మెగా క్యాంపు అంటేనే హీరోలు, హీరోయిన్ల ఫ్యాక్టరీ… సారీ, యాక్టింగ్ అకాడమీ అనుకునేరు సుమా… ఆ కుటుంబసభ్యులే అలా ఒక్కొక్కరే రంగప్రవేశం చేస్తూ ఉంటారు… వైష్ణవ్ తేజ్ ఆ క్యాంపు రిలీజ్ చేసిన తాజా హీరో… ఆ సూపర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో… పైగా ఫెయిల్యూర్ల దశలో ఉండి హిట్ కోసం పరితపించే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్… సుకుమార్ నిర్మాణ భాగస్వామ్యం… సుకుమార్ శిష్యుడని చెప్పబడే బుచ్చిబాబు దర్శకత్వం… ఎంత ఖర్చయినా సరే, నిర్మాణవిలువల్లో రాజీ కనబర్చని మైత్రీ మూవీస్ నిర్మాణం… కాస్త చూడబుల్గానే ఉన్న హీరోయిన్ కృతిశెట్టి… అన్నింటికీ మించి నటనలో పండిపోయిన విజయ్ సేతుపతి… మెగాక్యాంపు ప్రమోషన్… ఇంకేం కావాలి సినిమా ప్రచారానికి..? ఫుల్ హైప్ వచ్చేసింది… చాలాసార్లు సినిమాలకు ఎక్కువ హైప్ శాపం అవుతూ ఉంటుంది… పెరిగిన అంచనాలకు ఏమాత్రం అందకపోయినా అది సినిమాను దించేస్తుంది, ముంచేస్తుంది…
నిజానికి ధనిక-ప్రేమ లవ్వులు, ధనిక తండ్రి పరువు సమస్యలు, ప్రేమకు అడ్డంకులు… ఇది చాలా ఓల్డ్ ఫార్ములా… చూసీచూసీ జనానికి విసుగొచ్చింది… ప్రజెంట్ జనరేషన్‌కు ఈ లేచిపోవడాలు, త్యాగాలు, కష్టాలు, ప్రేమ కోసం ఏదయినా చేయాలనే తపన పెద్దగా తెలియవు… అసలు ప్రేమకూ పెళ్లికీ, కలిసి బతకడానికీ లింకేమిటి..? దేనికదే కదా అనుకునే జనరేషన్ ఇది… లవ్వులు, బ్రేకప్పులు, రీయూనియన్లు, మరో ట్రాకు… కథ వేరే ఉన్నది ఇప్పుడు… ఈ స్థితిలో ఓ అసాధారణ, యాంటీ-సెంటిమెంట్ క్లైమాక్స్‌ను నమ్ముకుని మిగతా ఫార్ములా ప్రేమ కథంతా సోసోగా చుట్టబెట్టేయడం దర్శక నిర్మాతల సాహసమే… పైగా మగతనానికి ఈ దర్శకుడు ఇచ్చే నిర్వచనం ప్రేక్షకుడికి ఎక్కడం కష్టం… ఈ తరం నవ్వుకునే కాన్సెప్ట్… ఒక మెగా హీరో తన లాంచింగుకు ఈ కథను ఎంచుకోవడం కూడా సాహసమే… సరే, ఓ కొత్త హీరో రొటీన్, ఫార్ములా, ఇమేజీ బిల్డప్ సినిమా గాకుండా కాస్త డిఫరెంటు స్టోరీకి అంగీకరించి, తనకు చేతనైనంతగా కష్టపడ్డాడు, వోకే… కానీ సదరు క్లైమాక్స్ మెజారిటీ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు బహుశా… భారీ భారీ థియరిటికల్ డవిలాగులు… అదే నచ్చకపోతే సినిమా కథ అంతేసంగతులు…
Ads
మరి ఓవరాల్‌గా ఏమిటి..? హీరో పర్లేదు, ఇప్పటికింకా కొత్త కొత్తే కదా, చాలా నేర్చుకోవాలి… హీరోయిన్ బాగా చేసింది… మరిన్ని మంచి పాత్రలు పడాలే గానీ వెండి తెర మీద మరో నాలుగు రోజులు నిలదొక్కుకోగలదు… చూపించడమే నటన అనుకునే బ్యాచ్ కాదు, కాస్త హావభావాలు తెలిసిన పిల్లే… ఈమె తెరకు నిజానికి కొత్తేమీ కాదు… చాలా ఏళ్లుగా ఫీల్డ్‌లో ఉన్నదే… విజయ్ సేతుపతి గురించి చెప్పడానికి ఏముంది..? నిజానికి తనకు తగిన పాత్ర కాదు ఇది… తనను ఎఫెక్టివ్‌గా వాడుకోలేకపోయాడు దర్శకుడు… చివరలో విలన్ కేరక్టరైజేషన్ తేలిపోయింది… ఎడిటింగ్, స్క్రీన్-ప్లే పూర్, పూరున్నర… అసలే రొటీన్ సీన్లు, సోసోగా సాగే కథనం, దానికి తగినట్టుగా పేలవంగా ఎడిటింగ్… ప్రేక్షకులకు చాలాసార్లు విసుగొచ్చేస్తుంది… కాకపోతే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కాస్త సినిమాను నిలబెడతాయి… ఇంతకుమించి ఏమీలేదు…
Share this Article