లీషు నవలలు సదివేసి ఇట్టాంటివి రాసేత్తార్రా
అని కిళ్లీ బడ్డీ దగ్గర సిగరెట్ దమ్ములాగి ఓ కామెంటేయడానికి ఓ ప్రాతిపదిక కల్పించిన చాలా మందిలో నంది అగ్రగణ్యుడు.
ఈ కామెంటులో వాస్తవం ఎంతుందో … అసలిలాటి ఆలోచనలు మనోళ్లకు చస్తే రావనే భీకరమైన నమ్మకం అంతకు మించి ఉంది. ఏదీ గాల్లోంచీ ఊడి పడదు … ప్రతిదానికీ ఓ ప్రాతిపదిక ఉంటుంది. ఒక ప్రేరణ ఉంటుంది. విజను ఉంటుంది. అట్టా అన్నమాట…
ఇట్టా … ఎవరు నంది మీద ఎన్ని కామెంట్స్ చేసినా … అవన్నీ ఆయన పట్టించుకోలేదు. ఇవి ఇలా కొనసాగుతాయన్నాడు. యండమూరి రోజుల్లోనూ కిళ్లీ కొట్ల దగ్గర ఇవే కామెంట్స్ చక్కర్లు కొట్టినప్పుడు గానీ అర్ధం కాలేదు ఆయన ముందుచూపు.
కానీయండీ … అసలు ఈ నంది గారి సినీజనారణ్యమూ … దానికి ముందు అదేమారణ్యమూ … నైమిశారణ్యమూ .. ఈ రెంటికి మధ్య … యండమూరి చంగల్వపూదండ వీటికి కాస్త అటూ ఇటూగా వడ్డెర చండీదాసుతో రెండు బీభత్సమైన నవల్లూ రాయించేసిన పురాణం సుబ్రహ్మణ్యశర్మను చెప్పుకోవాలండీ ముందసలు.
అసలు నంది గారిని చదవడం మొదలెట్టిందే సినీ జనారణ్యం నుంచీ .. ఆ తర్వాత కాస్త ఎనక్కీ ముందుకీ ఆయన రాసిన నవల్లు చదవడం మొదలెట్టాం. మామూలుగా వచ్చే మహిళా రచయితల నవలల్లో అన్నీను ప్రత్యేకంగా అనను గానీ…
నవలామణీ అన్నారంటేనే నవలలు అసలు ఆడాళ్లు రాసేవి అనే అన్నమాట. వాటిలో హీరో పాత్రలో నాగేస్పర్రావు పోలికలెక్కువుంటాయి. అందుకే అవి మనకెక్కేవి కాదు.. పూర్తిగా రామారావు లాంటి పాత్రలు కాకపోయినా …. నాగేస్పర్రావు పోలికలు పెద్దగా లేని హీరోలను రాశాడనే గౌరవం కూడా నంది మీద నాకుండేది.
మరో మొహంజొదారో ఎన్ని సార్లు ప్రదర్శించారో గానీ … దాన్ని అప్పుడు చూసిన ఆడియన్స్ కంటే కూడా … దాన్ని నవల్లా చదివేసి ఊహించేసుకున్న ఆడియన్స్ సంఖ్య కంపేరిటివ్ గా ఎక్కువని నా అనుమానం.
నంది గారి వ్యక్తిగత జీవితమూ పిల్లలూ గట్రా మనకెందుకుగానీ … గుర్తుండిపోయే రచనలు చేసి ఓ ఏరియాలో తనదైన ముద్రేశారాయన. ఊర్నే ఓసారి గుర్తు చేసుకుందారనే మళ్లీ ఇలా … (భరద్వాజ రంగావఝల)
Share this Article