పద్ధతి అంటే సుమ… సుమ అంటే పద్ధతి… అంటారు అందరూ… పద్ధతి లేని వాతావరణం గనుకే ఆమె సినిమాలు చేయదు, కానీ సినిమా ఫంక్షన్లు ఆమె తప్ప ఇంకెవరూ చేయరు ఆల్‌మోస్ట్… ఇన్ని వందల ప్రోగ్రామ్స్ చేసినా సరే ఒక్క పొల్లు మాట, ద్వంద్వార్థపు మాట రానివ్వదు తన నోటి నుంచి… అలాంటి పద్ధతి కలిగిన యాంకర్ సుమ ఎందుకు పద్ధతి తప్పింది..?
తన కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్‌గమ్ సినిమా చూశాక అందరికీ వచ్చే సందేహమే ఇది… హీరోయిన్‌తో అంతగా లిప్ లాకులేమిటి..? ఒక పాటంతా కిస్సులే.., అవీ పైపైన కిస్సులు కాదు, మరీ ఓటీటీ కంటెంట్ బాపతు ఘాటు కిస్సులు, హగ్గులు, రొమాన్స్, ఇంటిమేట్ సీన్లు, dailogues… ఎహె, తన కొడుకు సినిమా గురించి సుమను ఎందుకు అనాలి అంటారా..?
తన కొడుకును హీరోగా లాంచ్ చేయడానికి ఆమె నానా ప్రయాస పడింది… ఇండస్ట్రీలోని తన పరిచయాల్ని ఉపయోగించింది… తను లేక ఆ సినిమా లేదు… కథ దగ్గరి నుంచీ సినిమా రిలీజ్ వరకు ఆమె మాటే చెల్లుబాటు… అఫ్‌కోర్స్ తన మొగుడు రాజీవ్‌ను కాసేపు పక్కన పెట్టేయండి, రోషన్ కెరీర్ మీద తనకెలాంటి మాట చెల్లుబాటు లేదు… సుమ రానివ్వదు… మరి ఓ డెబ్యూ సినిమా ఎలా ఉండాలి..? సుమకు ఆమాత్రం సోయి లేదా..? రోషన్ సినిమా అనరు, సుమ కొడుకు సినిమా అంటారు..? తేడా అర్థమైంది అనుకుంటా…
Ads
యూత్ సినిమా అంటే సదరు దర్శకుడికి, సుమకు చాలా నీచాభిప్రాయం ఉన్నట్టుంది… నాలుగు కిస్సులు, నాలుగు హగ్గులు ఉంటే చాలు థియేటర్లకు యువత పోలోమంటూ వచ్చేస్తారనే ఓ తప్పుడు అభిప్రాయం ఉన్నట్టుంది… అరచేతిలో ఆ బాపతు వీడియోలను పచ్చిపచ్చిగా స్మార్ట్ ఫోనే అందిస్తుంటే ఈమాత్రం కిస్సులకు యూత్ అట్రాక్టవుతారా..? ఈ దిక్కుమాలిన సినిమాను థియేటర్లలో దేనికి..? నేరుగా ఏదో ఓటీటీలోకి ఇచ్చేస్తే బాగుండేది… టీవీల్లో ప్రసారం కూడా వేస్ట్… మళ్లీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బంది పడతారు…
ఈ సినిమా దెబ్బకు సుమ తన ఇజ్జత్ కోల్పోయింది… ఆ హీరోయిన్ మానస చౌదరి అట, వెరీ లిబరల్… నటన, తొక్కాతోలూ వంటివి ఏమీ పట్టించుకోలేదు… యాక్షన్ అనగానే రోషన్ మూతిలో మూతి పెట్టేయడమే… (ఈ యాక్టర్లకు నెలరోజులు సినిమా టీం శిక్షణ ఇచ్చిందని ఏదో వార్త చదివినట్టు గుర్తు… ఈ సీన్లు చేయడానికా..?) మీ దుంపతెగ… డీజే కావాలని కలలు గనే హీరో, లవ్ అంట్ లస్ట్ మాత్రమే అనుకునే హీరోయిన్… ఇంటర్వెల్ తరువాత కన్విన్సింగ్‌గా లేని ఓ రివెంజ్ కథ… బోర్, బోరర్, బోరెస్ట్…
సుమకు బాధ అనిపించినా సరే ఒకటి మాత్రం నిజం… రోషన్ కలర్ వదిలేస్తే తను హీరో మెటీరియల్ కాదు… ఆ లుక్కు పెద్దగా ఇంప్రెసివ్ కాదు… పర్లేదు, మన వారస హీరోలకన్నా అధ్వానం కాదు కదా అంటారా..? అది మాత్రం నిజం… నాలుగు మంచి పాత్రలు పడితే తనే క్లిక్కవుతాడు… కాకపోతే ఆ పాత్రలు రావడం ఎలాగనేదే పెద్ద ప్రశ్న.,.
ఎంతసేపూ మనం హీరోలు, హీరోయిన్లు, పాటలు, బీజీఎం ఎట్సెట్రా సమీక్షిస్తుంటాం గానీ పెద్దగా సపోర్టింగ్ పాత్రల గురించి విస్మరిస్తాం… కానీ ఈ సినిమాలో ఓ పాత్ర గురించి చెప్పాలి… జొన్నలగడ్డ చైతూ… హీరో తండ్రి కేరక్టర్… చికెన్ షాపు ఓనర్ పాత్ర… తన కామెడీతో రక్తికట్టించాడు ఆ పాత్రను… జొన్నలగడ్డ సిద్దూ బ్రదర్ అన్నారు తను… తనకు మంచి పాత్రలు దక్కాలే గానీ మంచి కమెడియన్ కమ్ కేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడతాడు… గ్యారంటీ…!! బబుల్‌గమ్ అంటే మొదట కాస్త తీయగా ఉంటుంది, తరువాత చప్పచప్పగా… సాగుతూ సాగుతూ… సుమా, ఇవ్వాళారేపు బబుల్‌గమ్ ఎవడు తింటున్నాడమ్మా…!!
Share this Article