Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!

September 27, 2026 by M S R

.

రాజకీయాల్లో ఇటు పుల్ల అటు పడితే… అది యాదృచ్ఛికం కాదు… దాని వెనుక ఏదో వ్యూహం ఉంటుంది… బీజేపీ ప్రధాన వ్యూహకర్త, నంబర్ టూ … అక్టోబరు 4న తెలంగాణ టూర్‌కు వస్తున్నాడు… ఎందుకు..? దాని వెనుకా ఓ మంత్రాంగం ఉంది… పైకి ఏం కనిపించినా లోలోపల మార్మిక ఎత్తుగడలు వేరు, ఇచ్చే సంకేతాలు వేరు… బీజేపీ- బీఆర్ఎస్ పొత్తుపొడుపు ఆ సంకేతాలు!!

  • కాస్త లోతుల్లోకి వెళ్దాం… అమిత్ షా వచ్చేది దేనికి..? ప్రతిమ వైద్యకళాశాల రజతోత్సవం కోసం… అక్కడే లంచ్, అక్కడి నుంచి హైదరాబాద్‌కు, నేరుగా ఢిల్లీకి… ఇందులో విశేషం ఏమిటీ అంటారా..? ఆ కాలేజ్ ఎవరిది..? ప్రతిమ గ్రూపు సంస్థల ఓనర్ బోయిన్‌పల్లి శ్రీనివాసరావుది… తను మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సోదరుడు…

ఈ కుటుంబం బీఆర్ఎస్ ఖజానా… కోశాధికారి… గులాబీ ఆర్థిక యవ్వారాలు, మంతనాలకు అడ్డా… కొన్ని వేల కోట్ల కంట్రాక్టులు, ప్రతిమ పాలిత రాష్ట్రం తెలంగాణ అన్నట్టుగా నడిచింది పదేళ్లు… మరి ఆ పక్కా గులాబీ ఫంక్షన్‌ కోసం మాత్రమే అమిత్ షా వస్తున్నాడంటే, అంత ప్రాధాన్యం ఇస్తున్నాడంటే… అది దేనికి సంకేతం..? పొత్తు లేదా అవగాహన లేదా విలీనానికి ద్వారాలు తెరుస్తున్నారని అర్థం… హరీష్ రావు తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్లొస్తున్నాడు..? ఇవిగో ఇలాంటి సంప్రదింపుల కోసమే…

Ads

  • ఇక్కడ ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం… ఢిల్లీలో సీఈసీ రాజీనామా డిమాండ్లు, కలకలం నేపథ్యంలోనూ అమిత్ షా వీలుచేసుకుని వస్తున్నాడు… నిజానికి తను జూలైలోనే రావల్సి ఉంది… కానీ అప్పటి తుక్‌డే తుక్‌డే గ్యాంగు అల్లర్లు, మోదీ ప్రభుత్వ అసహాయత, వైఫల్యం, అల్లకల్లోల స్థితిలో అమిత్ షా ప్రోగ్రాం కేన్సిలైంది… దీనిపై ‘ముచ్చట’ ఓ కథనం కూడా పబ్లిష్ చేసింది…

brs bjp

తను ఇక్కడికి బీఆర్ఎస్ ట్రెజర్ గ్రూపు ఫంక్షన్‌కు వస్తాడు… కాళేశ్వరం సహా ఏ కీలక కేసులోనూ కేసీయార్ మీద బీజేపీ హైకమాండ్ ఈగ వాలనివ్వదు… పక్కా ప్రొటెక్షన్… బీజేపీ మీద పెద్దగా ఆరోపణలకు బీఆర్ఎస్ క్యాంపు దిగదు… సేఫ్ సైడ్… సో, బీజేపీతో రాజకీయ సంసారానికి వాతావరణం సిద్ధం చేయబడుతోంది…

అబ్బే, బీజేపీ జాతీయ కార్యదర్శినే లిఫ్ట్ చేసి, ఎమ్మెల్యేల కొనుగోలు దందా పేరిట బదనాం చేసి, మోదీని నానా దుర్భాషలు ఆడిన కేసీయార్‌ను మళ్లీ మోదీ కావిలించుకుంటాడా..? ఇదీ కొందరి ప్రశ్న… ఎస్, కౌగిలింత, కృత్రిమ ఆప్యాయతలు రాజకీయాల్లో అత్యంత సహజం… కేసీయార్‌ను మించి చంద్రబాబు తిట్టాడు, కానీ మోదీ ఆలింగనం చేసుకున్నాడు… కారణం..?

