.
గమనించారో లేదో గానీ… బీఆర్ఎస్ క్యాంపు మాటపడిపోయింది… అంటే, ఫుల్లు డిఫెన్సులో పడిపోయింది… ప్రత్యేకించి కేసీయార్ ఫామ్స్‌కు కొండపోచమ్మ నీళ్లను అక్రమంగా తరలించుకుంటున్న తీరును రేవంత్ రెడ్డి బలంగా ఎక్స్పోజ్ చేశాక, ఇక ఏం మాట్లాడాలో తెలియడం లేదు బీఆర్ఎస్ నేతలకు… కేసీయార్ అక్రమాన్ని ఎలా సమర్థించాలో అర్థం గాక వదిలేశారు… అవును, చివరకు గాలిపోగేసి టన్నుల కొద్దీ బురద జల్లే అలవాటున్న కేటీయార్, హరీష్ కూడా సైలెంట్…
సీఎం తనే మొదట ఈ విషయాన్ని బయటపెట్టాడు, తరువాత వీ6 గ్రౌండ్ రిపోర్టు వీడియోలు, ఫోటోలు, వివరాలతో చాకిరేవు పెట్టింది… తరువాత బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆ పత్రిక, ఆ చానెల్‌కు… తరువాత పీసీసీ చీఫ్‌కు, మంత్రి పొంగులేటికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నట్టు ఓ ప్రకటన జారీ చేసింది… అందులో కూడా ఆ వార్తలు, ఆ ఆరోపణలు ఎందుకు అబద్దమో చెప్పడం లేదు… కేవలం మాజీ సీఎం కేసీయార్ ప్రతిష్టకు భంగకరం అంటోంది…
Ads

నిజానికి ఈ కొండపోచమ్మ జలబాగోతం నిజం కానట్టయితే… ఆ 3 ఎకరాల బావి అబద్ధమైతే, కేసీయార్ పొలాల కోసమే తవ్వబడిన ఆ పాండురంగ చెరువు అబద్ధమైతే, అందులో నుంచి అనేక పంపుసెట్లు నిర్విరామంగా నీటిని తరలించడం అబద్ధమైతే, కొండపోచమ్మ నుంచి పాండురంగ చెరువుకు కాలువ అబద్ధమైతే… ఈపాటికి కేటీయార్, హరీష్ సహా బీఆర్ఎస్ చిన్నాచితకా నేతలు ఖండించేవాళ్లు… గాయిగత్తర చేసేవాళ్లు…
కానీ ఫోటోలు, వీడియోలు కనిపిస్తుండేసరికి… అక్కడ జరుగుతున్న బాగోతం నిజమయ్యేసరికి ఇక ఎవరికీ ఖండించడానికి మొహం చెల్లడం లేదు… పాపం, నమస్తే తెలంగాణ ఏదో కష్టపడి కొందరు నేతల నుంచి అభిప్రాయాలు, విమర్శలను సేకరించినట్టుగా కలరిస్తూ… సదరు పత్రికను తిట్టించి, పబ్లిష్ చేసుకుని మురిసిపోయింది గానీ… కొండపోచమ్మ నీటితరలింపు అబద్ధమని ఆ పత్రికకూ ఎస్టాబ్లిష్ చేయడం చేతకాలేదు… ఆ ప్రయత్నమూ చేయలేదు… ఒకవేళ అబద్ధమే అయి ఉంటే పుంఖానుపుంఖాలుగా ఠావుల కొద్దీ కథనాలు వండి వార్చేది… అదీ లేదు, ఎందుకంటే, అది అబద్ధం కాదు కాబట్టి..!

బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఏమీ మాట్లాడకుండా ఎలాగూ తెలంగాణ సమాజానికి మొహం చూపించడం లేదు… పోనీ, వరుసగా బయటపడుతున్న అనేకానేక తన అక్రమాలతో మొహం చెల్లడం లేదు అనుకుందాం… కానీ హరీష్, కేటీయార్ ఏరి..? ఏమీ మాట్లాడరేమి..? అసలే సర్కారీ భూముల కబ్జా, స్టార్ హోటళ్లు, ఫామ్ హౌజులు గట్రా రేవంత్ ఆరోపణలకే సరైన సమాధానాల్లేవు… ఇక కొండపోచమ్మ నీటితరలింపు యవ్వారంపై ఏ స్పందనా లేదు…
మొన్న నమస్తే తెలంగాణలో ఓ బ్యానర్ స్టోరీ… బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పేరిట పేద్ద ఆరోపణ… నిజంగానే అంత సీరియస్ ఆరోపణలు అయితే… అధికార ప్రతినిధి పేరిట ప్రత్యేక భారీ కథనాలు దేనికి..? హరీష్ లేదా కేటీయార్ స్వయంగా స్పందించి వివరాలు వెల్లడించొచ్చు కదా… ఇక తెలంగాణ జనం ఏమాత్రం తమ ఆరోపణల్ని, విమర్శల్ని నమ్మడం లేదని ఫిక్సయ్యారా.,.?

ఇదే కాదు, చాలా విషయాలపై దాసోజు, ప్రవీణ్, క్రిశాంక్ మినహా మిగతా వారెవ్వరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు… సాధారణంగా ఎక్కడైనా ప్రతిపక్షం ధాటికి ప్రభుత్వం డిఫెన్సులో ఉంటుంది… కానీ తెలంగాణ వేరు… మూడేళ్లవుతున్నా పాత బీఆర్ఎస్ నిర్వాకాలే బయటపడుతూ… అధికార పక్షం దాడికి ప్రతిపక్షమే ఫుల్లు డిఫెన్సులో ఉండిపోతోంది…
ఎలాగూ కేసీయార్ ఫామ్ హౌజు భూముల యవ్వారంపై విచారణ- సర్వే జరిపిస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి… అదేసమయంలో ఈ జలచౌర్యం మీద కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సంయుక్త సర్వే- విచారణ జరిపిస్తాడా..? అసలు నిజాల్ని తెలంగాణ సమాజానికి వెల్లడిస్తాడా చూడాల్సి ఉంది… లేక ఫార్ములా వన్, కాళేశ్వరం, విద్యుత్ అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి సీరియస్ అంశాల్లోనూ కేసీయార్ కుటుంబాన్ని దాదాపు క్షమించేసినట్టుగా… ఈ విషయంలోనూ క్షమాభిక్ష పెట్టేస్తాడా కూడా చూడాల్సి ఉంది..!!
Share this Article