‘నా సినిమాల్లో కామెడీ తప్ప కథ ఉండటం లేదు, ఇప్పుడు కథ కూడా ఉంటుంది’ అని అల్లరి నరేషుడు చెప్పినప్పుడే… ఏదో కొత్త కథ చెబుతున్నాడులే ప్రమోషన్ కోసం అనిపించింది… సర్లె, కథలు చెబితే మంచిదేగా, ప్రమోషన్ కథలు ఎలా చెప్పినా సరే, సినిమాలో కథ బాగుంటే చాలు, అసలు కథలకు మొహం వాచిపోయి ఉన్నాం కదా అనుకున్నాం… ఈ బంగారు బుల్లోడు సినిమాలో కథ లేదు అనలేం, ఉంది… కానీ కథను సరిగ్గా చెప్పలేకపోయారు… జబర్దస్త్ లెవల్లో కాదు కదా, కనీసం ఫ్లాప్ అయిపోయి, మొహం చాలేసిన ‘బొమ్మ అదిరింది’ లెవల్ కామెడీ కూడా చేతకాలేదు… మొత్తానికి ఏదో కాామెడీ కథను ప్లాన్ చేస్తే, కథే కామెడీ అయిపోయి, నరేష్ ఖాతాలో మరో పిచ్చి సినిమా వచ్చి చేరింది… దర్శకుడు గిరికి మైనస్ మార్కులు… ఓ మిత్రుడు చెప్పినట్టు ఇది కనీసం వన్ గ్రామ్ బంగారం కూడా కాదు… ఉత్త కాకిబంగారం… ఫాఫం, అల్లరి నరేష్…
నిజానికి నరేష్ ఆలోచనల్లో తప్పులేదు… తనకు కామెడీ జానర్ తప్ప వేరే దిక్కులేదు, కామెడీ కోసం తప్ప రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్లో తనను జనం యాక్సెప్ట్ చేయలేరు… అందుకని తన ట్రేడ్ మార్క్ కామెడీ జానర్లోనే ఉండిపోయి, కాస్త కథ అనే పదార్థాన్ని కూడా కలుపుదాం అనుకున్నాడు… అయితే ఇప్పుడు టీవీల్లో ఏ షో తీసుకున్నా కామెడీ ఇరికిస్తున్నారు… స్టార్ మహిళ దగ్గర్నుంచి జబర్దస్త్ దాకా… మ్యూజిక్, డాన్స్, కిట్టీపార్టీ, ఇంటర్వ్యూ ఎట్సెట్రా ఏ ప్రోగ్రాం తీసుకున్నా కామెడీ ఉంటోంది… కామెడీ లేకపోతే ఈ టీవీ షో కూడా నడవదు… ఈ స్థితిలో జనాన్ని కామెడీ కోసం థియేటర్ దాకా రప్పించడం అంటే మాటలా…? అది టీవీని దాటి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి… అంటే కామెడీతోపాటు కాస్త థ్రిల్, కాస్త ఎమోషన్, కాస్త కొత్తదనం, కాస్త క్రియేటివిటీ గట్రా ఉండాలి… మళ్లీ అన్నీ కలిపితే కిచిడీ కాకూడదు… అదే దర్శకుడు చేయాల్సిన కథ మీద సాము, అంటే కత్తిమీద సాము… బంగారు బుల్లోడు అనే సినిమాలో అదే లోపించింది…
Ads
నిజానికి బ్యాంకులో పెట్టిన అమ్మవారి నగల్ని అమ్మేసుకోవడం, వాటి స్థానంలో గిల్టు నగలు పెట్టేయడం… మనమడు ఆ తప్పు దిద్దే ప్రయత్నం చేయడం… ఆ దిశలో పాట్లు అనేది మంచి ప్లాటే… దీనికి తగినట్టు రకరకాల కామెడీ కేరక్టర్లను దింపేయడం గట్రా బాగానే ఉంది… కానీ ఎవరూ రక్తి కట్టించలేకపోయారు ఎందుకో మరి…! ముందు చెప్పుకున్నదే… ఏదో ఓ దిక్కుమాలిన జబర్దస్త్ స్కిట్నే కాస్త అటూఇటూ లాగి, పీకి, కాస్త పెద్దగా చేశారనిపిస్తుంది… దీనికి తగినట్టే బోలెడుమంది జబర్దస్త్ ఆర్టిస్టులున్నారు సినిమాలో… ఇంకేముంది..?
మరో విషయం తప్పక చెప్పుకోవాలి… అప్పట్లో బాలయ్య తీసిన సినిమా పేరు బంగారు బుల్లోడు… రవీనాటండన్ తెచ్చిపెట్టారు ఆ సినిమాలో… అసలే తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ టైపు కదా… అందాలను తడిపి తెర మీద ఆరేశాడు నాటి దర్శకుడు… ప్రత్యేకించి స్వాతిలో ముత్యమంత పాట పెద్ద హిట్ అప్పట్లో… ట్యూన్ ప్రభావం, పాట పాడిన బాలు, చిత్ర గళమాధుర్యం… కానీ..? ఆ రీమిక్స్ పాట ఈ సినిమాలో వింటుంటే… అయ్యో పాపం అనిపిస్తుంది… నరేష్, పూజా జవేరి (అంజనా జవేరితో ఈమెకు ఏ చుట్టరికమూ లేదని గమనించగలరు) స్టెప్పులు మరీ పేలవంగా, చూసేవాడికే అనిపించింది… ఫాపం, రేవంత్ మంచి సింగరే, కానీ తన గొంతు ఇక్కడ అస్సలు సూట్ కాలేదు… ఇక మిగతా సినిమా అంటారా..? ఏ పాత్రకు ఆపాత్ర వస్తుంది, తనకప్పగించిన డైలాగ్ పలుకుతుంది, వెళ్లిపోతుంది… చివరకు నరేష్‌లో సహజంగా కనిపించే ఎనర్జీ కూడా ఈ సినిమాలో లేదు… అల్లరిపాలయిపోతున్నావ్ నరేష్…!!
Share this Article