చాలా కాలం తర్వాత పుస్తకం చదివే ఛాన్స్ దొరికింది. అది కూడా నాకు బాగా ఆసక్తి ఉన్న సబ్జెక్టు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద. Murali Buddha అన్న రాసిన లక్ష్మీ కటాక్షం.
టైటిల్ చూసి ఇది కేవలం సినిమా వాళ్ళ జీవిత చరిత్ర అనుకునేరు. ఇది మంచి మేనేజ్మెంట్ పుస్తకం. ఇందులో సబ్జెక్టు, పేర్కొన్న మనుషులు సినిమా వాళ్లు కావడం మినహాయిస్తే, పుస్తకం మొత్తం డబ్బుకున్న విలువ, కొద్దిపాటి నిర్లక్ష్యం వస్తే జరిగే పరిణామాలు… సంపద సృష్టి… మనీ మేనేజ్మెంట్… కోల్పోవడం… కష్టాలు… నష్టాలు.. నమ్మకద్రోహాలు, జీవిత పాఠాలు ఇలా ఎన్నో అంశాలు మనకు తెలియకుండానే దొర్లిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో కథ…
ఒక్క సినిమా వాళ్లే కాదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియని ఏ వృత్తిలోని వారైనా అవసాన దశలో ఆర్థిక సంక్షోభంలో పడడం చూస్తూనే ఉన్నాం. పాత్రికేయ వృత్తిలో యోధాను యోధులు కూడా అవసర దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనై తనువు చాలించిన సంఘటనలు నా సర్వీస్ లో చాలా చూశాను. వృత్తిలోని ఒడిదొడుకులను ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడకపోతే ఎదురయ్యే ఇబ్బందులు ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క రకంగా మనకు అవగతం అవుతాయి. పేరుకు సినిమా వాళ్ల నిజ జీవిత కథలు అయినా, అన్ని రంగాల్లోనూ ఇలాంటి వారు మనకు గోచరిస్తుంటారు.
Ads
రాజనాల నుంచి శోభన్ బాబు వరకు విజయాలు వైఫల్యాలు మొదటి భాగంలో ఉంటే, చిన్నపాటి జాగ్రత్తలు ఎంతగా ఉపయోగపడతాయో రెండో భాగంలో చదవచ్చు. యండమూరి వీరేంద్రనాథ్ ముందుమాట కూడా ఆసక్తికరంగా ఉంది…
బుద్ధా మురళి అన్న రాసిన జనాంతికం రాజకీయ వ్యంగ్య రచన నా ఫేవరెట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద మురళి అన్న రాసిన ఈ పుస్తకం నాకు కొంత ఆశ్చర్యం కూడా కలిగించింది. రొటీన్ పొలిటికల్ రాతల నుండి ఇలాంటి విభిన్నమైన సబ్జెక్టులను ఒకచోట చేర్చడం చాలా మంచి ప్రయత్నం. తెలుగు రాయడం కూడా మరిచిపోయాను కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేను…
మురళి అన్న ఇలాంటి మరిన్ని మంచి పుస్తకాలు తీసుకువస్తారని ఆశిస్తున్నాను. మీరంతా తప్పక చదవండి… లక్ష్మీ కటాక్షం కోసం… (కృష్ణ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్)
Share this Article