ఒక్కసారి ఆ హీరో నితిన్ కోణం వదిలేయండి… ఆ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ మీద మనకు సదభిప్రాయం ఉంది కదా… డిఫరెంటు కంటెంటు, మంచి స్క్రీన్ ప్లే, నాన్-ఫార్ములా…. కాదు కాదు.., తెలుగు సినిమా ప్రధాన అవలక్షణమైన నాన్-నాన్సెన్స్ ఉండదు కదా తన సినిమాల్లో అనే ఓ పాజిటివ్ ఒపీనియన్ మనలో ఉంది కదా… అందుకనే ఈ కొత్త సినిమా ‘చెక్’ మీద కాస్త ఇంట్రస్టు ఫోకసైంది… అంతేతప్ప ఇప్పటివరకు పెద్దగా తనకంటూ చెప్పుకోదగిన ఓ సినిమా లేని నితిన్ మీద కాదు… హీరో అంటే హీరో… ఏదో లవ్ స్టోరీయో లేదంటే ఏదో మాస్ మసాలా సినిమాయో… అందుకని ఈ సినిమా మీద ఇంట్రస్టును క్రియేట్ చేసింది ఏలేటి…. ఫాఫం… సేమ్, ఎంత పెద్ద దర్శకుడైనా సరే, ఎంత సెన్సిబుల్ దర్శకుడైనా సరే… చెత్తా మాస్ హీరోయిజం బాపతు, భ్రమాత్మక కమర్షియల్ వాల్యూస్ అనబడే లక్షణాలకు తలొగ్గక తప్పలేదు… తెలుగు సినిమాకు ఏది శాపమో, ఈ సినిమాకూ అదే శాపం… అదే నిజం…
తెలుగు సినిమాకు తెలుగు హీరోయే శాపం… మరోసారి నిరూపితమైంది… నిజానికి ఏలేటి మంచి దర్శకుడు… అఫ్ కోర్స్, ఎలాంటి మంచి దర్శకుడినైనా మనం భ్రష్టుపట్టించగలం కదా… అదే జరిగింది… తను పేరున్న హీరోను ఎంపిక చేసుకోవడం వల్ల జరిగింది పొరపాటు… అవే సోది ఫైట్లు… అక్కడక్కడా లాజిక్ లెస్ సీన్లు… అసలు ఇది ఏలేటి సినిమాయేనా అని ఆశ్చర్యపడే స్థాయిలో… నిజానికి తను రాసుకున్న కథ సూపర్… కాకపోతే దాన్ని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు కత్తిమీద సాము చేశాడు… తన పాత సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని, ఎలాగైనా ఓ సెన్సిబుల్ సినిమా తీసే ఉంటాడు అనుకుని థియేటర్ వెళ్తే, మీ బొంద, తెలుగు పాపులర్ హీరో నటిస్తున్నాడూ అంటేనే చెత్తా ప్రజంటేషన్ ఉంటుందని మరిచిపోతే ఎలా అని మనల్నే వెక్కిరిస్తుంది సినిమా….
Ads
చేయని తప్పుకి, అదీ పుల్వామా ఉగ్రదాడి వంటి ఇన్సిడెంటుకు లింకై ఉరిశిక్ష పడిన ఖైదీ… అదీ గద్వాల జైలులో ఉంటాడట… క్షమాభిక్ష కోసం ఓ లాయర్ ప్రయత్నిస్తుందట… చిన్నాచితకా చోరీ కేసులతో ఎంజాయ్ చేస్తూ బతికే ఓ హీరో అనగానే మనకు తన మీద సానుభూతి పోతుంది… ఇక సినిమా మొత్తం అలాంటి హీరోతో మనం పాజిటివ్ జర్నీ చేయడం కష్టం… అలాగే చదరంగంలో విజయాలకు, క్షమాభిక్షకూ లింక్ అనే సినిమా పాత్రల పిచ్చి నమ్మకం మనకు పిచ్చి రేపుతుంది… దీనికితోడు తెలుగు సినిమా అంటే కొన్ని ఎదవ వాల్యూస్ ఉండాలి కదా… ఫైట్లు ఉంటయ్,.. అవీ సగటు తెలుగు పాపులర్ సినిమా హీరో రేంజులోనే ఉంటయ్… అక్కడ ఫాఫం, ఏలేటి అని మనకు సదరు దర్శకుడి మీద జాలి కలుగుతుంది… ఇంత పేరు తెచ్చుకుని ఇక్కడ అడ్డంగా బుక్కయిపోయి, ఉన్న పేరు చెడగొట్టుకున్నాడు అనిపిస్తుంది… జైలు నుంచి సొరంగం తవ్వడం ఏమిటో, తప్పించుకోవడం ఏమిటో…. ఫాఫం యేలేటి…!!లాయర్ పాత్రలో రకుల్ ఉండీలేని పాత్ర… కథలో కీలకమే, కానీ అది బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు… ప్రియా వారియర్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది… బాబూ నితినూ… లవర్ బాయ్ పాత్రలు, యాక్షన్ పాత్రల్ని వదిలి మంచి సినిమా పాత్ర కోసం అన్వేషణ, ప్రయత్నం మంచిదే… కానీ… ఫాఫం, ఆ దర్శకుడికి తనదైన శైలిలో సినిమా తీసే స్కోప్ వదిలేస్తే బాగుండేది కదా… ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే… సగటు తెలుగు పాపులర్ హీరో ఈ ఇమేజీ, ఫార్ములా బందీఖానా నుంచి బయటపడటం అంత వీజీ కాదు… ఏలేటి వంటి దర్శకులూ అందులో చిక్కుకుని తమ ఒరిజినాలిటీని కోల్పోవడమే అసలైన విషాదం…!!
Share this Article