Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హేమిటీ… అంతటి పరిటాలను బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడా… ఎవరాయన..?

May 30, 2023 by M S R

Murali Buddha…….   ఒక్క చెంప దెబ్బతో అతని దశ తిరిగింది … ఇద్దరి సీఎం  అభిమానం పొందారు … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -…

జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానంలో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు. వన భోజనాలు, సమావేశాల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది . అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ?

ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను అధికారి చెంపదెబ్బ కొట్టడమా ?

Ads

ఔను, చెంపదెబ్బ కొట్టడం … అందులోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు …
ఇద్దరు సీఎంలు ఆదరించారా ? ఔను, చంద్రబాబు , వై యస్ జగన్ మోహన్ రెడ్డి …
ఒకేసారి కాదు ఒకరి తరువాత ఒకరు చాలా అభిమానం చూపించారు .

95 ఆగస్టులో ఎన్టీఆర్ చైతన్య రథంపై పార్వతితో కలిసి వైస్రాయ్ హోటల్ కు వచ్చారు . లోపలికి వెళ్లి తమ్ముళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు . కనిపిస్తే చాలు కాళ్ల మీద పడి పోతారు, ఉపన్యాసం ఇస్తే కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతారు అనుకొని ఉండ వచ్చు బహుశా. కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ లా కళాకారులు కాదు .

ఎన్టీఆర్ తన వాహనంతో పాటు వైస్రాయ్ లోకి రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు . ఇంద్రారెడ్డి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొని తోసేశారు . నేను ఇంకా హోం మంత్రినే అని ఇంద్రారెడ్డి పోలీసులకు చెబుతున్నాడు . అక్కడ ముఖ్యమంత్రినే ఆపేశారు , హోం మంత్రి ఓ లెక్కనా అని అంత ఉద్రిక్త పరిస్థితిలోనూ నవ్వు వచ్చింది .

అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పరిటాల రవి గేటు తోసుకొని లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు . అక్కడ ఉన్న పోలీసు అధికారి ఇక్భాల్ పరిటాల రవిని చెంపదెబ్బ కొట్టి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు . ప్రభుత్వం పడిపోయిన కీలక సంఘటనలో ఇది భాగమే కానీ ప్రత్యేక వార్తగా నిలువ లేదు . మొత్తం వార్తలో ఓ వాక్యంగా మాత్రమే కవర్ అయింది .

అనంతరం చంద్రబాబు సీఎంగా కుదురుకున్న తరువాత ఇక్బాల్ ను తన సెక్యూరిటీ అధికారిగా నియమించారు . చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి ఇక్బాల్ దశ తిరిగింది . బాబు ది యూస్ అండ్ త్రో పాలసీ వాడుకుని వదిలేస్తారు అంటారు కానీ కీలక సమయంలో తనకు అండగా నిలిచిన అధికారులు , మీడియా, వామపక్షాల నాయకుల సహాయం ఉంచుకోలేదు . సహాయానికి మించిన మేలు చేశారు .

ఇక్బాల్ కు ప్రమోషన్ కూడా వచ్చింది . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు … ఆ తరువాత పరిణామాలు , లోపలి వ్యవహారాలు తెలియవు కానీ రాష్ట్ర విభజన తరువాత ఇక్బాల్ హఠాత్తుగా ysr కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . జగన్ అతనికి శాసన మండలి సభ్యత్వం కల్పించారు .

ఒక గృహిణిగా ఉన్న రేణుకా చౌదరి నాదెండ్లపై చెప్పు విసిరి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లారు . చెప్పుతో కార్పొరేటర్ టికెట్ వచ్చింది . ప్రచారంలో అప్పటి కాంగ్రెస్ మాస్ లీడర్ పిజెఆర్ ముందు కారు బానెట్ ఎక్కి, తొడ కొడుతూ, రారా దమ్ముంటే అని సవాల్ చేసి రాజకీయాల్లో ఎక్కడికో వెళ్లారు .

ఈ స్ఫూర్తితో గత ఏడాది మహానాడులో ఒకరిద్దరు మహిళలు మైకు ముందు తొడగొట్టి సవాల్ చేస్తూ ప్రసంగాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు . ఒక్కో సీజన్ లో ఒకరిద్దరే ఒక్క చర్యతో పాపులర్ అవుతారు . తొడగొట్టే టెక్నిక్ అన్ని సార్లు ఫలితం చూపదేమో … ఇక ఇక్బాల్ కు చెంప దెబ్బతో దశ తిరిగింది . ఆ రోజు అలా చేసి ఉండకపోతే అందరు పోలీసుల్లా వయసు రాగానే రిటైర్ అయి పెన్షన్ తో కాలక్షేపం చేసేవారు . దెబ్బతో బాబు దృష్టిలో పడి, తరువాత కాలం కలిసొచ్చి జగన్ దృష్టిలోనూ పడ్డారు . ఏమో… ఏదో ఓ రోజు మంత్రి కూడా కావచ్చు ….

పరిటాలను తొలిసారి హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో చూశా . నలుగురైదుగురు రిపోర్టర్లం ఆయనతో మాట్లాడుతుంటే… రెండంచెలుగా మా చుట్టూ లుంగీ బ్యాచ్ ఉంది . ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటాం, మీరేంటి అంటుకొని నిలబడతారు అని చిరాగ్గా అన్నా సరే, తరువాత తెలిసింది సదరు లుంగీ బ్యాచ్ పరిటాల ప్రైవేటు సెక్యూరిటీ అని …

చివరి వరకు ఎన్టీఆర్ తో ఉన్నారు . ఎన్టీఆర్ ను దించేశాక ఓ రోజు బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసంలో అరుగు మీద మాటా ముచ్చట . ఈనాడు రిపోర్టర్ కనిపించగానే మీ రామోజీ సంగతి , ఈనాడు సంగతి చెబుతా అని పరిటాల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు . నేనూ విన్నాను .. ఓ చిన్న పత్రికలో ఈ వార్త వచ్చింది కూడా .

2004 లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ఓసారి అసెంబ్లీ ఆవరణలో పరిటాల కనిపిస్తే ఇది బైఎలక్షన్ కేసే అని గుంపులో ఒకరు అనడం వినిపించింది . తన ప్రాణాలకు ముప్పు ఉందని పరిటాల కూడా గ్రహించారు . అనంతపురంలో జరిగిన టీడీపీ సమావేశంలోనే మొద్దు శీను పరిటాలను హతమార్చారు .! బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అని టీవీ 9 ఇంటర్వ్యూలో మొద్దు శీను చెప్పిన డైలాగు ఆ రోజుల్లో పూరి జగన్నాద్ పోకిరి సినిమా డైలాగును మించి పాపులర్ అయింది . కొన్ని సినిమాల్లో మొద్దు శీను డైలాగులను కూడా ఉపయోగించుకున్నారు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions