Nancharaiah Merugumala…. బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ఇక ముందు ఓసీ కాపు విశ్వాసి కేఏ పాల్ మార్గంలో ఎన్నికల రాజకీయాల్లోకి దిగిపోకుండా…. మరో కోస్తా ‘కాపు క్రైస్తవ’ ఇవాంజలిస్టు, మియాపూర్ కల్వరీ టెంపుల్ అధిపతి డా.పి.సతీష్ కుమార్ దారిలో దేవుని వాక్యం చెప్పుకుంటూ బతికితేనే క్షేమం!
………………………………………
విశాఖపట్నం జిల్లాలో మూలాలున్న ఓసీ కాపు క్రైస్తవ ఇవాంజలిస్ట్ కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) మార్గంలో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి మరో ప్రొటెస్టెంట్ ఇవాంజలిస్ట్ బ్రదర్ మొరుసుపల్లి అనిల్ కుమార్ కూడా వస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ పేరిట కేఏ పాల్ కిందటిసారి ఎన్నికల్లో పోటీచేశారు. ఘోరంగా ఓడిపోయింది ఆయన పార్టీ. తెలుగుదేశంతో కుమ్మక్కయి 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.
Ads
మరి గుంటూరు జిల్లా మూలాలతోపాటు హైదరాబాద్ ఆంధ్రా బ్రాహ్మణవాడ నల్లకుంటలో స్థిరపడిన హిందూ బ్రామ్మణ ఆయుర్వేద వైద్యుడు ఎంవీ రమణారావు కొడుకైన బ్రదర్ అనిల్ హైదరాబాదీ అని చెప్పుకుంటున్నా ఆయన ఆంధ్రా మనిషిగానే బీఆరెస్ నేతలు పరిగణిస్తున్నారు. ఆయన భార్య వైఎస్ షర్మిలను సైతం (ఎంత హైదరాబాద్ లో చదువుకుని స్థిరపడినా) రాయలసీమ నాయకురాలిగానే వారు ముద్రవేశారు.
మరో పక్క దివంగత ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహిత మిత్రుడు, ఆత్మ సలహాదారు కోటగిరి వెంకట భాస్కర ( కేవీపీ) రామచంద్రరావు ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే తెర వెనుక పాత్ర పోషిస్తున్న కారణంగా– ఈ కృష్ణా జిల్లాలో మూలాలున్న పద్మనాయక వెలమ నాయకుడిని కూడా ఆంధ్రా నేతగానే చూస్తూ బీఆరెస్ మంత్రి గంగుల కమలాకర్ మొన్న విరుచుకుపడ్డారు.
ఈ ఆంధ్రా నాయకులంతా డిసెంబర్ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే–తెలంగాణను ఏపీలో కలిపేస్తారనే భయాందోళనలు వ్యక్తం చేశారు ఈ కరీంనగర్ మన్నూరు కాపు మంత్రి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డిపై కొడంగల్ లో బ్రదర్ అనిల్ కుమార్ తన భార్య పార్టీ తరఫున నిజంగా పోటీచేస్తే… చిక్కడపల్లి కోనసీమ ద్రావిడ బ్రాహ్మణ అభ్యర్థి ముషీరాబాద్ నియోకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీపడినట్టుగా కనిపిస్తుంది.
కాబట్టి, కడప ప్రొటెస్టంట్ క్రైస్తవ రెడ్డీల అల్లుడైన బ్రదర్ అనిల్ కుమార్ ఎంత ‘గుడ్ లుకింగ్, డైనమిక్, డాన్సింగ్’ ఇవాంజలిస్ట్ అయినా– ‘ఇంటర్నేషనల్ క్రైస్తవ లాబీయిస్టు’గా చెప్పుకునే కాపు క్రైస్తవుడు కేఏ పాల్ మార్గంలో పయనిస్తే అంత లాభదాయకం కాదేమో. ‘ఆంధ్రా కాపు ఇవాంజలిస్టు’గా ముద్రపడిన మియాపూర్ కల్వరీ టెంపుల్ అధినేత (పాస్టర్ రెవరెండ్) డాక్టర్ పి.సతీష్ కుమార్ మాదిరిగానే బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఇక ముందు కూడా ‘దేవుని వాక్యం’ చెబుతూ క్రైస్తవేతరులను– ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలని హైదరాబాద్, గుంటూరు జిల్లాలకు చెందిన హిందూ, క్రైస్తవ బ్రాహ్మణ విశ్వాసులు నమ్ముతున్నారు…
Share this Article