స్టార్ హీరో అనే ఇమేజీ ఎవరినైనా సరే ఓ రొటీన్ బాటలోనే నడిచేలా చేస్తుంది… లేకపోతే పాపులర్ సినిమా డబ్బు లెక్కలు అంగీకరించవు… ప్రయోగాలు చేయనివ్వవు… ఆ బాటను తప్పి ఒక్క అడుగు కూడా అటూఇటూ పడనివ్వవు… కామన్ సెన్స్, లాజిక్ మన్నూమశానం అన్నీ తొక్కేస్తూ సాగిపోవాల్సిందే… ఫ్యాన్స్ ఒప్పుకోరు, బయ్యర్లు ఎవరూ సినిమా కొనరు… విశాల్ అయితేనేం, ఇంకెవరయితేనేం..? తన తాజా సినిమా చక్ర సినిమా చూశాక మరోసారి అనిపించేది ఇదే… పాపం విశాల్ అని జాలి కూడా కలుగుతుంది ఓసారి… అసలు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడు..? ఏం చెప్పాడు..? ఎందుకీ సినిమా..? ఎవరిని రంజింపచేయడానికి..? ఇప్పుడు ప్రతి హీరో పాన్ ఇండియా హీరోయే కదా… కనీసం పాన్ సౌత్ ఇండియా హీరోయే… ఏ భాషలో తీసినా, మిగతా భాషల్లోకి డబ్ చేసి ప్రేక్షకుల మీదకు వదలడమే… అలాగే ఈ చక్రం కూడా మన మీదికి వచ్చిపడింది…
నిజానికి ఈ కథ మీద వివాదం ఎందుకొచ్చిందో, కాపీ రైట్స్ కేసు ఎందుకు పడిందో, ఔటాఫ్ కోర్టు సెటిల్మెంట్ దాకా ఎందుకు పోయిందో, చివరకు దీన్ని విశాల్ సొంతం చేసుకోవడం ఏమిటో అర్థమే కాదు… సోది కథ… ఏదో ఈ-కామర్స్, సైబర్ క్రైం అన్నట్టు బిల్డప్పే గానీ సినిమా కథ పూర్తిగా దాని మీద ఏమీ సాగదు… ఏదో పైపైన టచ్ చేస్తూ… చివరకు మళ్లీ ఓ రొటీన్ సినిమా కథే… దీనికన్నా ఇదే విశాల్ తీసిన ఆ పాత అభిమన్యుడు కథే నయం… కాస్త సమాజానికి అవగాహన కల్పించాల్సిన సైబర్ క్రైమ్స్ పైనే సాగుతుంది… అందులో కాస్త రుచి, చిక్కదనం ఉంది… ఈ చక్ర కథలో అదీ లేదు… విశాల్ బాడీ బిల్డింగ్ షో తప్ప… ఇద్దరు హీరోయిన్ల సాదాసీదా అప్పియరెన్స్ తప్ప…
Ads
అన్నింటికీ మించి సినిమాలో నవ్వొచ్చేది ఏమిటంటే..? హీరో ఓ ఆర్మీ మ్యాన్… తన తండ్రికి సంబంధించిన అశోక చక్ర మెడల్ కూడా చోరీ అవుతుంది కాబట్టి, దాంతోపాటు పలు ఇళ్లలో జరిగిన చోరీల కేసులో ఇన్వాల్వ్ అవుతాడు… ఇక తను ఏం చెబితే అది పోలీసులు పాటిస్తుంటారు… అందరినీ దడదడలాడించేస్తుంటాడు… పోలీస్ అధికారులు తన ఆదేశాలను ఎస్సర్ అంటూ ఆచరిస్తూ ఉంటారు… అసలు ఆర్మీ మ్యాన్ అనే పేరే తప్ప తన కొలువుకూ, ఈ కథకూ లింకే ఉండదు, ఎంచక్కా తనను కూడా ఓ పోలీస్ అధికారిగా చూపించొచ్చు కదా… ఈ ఆర్మీ వేషంతో కథకు వచ్చే అదనపు విలువ, ఫాయిదా ఏమీ ఉండవు… అసలు పోలీసుల్లోనే బోలెడు విభాగాలు, ఒక అధికారి మాటను మరో విభాగంలోని సిబ్బంది పెద్దగా పట్టించుకోరు, ఎవరి పరిమితులు వాళ్లకుంటయ్… అలాంటిది ఓ ఆర్మీ మ్యాన్ చెప్పగానే పరుగులు తీస్తారా..? అబ్సర్డ్… ఈ తీరు చూశాక ఇక కథ మీద, సినిమా మీద తేలిక అభిప్రాయం ఏర్పడి, అసలు క్లైమాక్స్ వరకూ కూర్చోబుద్ది కాదు…
విశాల్ ఉన్నాడు కాబట్టి, తప్పదు కాబట్టి రెండు మూడు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టారు… మన కథకులు, మన దర్శకులు, మన సినిమాల తీరు ఏమిటయ్యా అంటే..? రోదసిలో రెండు శత్రుదేశాల ఉపగ్రహాల సమరం కథ తీసుకున్నా సరే… సముద్రంలో రెండు జలాంతర్గాముల నడుమ ఫైట్ తీసుకున్నా సరే, వాటి నుంచి హీరో బయటికి రావల్సిందే… సిక్స్ ప్యాకులు, వీలయితే మరో రెండు అదనపు ప్యాకులు చూపిస్తూ దైహిక పోరాటం చేయాల్సిందే… ఖర్మ… పాట లేకపోతే సినిమా సంస్కృతికి భంగకరం కాబట్టి ఓ పాట కూడా పెట్టారు ఇందులో… ఇంకా నయం, విశాల్కూ విలన్ రెజీనాకూ నడుమ డ్రీమ్ సాంగ్ పెట్టలేదు… హమ్మయ్య… అవునూ, విలన్ ఎంత సమఉజ్జీగా ఉంటే కథ అంత రక్తికడుతుంది… హీరోయిజాన్ని కూడా ఎలివేట్ చేస్తుంది… మరేమిటీ విలన్ పట్ల సానుభూతి పెంచే ఫ్లాష్ బ్యాక్ పెట్టారు ఇందులో… దీంతో విలన్ పట్ల ప్రేక్షకుడు కోపం ఎందుకు పెంచుకుంటాడు..? అదే లేనప్పుడు హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు పండుతుంది..? అబ్బే, విశాల్ బాబూ… సినిమాల్ని ఒప్పుకునేముందు ఇకపైనయినా కాస్త కథ వినవయ్యా బాబూ…!!
Share this Article