Murali Buddha………. ఎన్టీఆర్ ఉసురు తగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత…. జర్నలిస్ట్ జ్ఞాపకాలు-
————————————-
శత్రువును ఎదుర్కోలేని బలహీనమైన వ్యక్తి ‘‘నిన్ను దేవుడే చూసుకుంటాడు . నాకు అన్యాయం చేశావు నా ఉసురు నీకు తగులుతుంది’’ .అని శపిస్తాడు . శాపాలు నిజం అవుతాయా ? నిజంగా ఉసురు తగులుతుందా ? ఏమో ఇది కూడా దేవుడు ఉన్నాడా ? లేడా ? దయ్యాలు నిజమా ? అబద్దమా ? అనే చర్చ లాంటిది . ఎప్పటికీ కొనసాగే చర్చ . ఎన్టీఆర్ కుటుంబీకులు , పార్టీలో సీనియర్ నాయకులు మరణించినప్పుడల్లా ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే మాట వినిపిస్తుంది .
జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సమావేశాలు జరిగేవి . సమావేశం జరిగే హాలులో ఎన్టీఆర్ చిన్న విగ్రహం ఏర్పాటు చేసి నివాళి అర్పించి కార్యక్రమం నిర్వహించేవారు . ఒకరోజు ఇలా సమావేశం అని వెళ్లాను… టీడీపీ మహిళా నాయకురాలు షంషాద్ బేగం అని నిండా నగలు వేసుకొని వచ్చేది . ఎన్టీఆర్ విగ్రహం వెనుక వైపుకు వెళ్లి, కొద్ది సేపు కళ్ళు మూసుకొని, తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ మొక్కింది . ఎంత అభిమానం ఉన్నా ఎవరైనా ముందు నుంచి మొక్కుతారు. ఈమె వెనుక నుంచి మొక్కుతుంది అని వింతగా అనిపించింది . వెనుక నుంచి వెన్నుపోటు ఒకే కానీ మొక్కడం కూడానా ? అనిపించింది .
ఆమె పెద్దావిడే… వార్త రిపోర్టర్ నాగేశ్వర్ రావుతో బాగుండేది . ఆమె నగల మీద జోకులేసేవాడు . మీడియా కూర్చున్న వద్దకు వస్తే, ఆమెను నాగేశ్వర్ రావు ‘ఏంటి కథ, వెనుక నుంచి మొక్కుతున్నారు’ అని నవ్వుతూ అడిగితే ఆమె సీరియస్ గానే చెప్పింది . మెహిదీపట్నంలో సొంత ఇల్లు , ఎగువ మధ్యతరగతి కుటుంబం . పదవులపై పెద్ద పెద్ద ఆశలు ఉన్నా మహిళా విభాగంలో తప్ప ఏమీ రాలేదు . నాకు ఎన్టీఆర్ ఉసురు తగిలిందేమో అనిపిస్తోంది . జీవితం గొప్పగా ఏమీ లేదు . ఎన్టీఆర్ ఉసురు తగిలి ఇలా ఉన్నాను అనిపిస్తోంది . అన్నగారు నేను తెలియక పాపం చేశాను క్షమించు అని మొక్కుతున్నాను . ఏమో ఇదో నమ్మకం, మొక్కితే పోయేదేముంది అని చెప్పుకొచ్చింది .
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు , పార్టీ , మీడియా పెద్దలు వెన్నుపోటులో తమ తమ పాత్రలు పోషించారు . ఎన్టీఆర్ కుమారుడు , కుమార్తె మనవడు అకాల మరణం , అప్పటి కీలక నేతలు బాలయోగి , మాధవరెడ్డి , లాల్ జాన్ బాషా , ఎర్రం నాయుడు , హరికృష్ణ వంటి వారు ప్రమాదాల్లో మరణించారు . ఈ మరణాలు జరిగిన ప్రతిసారి ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే చర్చ వినిపించేది . మీడియా ఇలాంటి నమ్మకాలను రాయదు కానీ పార్టీ నాయకుల్లో చర్చ అయితే జరిగేది .
