కేసీయార్ గవర్నర్, కేటీయార్ కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ పగ్గాలు హరీశ్‌రావుకు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చలు… ఇదీ రేవంత్ రెడ్డి చెబుతున్నది…
నో, నో, రేవంత్ రెడ్డే బీజేపీలో చేరతాడు… తన చివరి గమ్యం అదే, చూస్తూ ఉండండి… ఇదేమో కేటీయార్ ప్రతివిమర్శ… బీజేపీలో కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది, మాకున్న సమాచారం అదే… బండి సంజయ్ విసుర్లు…
ఫాఫం, రాష్ట్ర రాజకీయాలు… విలీనం చేయాలని బీజేపీ అడుగుతోందట, కానీ విలీనానికి కేసీయార్ సిద్ధంగా లేడట, అందుకని రెండు దశల చర్చలు ఆగిపోయాయట, ఒకవేళ కవితకు బెయిల్ వస్తే ఇక మొత్తం ప్రయత్నాలు ఆగిపోతాయట… ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిన విశ్లేషణ… బీజేపికి బీఆర్ఎస్‌కూ నడుమ మధ్యవర్తిత్వం వహిస్తున్నది ఎవరో తెలుసా..? అనడిగాడు…
Ads
కొంపదీసి కేసీయార్ అప్పట్లో అరెస్టు చేయడానికి ప్రయత్నించిన బీఎల్ సంతోష్ కాదు కదా అనే డౌటొచ్చింది సుమా… ఎవరినైతే అరెస్టు చేయాలని అనుకున్నారో ఆయన దగ్గరకే వెళ్లి పైరవీలు చేస్తున్నారా అనే సందేహాలు రాకుండా… వెంటనే ఆర్కే ఓ గవర్నర్ అన్నాడు… తనే టీడీపీకి, బీజేపీకి నడుమ సయోధ్య కుదిర్చాడట… మోడీకి ఆయన ఎంత చెబితే అంత అట… ఆయన ఆర్ఎస్ఎస్ ముఖ్యుడట కూడా…
తను రాసుకొచ్చిందాంట్లో కొంత నిజం ఉండవచ్చు… కానీ ఎవరితో కలవాలి, ఏ వ్యూహం అమలు చేయాలనే విషయంలో మోడీషాలకు కొన్ని సొంత లెక్కలుంటాయి… పలు మార్గాల్లో విశ్లేషణలు తీసుకుంటారు… ఏరకంగా చూసినా బీఆర్ఎస్ విలీనం అనేది బీజేపీకి ఇప్పటికిప్పుడు పెద్ద ఉపయోగించేది ఏమీ కాదు… బీఆర్ఎస్ దెబ్బతినే కొద్దీ బీజేపీకే ఎక్కువ ఫాయిదా… మెల్లిమెల్లిగా కాంగ్రెస్ మీద యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ పెరుగుతూ ఉంటుంది…
మరి ఏమాత్రం నమ్మదగని కేసీయార్‌ను నమ్మి కేసీయార్ నిర్దేశిత ఎజెండాకు బీజేపీ ఎందుకు తలవంచాలి..? అందుకే చేస్తే విలీనమే లేదంటే నో పొత్తు, నో మధ్యేమార్గ మార్గాలు… ఇక్కడ కవిత బెయిల్ ఒక్కటే ప్రధానం కాదు… బీఆర్ఎస్ మనుగడే ముఖ్యమైపోతుంది కేసీయార్‌కు… రేవంత్‌రెడ్డి తన నట్లు బిగిస్తూ ఉంటాడు ఇంకా… బీజేపీ కూడా వదలదు… స్వార్థంలో, ఈ అహోబిల మఠంలో చేరిన వాళ్లు వెళ్లిపోతారు… అదీ పరిస్థితి…
ఎహె, బీఆర్ఎస్ ఓ జాతీయ పార్టీలో విలీనం కావడం ఏమిటి నాన్సెన్స్ అని కొందరు గొంతు విప్పి ఏదో గాంభీర్యాన్ని నటిస్తున్నారు గానీ… ఇదే కేసీయార్ తెలంగాణ వచ్చిన కొత్తలో కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి రంగం సిద్ధం చేయలేదా..? ఆ తిక్క దిగ్విజయ్ సింగ్ దాన్ని వర్కవుట్ చేయలేక కేసీయార్ బయటే ఉండిపోయాడు, శుక్రమహర్దశ సహకరించి పదేళ్లు పాలించాడు… కానీ అన్నిరోజులూ మనవి కావు కదా… ధడేలున నేల మీదకు పడిపోయాడు…
కాంగ్రెస్‌కు సహకరించి బీజేపీని దెబ్బతీయాలని తను ప్రయత్నించలేదా..? బీజేపీ ఈ నిజాలు మరిచిపోయిందా..? అంతెందుకు..? అంతకుముందు కేటీయార్‌ను సీఎంను చేస్తాననీ, మీ ఆశీస్సులు కావాలనీ కేంద్రాన్ని కేసీయార్ అభ్యర్థించలేదా..?
సో, సరిగ్గా ప్రయత్నిస్తే విలీనం పెద్ద కథేమీ కాదు, కానీ దాంతో బీజేపీకి తక్షణం వచ్చే ఫాయిదా ఏమిటనేదే పెద్ద ప్రశ్న… పైగా ఇప్పుడు సందర్భం ఏమిటి..? కేవలం కేసీయార్ రక్షణ కోసమా..? ఆ ఆబ్లిగేషన్ బీజేపీకి ఏముంది..? సో, బీజేపీయే ఆ గవర్నర్ ద్వారా తెలంగాణ యంత్రాంగం వర్కవుట్ చేయాలని మోడీ కోరాడనే రాధాకృష్ణ వ్యాఖ్యలో నిజం లేదనిపిస్తోంది…! అవసరం ఇప్పుడు కేసీయార్‌ది… బీజేపీది కాదు..!!
పైగా కాంగ్రెస్‌లో సీనియర్లు వర్సెస్ రేవంత్ యవ్వారాలు ముదిరితే బీజేపీ ప్రయత్నాలు మరో మార్గంలోకి వెళ్లవని గ్యారంటీ ఏమిటి..?!
Share this Article