Hastir Kanya Hastir Kanya
Bamoner Nari
Mathai Niya Kam Kalasio
Haate Sonar Sakhio…….. ఓ గజరాజు కూతురా..? ఓ బ్రాహ్మణ మహిళా… మణికట్టుకు బంగారు కంకణం ధరించినట్టే ఎప్పుడూ కన్నీటి కడవలను మోస్తుంటావు తల్లీ… అస్సోంలో మావటీలు పాడుకునే ఓ పాపులర్ జానపదానికి రఫ్‌గా ఇదీ తెలుగు అనువాదం… ఏనుగులకూ మనిషికీ నడుమ బంధాన్ని చెప్పే గీతం… రానా నటించిన అరణ్య చూస్తుంటే ఈ పాటే కాదు… అస్సోంలో ఆమధ్య ఏనుగుల స్వేచ్ఛాసంచారానికీ అడ్డుపడేలా కట్టబడిన ఓ పెద్ద కాంక్రీట్ గోడ, దానిపై సుప్రీంకోర్టు చీవాట్ల కేసు కూడా హఠాత్తుగా గుర్తొస్తుంది… ఎన్ఆర్ఎల్ అనే ఓ ఆయిల్ రిఫైనరీ ఏనుగుల బాటను ఆక్రమించి రెండున్నర కిలోమీటర్ల గోడ కడుతుంది… దారికడ్డంగా మనిషి కట్టిన ఆ గోడను కూలగొట్టడానికి ఓ ఏనుగు తన తలతో ఢీకొట్టీ ఢీకొట్టీ, తలపగిలి మరణిస్తుంది… కల్పన కాదు, నిజమైన కథే… 2015లో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన మానవీయ తీర్పులో ‘‘అడవి ఆ ఏనుగులదే… ఒక టౌన్ షిప్ కోసం ఎలిఫెంట్ కారిడార్‌లో గోడలు కట్టడం ఆ ఏనుగుల హక్కుల్ని కాలరాయడమే, తక్షణం దాన్ని కూలగొట్టండి’’ అంటాడు… అప్పటి ఆ గోడ, దాన్ని కూలగొట్టే ప్రయాసలో ఏనుగుల ఫోటో చూస్తారా..?
జాదవ్ పాయెంగ్… చాలా తక్కువ జనాభా మిగిలిన మిరి అనే అస్సామీ ఆదివాసీల తెగలో పుట్టిన ఈయన దాదాపు 1500 ఎకరాల్లో ఒక అడవినే పెంచాడు… తన జీవితమంతా మొక్కలు నాటుతూ, సంరక్షిస్తూనే గడిపాడు… కేంద్రం ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది… ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ని… దగ్గుబాటి రానా హీరోగా చేసిన ‘అరణ్య’ కథకు బహుశా ఇవే కలగలుపు స్ఫూర్తి… దర్శక రచయిత ప్రభు సాల్మన్ ఖచ్చితంగా ఓ డిఫరెంట్ డైరెక్టర్… టేస్టున్నవాడు… భిన్న కథాంశాల్ని టచ్ చేస్తాడు… రెగ్యులర్ ఇమేజీ, ఫార్ములా, సోది కథలకు దూరం… అంతేకాదు, సొసైటీ కన్సర్న్డ్… ఈ దిక్కుమాలిన సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కేరక్టర్లు అరుదు… తనకు తగ్గటుగా రానా దొరికాడు… రానా పాత్రల ఎంపిక భేషుగ్గా ఉంటుంది… హీరో అనగానే మడత నలగని ఫైట్లు, సర్కస్ ఫీట్ల వంటి గెంతులు, చిల్లర పాటలు, తొట్టి గ్యాంగ్, సూపర్ హీరోయిజం వంటి అవలక్షణాలకు భిన్నమైన కేరక్టర్లు కూడా చేస్తాడు… ఈ అరణ్యే తీసుకుంటే ఓ బారెడు గడ్డం, చింపిరి జుత్తు… చిరుగుల బట్టలు, అడవుల్లో జంతువులతో సావాసం… ఆ పాత్రలో ఒదిగిపోయాడు… మన ప్రసిద్ధ పాపులర్ హీరోలు ఎవరైనా చేయగలరా ఈ పాత్రను..? నెవ్వర్… అటవీ సంబంధ కథనాయకుడి పాత్రలకూ ట్రెండీ డ్రెస్సులు, హీరోయిక్ లుక్కులు, స్టెప్పులు పెట్టిన మెగా సినిమాలు కూడా చూశాం కదా… అందుకని రానాకు ముందుగా ‘ముచ్చట’ అభినందనలు…
Ads
కాన్సెప్టుపరంగా మనం అభినందించి, ప్రోత్సహించాల్సిన అంశాలే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ…. కానీ సినిమా అన్న తరువాత ప్రేక్షకుడికి విషయాన్ని ఓ కథలా చెప్పాలి… రక్తికట్టించేలా చెప్పాలి… అక్కడ దర్శకుడు తడబడ్డాడు… ఈ కథలో మావోయిస్టుల ప్రస్తావన అనవసరం… అసలు కథకు ఉపకథగా కనిపించే మరో ప్రేమకథ అనవసరం… పైగా పలుపాత్రలు అర్ధంతరంగా ఆగిపోతాయి… మాయమైపోతాయి… దర్శకుడు ఎందుకు ఇంతగా కన్ఫ్యూజ్ అయ్యాడో, అతుకుల బొంతగా మార్చాడో అర్థం కాదు… పాటలు కూడా శుద్ధ దండుగ… మిగతా నటీనటులు, ఎడిటింగ్ తీరు సోసో… కాకపోతే దట్టమైన అడవుల్లో ఈ నిర్మాణబృందం పడిన కష్టం మనకు చాలా సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది… ఏదో ఓ భారీ బిల్డింగులోనో, స్టూడియోలోనో క్లోజ్డ్ షూటింగ్ కాదు… నానా ప్రయాసలకూ ఓర్చి పేర్చిన సీన్లు ఇవి… దానికి తగ్గట్టు నేపథ్యసంగీతం… అన్నింటికీ మించి కథలో మానవీయ కోణం… మనిషి తన స్వార్థం కోసం ఇతర జంతుజాలాల్ని బతకనివ్వకుండా చేయడం, దానిపై పోరాటం ఆసక్తికరమైన పాయింట్… అస్సోంలో మనం చూసిన రియల్ స్టోరీయే… ఫస్టాఫ్, కథలో ఉపకథల తలనొప్పి వంటివి వదిలేస్తే… చివరి అరగంట కథను రక్తికట్టించగలిగాడు దర్శకుడు… చివరగా… సినిమా కథ మారాలి, భిన్న కథాంశాలు రావాలి, అగ్లీ హీరోయిజం పోవాలి, రకరకాల కాన్సెప్టులతో సినిమా ప్రేక్షకుడిని చేరాలి… అది బలంగా కోరుకునేవారు ఆహ్వానించే సినిమా అరణ్య… ప్రతిదీ కమర్షియల్ వాల్యూస్ కోణంలో చూడలేం… అరణ్య కూడా అంతే…
Share this Article