.
‘‘శెభాష్ రేవంత్ రెడ్డీ… మా పదేళ్ల పాలనలో మేం కృష్ణా జలాల్ని జగన్‌కు దోచిపెడితే, తెలంగాణ ప్రయోజనాల్ని విస్మరిస్తే… నువ్వు మాత్రం బయటపడకుండా, సైలెంటుగా అద్భుతమైన వర్క్ చేస్తున్నావు… కీపిటప్’’…….. ఇలా బీఆర్ఎస్ క్యాంపు పరోక్షంగా రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తే, సర్టిఫికెట్ ఇస్తే ఎలా ఉంటుంది..?
…. అబ్బే, అంత సీన్ లేదు, ఏవేవో చాట్‌జీపీటీలు, పీపీటీల పేర్లతో అనేక అబద్ధాలతో బదనాం చేస్తున్న బీఆర్ఎస్ క్యాంపు అంత పని ఎందుకు చేస్తుందీ అంటారా..? అందుకే ‘పరోక్షంగా’ అనేది… పాలమూరు- రంగారెడ్డిపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం, కేసీయార్ ఫామ్‌హౌజ్ జలసమరం పుణ్యమాని… కృష్ణాలో తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి బయటికొచ్చింది… ఎలాగో కాస్త వివరంగా చెప్పుకుందాం…
Ads
- ‘‘కమీషన్ల కాళేశ్వరం కక్కుర్తితో కృష్ణా ప్రాజెక్టులను వదిలేసి, జగన్ నీళ్లదోపిడీకి సహకరించి, తెలంగాణ ప్రయోజనాలను కాలరాసింది కేసీయార్ ప్రభుత్వమే’’ అని కదా రేవంత్ రెడ్డి విమర్శ… ‘‘నో, నో, నీకే ఏమీ చేతకావడం లేదు, మేం పంపించిన డీపీఆర్‌లన్నీ వాపస్ వస్తున్నాయి, నువ్వు తట్ట మట్టి కూడా ఎత్తడం లేదు పాలమూరు ప్రాజెక్టుకు…’’ ఇదే కదా బీఆర్ఎస్ కౌంటర్…
‘‘నేను ఒత్తిడి తెచ్చాను, అందుకే చంద్రబాబు రాయలసీమ లిఫ్టు పనులు ఆపేశాడు’’ అనే వ్యాఖ్యతో రేవంత్ రెడ్డి అనుకోకుండా పెద్ద డొంక కదిలించాడు… నో, నో, జగన్ హయాంలోనే ఆగిపోయింది, అదీ వైఎస్సార్సీపి చేతకానితనమే అని టీడీపీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే… కాదు, చంద్రబాబే ఆపేశాడు, రేవంత్ రెడ్డి చెప్పినందుకే అని వైఎస్సార్సీపి ఆరోపిస్తోంది… అది ఏపీలో బ్లేమ్ గేమ్…
చంద్రబాబు ఏపీ జలద్రోహి అని చెప్పేందుకు ‘సాక్షి’ ఈరోజు భారీ కథనాలను వెలువరించింది… (ఏపీ ఎడిషన్‌లో మాత్రమే వస్తాయి, గమనించగలరు…) అందులో ప్రధాన సారాంశం ఏమిటంటే..?

రేవంత్ రెడ్డి సైలెంటుగా తెలంగాణలో కృష్ణా జలాలపై ఏకంగా 16 ప్రాజెక్టుల నిర్మాణాన్ని సంకల్పించాడు… డీపీఆర్ తయారీకి మొన్నటి సెప్టెంబరు 16న జీవో కూడా జారీ చేశాడు… ఈ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 372 టీఎంసీలు… ఇదీ సాక్షి చెప్పింది… జీవో ప్రతి పబ్లిష్ చేసింది…
సో, హరీష్ రావు పీపీటీలో చెప్పినట్టు రేవంత్ రెడ్డి వైఫల్యమనేదీ ఏమీ లేదన్నట్టే లెక్క కదా.., పైగా బీఆర్ఎస్ కూడా అర్థం చేసుకోలేనంత వేగంగా, పకడ్బందీగా… (పోనీ, అర్థమయ్యీ, బయటపెట్టలేని ఉడుకుమోత్తనం… తమకు చేతకానిది రేవంత్ రెడ్డి చేస్తున్నాడనే అనూహ్య దిగ్భ్రమ…) రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదులుతోందని అంగీకరించినట్టే కదా…

ఇదుగో, ఇవీ ఆ 16 ప్రాజెక్టులు… సవివరంగా, టీఎంసీల లెక్కలతో సహా…! థాంక్స్ సాక్షీ… చంద్రబాబును తిట్టడం కోసమైనా సరే, జనానికి తెలియని కొన్ని కృష్ణా నిజాల్ని బయటపెట్టినందుకు..!
- అవకాశముండీ, హక్కులుండీ… కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీ అడ్డగోలుగా శ్రీశైలం నీటిని తరలించుకుపోవడానికి జగన్- కేసీయార్ దోస్తీ ప్రయత్నిస్తే…. ఆ అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దే పనిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సాక్షి సర్టిఫికెట్ ఇస్తోంది… పరోక్షంగా బీఆర్ఎస్ కూడా ప్రశంసించినట్టే… ఎందుకంటే..?
సాక్షి అంటే జగన్ వాయిస్… అంటే జగన్… జగన్ క్యాంపు అంటేనే కేసీయార్ అనుంగు ఆత్మీయ స్నేహితుడు… అనగా రెండూ సేమ్ సేమ్… అనగా సాక్షి సర్టిఫికెట్ అంటే… పరోక్షంగా హరీష్ రావు, కేటీయార్, కేసీయార్ కూడా సర్టిఫికెట్ ఇచ్చినట్టే… కాకపోతే ఈ నిజాలన్నీ తెలిసి హరీష్ రావు ఎక్కడ రేవంత్ రెడ్డికి క్రెడిట్, మైలేజీ వస్తుందోనని బయటపెట్టలేదు… చంద్రబాబును తిట్టాలనే ఉక్రోషంతో సాక్షి బయటపెట్టింది, అంతే తేడా..!!

అవునూ… తెలంగాణ ఇరిగేషన్ శాఖలోని ప్రతి కాగితమూ ఇప్పటికీ హరీష్ రావుకు వెంటవెంటనే చేరుతుంది కదా… ఈ 16 ప్రాజెక్టుల డీపీఆర్ తయారీ జీవో విషయం కూడా తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ కుమార్ రెడ్డికి తెలియదా..? తెలిసీ సైలెంటుగా ఉండిపోయాడా..? చేసిందేదో చెప్పుకోవాలి కదా…!! ఏపీ కోర్టుకు ఎక్కుతుందని సందేహమా..?!
నో, నో, అలా అనుకోకూడదు... రెండు తెలుగు రాష్ట్రాలూ పరస్పరం సహకరించుకోవాలని కదా నిన్న చంద్రబాబు హితబోధ చేసింది... తను ఏమాత్రం అడ్డుపడడు... తన రెండు కళ్లల్లో ఒక కన్ను పేరు తెలంగాణ..!! ప్రతిపాదిత నల్లమలసాగర్ సాక్షిగా..!!
Share this Article