ఎన్టీఆర్ ను దించడంలో మూడు పత్రికలు కీలక పాత్ర వహించాయి . వాటిలో ఆంధ్రప్రభ , ఆంధ్రజ్యోతి… వీటి యజమానులు పత్రికలు అమ్ముకున్నారు. వందల కోట్లు విలువ చేసే ప్రభ భూమి కోసమే అప్పుడు యాజమాన్యానికి చెప్పి ఒప్పించి, బాబుకు మద్దతు ఇచ్చారు అని ఓ ప్రచారం . ఇప్పటికి ఆ భూమి సమస్య పరిష్కారం కాలేదు . ప్రభను సంతాలియా అమ్ముకోవాల్సి వచ్చింది .
అదే విధంగా జగదీష్ ప్రసాద్ బాబుకు అండగా నిలిచినా, జ్యోతిని అమ్ముకొని వెళ్లి పోవలసి వచ్చింది . ఇటీవలే ఓ వీడియో చూస్తే రామోజీ రావు నాకు 87 ఏళ్ళు , ఒక్కసారి కూడా ఇలా నా దగ్గరకు పోలీసులు రాలేదు . కాల మహిమనో , జగన్ మహిమనో ఇలా జరిగింది అంటూ మంచం మీద దీనంగా పలకడం నమ్మకం ఉన్న వారికి ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం వల్ల అనిపించింది . ఎన్టీఆర్ ఉసురు గురించి ఇదో రకం వాదన ఐతే దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా చూపవచ్చు .
ఎన్టీఆర్ ను దించేసిన వారిలో ఎంతో మంది అత్యున్నత స్థాయికి వెళ్లారు . మొత్తం వ్యవహారానికి నాయకత్వం వహించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు . పార్టీ పెట్టిన ఎన్టీఆర్ మూడుసార్లు కలిపి ఐదేళ్లు సీఎంగా ఉంటే బాబు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు , ఆంధ్రాలో ఐదేళ్లు సీఎంగా ఉన్నారు . 45 ఏళ్ళ వయసులో బాబు ఎన్టీఆర్ కు చుక్కలు చూపిస్తే , అదే 45 ఏళ్ళ వయసులో జగన్ బాబుకు చుక్కలు చూపిస్తూ , భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చారు .
చివరి వరకు ఎన్టీఆర్ కు అండగా నిలిచినా ఇంద్రారెడ్డి ప్రమాదంలో మారణించారు . వెన్నుపోటుకు మద్దతుగా నిలిచిన ఆంధ్ర జ్యోతిని ఓనర్ అమ్ముకుంటే.. రిపోర్టర్ గా మద్దతు ఇచ్చిన వ్యక్తి పత్రికను కొనుక్కొని ఓనర్ అయ్యారు . అప్పుడు కీలక పాత్ర వహించిన రిపోర్టర్లు అందరు కూడా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్లారు . ఒక్క ఈనాడు మినహా . ఈనాడులో యాజమాన్యమే ప్రయోజనం పొందుతుంది కానీ మిగిలిన పత్రికల్లా రిపోర్టర్లు ప్రయోజనం పొందే ఛాన్స్ ఉండదు . వైస్రాయ్ క్యాంపు నుంచి ప్రతి క్షణం రాజగురువుకు సమాచారం ఇచ్చిన కీలక రిపోర్టర్ ను బాబు సీఎంగా కుదురుకున్నాక ఏకంగా విజయనగరం బదిలీ చేశారు . రాజుల కథల్లో ఇలాంటి సంఘటనలు కనిపించేవి కీలక ఆపరేషన్ లో పాల్గొన్న వారు తరువాత కనిపించక పోవడం …
****
దేవుడు దయ్యం , ఉసురు అన్నీ నమ్మకాలే . కొందరు దేవుడు నిజం, దయ్యం అబద్దం అంటారు . అలానే ఉసురు అనేది కూడా మూఢ నమ్మకమే అని దేవుడి మీద ఒట్టేసి చెబుతారు . నమ్మకం అయినా, మూఢ నమ్మకం అయినా ఎన్టీఆర్ కుటుంబంలోని వారు, పార్టీలో కీలక నేతలు మరణించినప్పుడల్లా , ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే మాట వినిపించింది …
Share this Article