  • జగన్ వ్యతిరేక వోటు చీలిపోకూడదు, తమకు ఎక్కువ ఎంపీ సీట్ల మద్దతు కావాలి, పవన్ కల్యాణ్- చంద్రబాబులను ఎంటర్‌టెయిన్ చేసిన ఏకైక కారణం అదే… రాజకీయాల్లో బొద్దింకల్ని, గొంగళిపురుగుల్ని ముద్దాడటం అత్యంత సహజం… అనుకున్నట్టే జగన్ వ్యతిరేక వోటు సంఘటితమైంది… ఏపీలోని ఎంపీ సీట్లే మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమయ్యాయి…

ఎస్, తెలంగాణలోనూ బీజేపీకి అదే కావాలి… జాతీయ స్థాయిలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్… తెలంగాణలో రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయలేరు… బీఆర్ఎస్- బీజేపీ వోట్లు చీలితే కాంగ్రెస్‌కు లబ్ధి… అది నివారించాలంటే కేసీయార్ వంటి చంచల, అవిశ్వసనీయ కేరక్టర్‌నైనా సరే కావలించుకోవాల్సిందే… అదే బీజేపీ ప్రస్తుత ఆలోచనా ధోరణి… అమిత్ షా టూర్ సంకేతాలూ అవే… అందుకే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ కాదు, తనే కదిలివస్తున్నాడు…

అమిత్ షా

  • జరుగుతున్న పరిణామాలు బండి సంజయ్‌కు తెలుసు, ఈటల రాజేందర్‌కు తెలుసు… ఈ ఇద్దరూ ‘ప్రతిమ జిల్లా‘ నాయకులే… కేంద్రం సంకేతాలు అర్థమయ్యాయి, మొదటికే మోసం రాకుండా ఇద్దరూ ఒక్కటయ్యారు, రాజీపడ్డారు… ఎదురుగా ప్రతిమ అనే మరో పెద్ద భూతం కనిపిస్తోంది కదా…

పైకి మాత్రం కొన్ని వార్తలు కనిపిస్తుంటాయి… మల్లారెడ్డిని బీజేపీలో చేర్చుకుంటారు అని… బీఆర్ఎస్‌లో ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు నేతలను (వద్దిరాజు, పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ ఎట్సెట్రా)   నయానో భయానో బీజేపీలో చేర్చుకుంటారు అని..!

ఆ లీకుల ప్రచారాలన్నీ బీజేపీ- బీఆర్ఎస్ డైవర్షన్ టాక్టిక్స్… మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరలేడు… రేవంత్ రెడ్డి అస్సలు చేరనివ్వడు… డీకే ద్వారా సంప్రదింపులూ ఫెయిల్… (సాలే, గూట్లే అని లిటరల్‌గా తొడగొట్టి మరీ, నోటికొచ్చిన కూతలకు దిగాడు కదా అప్పట్లో రేవంత్ రెడ్డి మీద ఇదే మల్లారెడ్డి)…

  • సో, తన అక్రమాలకు, అక్రమార్జనకు రక్షణ కావాలి, తనకు రెండు ఎమ్మెల్యే సీట్లు, కోడలికి ఎంపీ సీటు, తన విద్యావ్యాపార జాతీయ విస్తరణకు సహకారం కావాలి… అందుకే టీడీపీ ద్వారా బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు… బీజేపీ దేనికిలే..? టీడీపీలో చేరు, సిటీలో డబ్బు ఖర్చు పెట్టు, మళ్లీ టీడీపీని యాక్టివేట్ చేద్దాం అని టీడీపీ సంప్రదింపులు…

ఇవన్నీ సరే… నిజంగానే బీఆర్ఎస్- బీజేపీ పొత్తుపొడిస్తే… తెలంగాణను మస్తు ఉద్దరించాలని కలలుకంటున్న పవన్ కల్యాణ్ మాటేమిటి..? కేసీయార్ పేరెత్తితే కళ్లురిమే చంద్రబాబు మాటేమిటి..? ఆ ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే… కేసీయార్- బీజేపీ పొత్తు పరిస్థితేమిటి..? అంతా గందరగోళం అంటారా..? ఎస్, కాలం సమాధానాలు చెప్పబోతున్నది..!!

  • అవునూ… బీఆర్ఎస్- బీజేపీ సంప్రదింపుల్లో (పొత్తు, విలీనం, అవగాహన, లోపాయికారీ సహకారం ఎట్సెట్రా ఏదైనా సరే) తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదీ ప్రస్తావనకు వస్తుందా..? ఇప్పుడే రాదు… ఇంకా చాలా క్లారిటీలు రావాలి…

ఏపీ టీడీపీ కూటమికి తెలంగాణలో కూటమికీ సంబంధం లేదు- ఏపీ కూటమి తెలంగాణకు దూరం ఉండాలి, కేటీయార్ సీఎం కేండిడేట్ అయ్యే పక్షంలో హరీష్ రావు పరిస్థితి ఏమిటి..? బీజేపీ బీసీ సీఎం నినాదం మాటేమిటి..? చాలా అంశాలు తేలాలి, తేలుస్తారు, ఎన్నికలకు ముందో, తరువాతో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా మాయ – కల్కి మహత్యం… రెండింటిదీ సేమ్ ఫార్ములా దందా !!
  • వంద ‘కాదు’లు ఒక ‘అవును’ కంటే ఎక్కువ నేర్పిస్తాయి!
  • సగటు తమిళుడికి తన భాష, సంస్కృతిపై ఓ ‘పిచ్చి ప్రేమ’… అంతే!
  • చలించిన న్యాయమూర్తి… ‘‘ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ…’’
  • కాళేశ్వరం బ్లండర్స్‌..! నిపుణులకూ రిపేర్ ప్లాన్స్ అంతుబట్టడం లేదు..!!
  • ‘ఏం చేస్తరు? ఉరి తీయరు కదా? – మేడారం నుంచి వాషింగ్టన్ !!
  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions