జీవితం ఏది, ఎలా ఇస్తే అలాగే స్వీకరించండి… ఇదీ బ్రో సినిమా కథ సారాంశం… ఇది బలంగా చెప్పాలంటే బలమైన ఎమోషన్స్ ఉండాలి సీన్లలో… అవి పండాలి కథనంలో… కానీ అలా కథ మీద, కథనం మీద కసరత్తులు చేస్తే అది తెలుగు సినిమా ఎందుకవుతుంది..? పైగా ఇందులో పవన్ కల్యాణ్ హీరో… అసలే తనను దేముడిగా పరిగణించే భక్తులకు కొదువ లేదు తెలుగు రాష్ట్రాల్లో… ఇక సాక్షాత్తూ తనను దేవుడి పాత్రలో చూపిస్తుంటే, దానికి తగిన బిల్డప్ లేకపోతే ఎలా..?
అదుగో దాని మీద కాన్సంట్రేట్ చేశాడు దర్శకుడు సముద్రఖని… ఇది వినోదయ సీతం అనబడే తమిళ చిత్రానికి రీమేక్… అది జీ5 ఓటీటీలో రిలీజ్ చేయబడినట్టు గుర్తు… ఒరిజినల్ చిత్రానికి దర్శకుడు కూడా సముద్రఖనే… అది ఓటీటీ సినిమా, కథకు ప్రాధాన్యం ఇస్తూ పెద్దగా పాపులర్ కాని నటులను తీసుకున్నారు… కానీ ఎప్పుడైతే రీమేక్‌లో ఇద్దరు హీరోలు… సాయిధరమ్ తేజ, పవన్ కల్యాణ్ నటించారో, ఈ సినిమాకు కాసిన్ని ఇమేజ్ బిల్డప్పులు అవసరమయ్యాయి… దాంతో అసలు కథనం మీద చూపించాల్సిన దర్శకుడి శ్రద్ధ కొట్టుకుపోయింది…
ఈమధ్య తమిళం, మలయాళం సినిమాల్ని తీసుకోవడం, వాటిని మన హీరోలు తమ ఇమేజ్‌కు తగ్గట్టు ఏవేవో మసాలాలు యాడ్ చేయడం ఎక్కువైపోయింది… సరే, ఆ చర్చలోకి వెళ్తే ఇక్కడ ఒడవదు గానీ ఈ సినిమా కథేమిటంటే… మార్కండేయులు అని పనికి బాగా ప్రాధాన్యత ఇచ్చే బిజీ మనిషి (సాయిధరమ్‌తేజ)… చుట్టూ అనేక సమస్యలు… అనుకోకుండా ఓ ప్రమాదంలో మరణిస్తాడు… తనకు టైమ్‌కు ఓ భౌతికరూపంగా గాడ్ టైటాన్ (పవన్ కల్యాణ్) కలుస్తాడు… బతుకుపో అని 90 రోజుల టైమ్ ఇస్తాడు… ఆ టైమ్‌లో తన సమస్యల్ని పరిష్కరించుకోవాలన్నమాట…
Ads
- టైమ్‌కు భౌతికరూపమేంటి..? 2. పైగా అదీ పుంలింగమే కావడమేంటి..? 3. ఈ టైముడు ఆ బాధితుడి అదనపు బతుకులో ఎప్పుడూ వెంట ఉండటం ఏంటి..? వంటి లాజిక్కుల జోలికి వెళ్తే అసలు కథే ఉండదు… అన్నింటికీ మించి టైమ్ అేదా డెస్టినీ అంటేనే ఫిక్స్‌డ్ బతుకు… ప్రిప్రోగ్రామ్‌డ్… అంటే ఏది ఎలా జరగాలో ముందే డిసైడయ్యేది… అంతేతప్ప అడిషనల్ టైమ్ అంటూ ఉండదు… సరే, కథ అంటేనే ఓ కల్పన, ఓ ఊహ కాబట్టి సమాధానపడదాం… కానీ..?
కథకు తగిన ప్రజెంటేషన్ బాగుండాలి… ప్రత్యేకించి పవన్ కల్యాణ్ వంటి హీరోను దేవుడిగా చూపిస్తున్నప్పుడు వావ్ అనిపించే సీన్లు బలంగా పండాలి… దాని మీద దర్శకుడి కసరత్తు బాగా జరగాలి… సృజన కనిపించాలి… కానీ పాత పాటలు, వింటేజ్ లుక్కులతో పవన్ ఇమేజే ప్రధానంగా సినిమా సాగితే ఫ్యాన్స్‌కు మాత్రమే, అదీ ఓ దశ వరకే బాగుంటుంది… ఫ్యాన్స్‌కు పండుగలాగే ఉంటుంది… కానీ సినిమా మొత్తం పవన్ కల్యాణే… ప్లస్ సాయిధరమ్ తేజీతో బ్రొమాన్స్… అంతే… ఈ క్రమంలో ఇద్దరు హీరోయిన్లు (కేతికశర్మ, ప్రియా వారియర్) ఉన్నా అవి పనికిమాలిన పాత్రలే, అంటే ప్రాధాన్యం దక్కని పాత్రలే… ప్రత్యేకించి ప్రియా వారియర్ ప్లేసులో ఎవరైనా సెకండ్ గ్రేడ్ తెలుగు నటిని తీసుకున్నా సరిపోయేది…
ఈ సినిమాకు ప్రధాన మైనసులు నాసిరకం పాటలు… నాణ్యత లేని వీఎఫ్ఎక్స్… తెరపై పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు, ఇక సినిమాలో ఏమున్నా, ఏం లేకపోయినా ఎవరూ పట్టించుకోరు అనే భావనలో దర్శకుడు కొట్టుకుపోయినట్టుంది… బీజీఎం కాస్త బెటర్… పాటల విషయంలో థమన్ ఫెయిల్… అసలే బలహీనంగా ఉన్న కథనానికి ఇవి కూడా తోడై సినిమా రేంజ్ తగ్గించేశాయి… పైగా సినిమా లైన్ కొత్తదేమీ కాదు… గతంలో కొన్ని సినిమాల్లో చూసిందే… అంతెందుకు, అక్కడక్కడా ఇదే పవన్ కల్యాణ్ దేముడిగా నటించిన గోపాల గోపాల అనే సినిమా గుర్తొస్తూ ఉంటుంది… కాకపోతే జీవితం ఏదిస్తే అది తీసుకొండి అనే సందేశాన్ని మాత్రం చివరలో బలంగా ఇవ్వగలిగారు..!! (అమెరికా ప్రేక్షకుల ఇన్‌పుట్స్ ఆధారంగా…)
Share this Article