అల్లు వారబ్బాయి, అర్జున్ అలియాస్ బన్నీ… సినిమా విలేకరులు, అభిమానులు రాసుకునే పేరు స్టయిలిష్ స్టార్… ప్రస్తుతం తెలుగులో టాప్ ఫైవ్ స్టార్లలో ఓ స్టార్… కేరళలోనూ బాక్సాఫీసుల్ని దున్నేసే స్టార్… పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న స్టార్… అల్లు వారి సొంత మెగా స్టార్… కదిలితే వార్త, కనిపిస్తే వార్త… అక్కడెక్కడో రోడ్డు పక్కన ఆగి టిఫినీ చేస్తే పుంఖానుపుంఖాల వార్తలు, ఫోటోలు, వీడియోలు, ప్రశంసలు, చప్పట్లు… అదీ బన్నీ… కానీ తాను బతుకుతున్న ఇండస్ట్రీ వ్యవహారాలైనా తనకు తెలుసా..? సమాజం గురించో, ఫ్యానిజం దుర్లక్షణాలేమిటో, ఇంకా అనేకానేక అంశాల్లో ఏం తెలుసనేది పక్కన పెడితే, కనీసం తమ చుట్టూ, తన సినిమా లోకంలోని వర్తమాన సమస్యల గురించైనా తెలుసా..? స్టెప్పులు కాదు, ప్రభుత్వం వేసే స్టెప్పులు తెలుసా..? ఈ డౌట్ ఎందుకొచ్చిందీ అంటే..?
ఈనాడులో స్టార్ సారు గారిది ఓ ఇంటర్వ్యూ వచ్చింది… బోలెడు విషయాలు చెప్పుకొచ్చాడు… సరే, సినిమా వాళ్ల ఇంటర్వ్యూల గురించి తెలుసు కదా, దాన్నలా వదిలేద్దాం కాసేపు… పుష్ప అనబడే సినిమా మొదటి భాగం ముచ్చట్లు ప్రధానంగా వీళ్లేదో అడిగారు, ఆయనేదో చెప్పాడు… కానీ అందులో ఒక ప్రశ్న, బన్నీ జవాబు అత్యంత విస్మయాన్ని కలిగించింది… బన్నీ ప్రాపంచిక జ్ఞాన ప్రకాశం మీద ఒకింత డౌటనుమానమూ తలెత్తింది… సదరు విలేకరి ఏం అడిగాడంటే..? ‘‘ఏపీలో సినిమా టికెట్ ధరలపై కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది, ఇది మీకు కలిసొచ్చే విషయం కదా..?’’ ఇదీ ప్రశ్న…
Ads
దానికి ఈ అల్లు స్టారుడి జవాబు ఏమిటంటే..? ‘‘ఆ విషయం చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో ప్రభుత్వ సహకారం చాలా ఉంది. పరిశ్రమ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చింది. సమస్యలన్నిటినీ వాళ్ల దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమకి ఇది ఊరటనిచ్చే విషయం. ప్రభుత్వం అనుకోనిదే ఇలాంటి నిర్ణయాలు వెలువడేవి కావు…’’ ఇక మన ఆశ్చర్యాందోళనానుమానం ఏమిటంటే..? నిజంగా బన్నీకి ఈ టికెట్ల ధరల విషయంలో ఏం జరుగుతుందో కనీస మాత్రంగానైనా తెలుసా అసలు..?
జగన్ ప్రభుత్వం టికెట్ల ధరలపై నియంత్రణ విధిస్తూ జీవో జారీ చేసింది, దాంతో ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలను తన చేతుల్లోకి తీసుకుంది… సినిమా ప్రముఖులు కక్కలేక, మింగలేక, గట్టిగా బహిరంగంగా ఏమీ అనలేక నానా తిప్పలూ పడ్డారు… పడుతున్నారు… కొందరు తనను కలిసినా సరే, జగన్ పెద్దగా స్పందించలేదు… డిస్ట్రిబ్యూటర్లో, ఎగ్జిబిటర్లో, నిర్మాతలో ఎవరైతేనేం కోర్టుకు వెళ్లారు, కోర్టు ఆ జీవోను కొట్టేసింది… ఇందులో పరిశ్రమ చేసిందేముంది..? పైగా ప్రభుత్వ సహకారం ఏముంది..? పైగా ప్రభుత్వం అనుకోనిదే ఇలాంటి నిర్ణయాలు వెలువడవట…
హెలో సార్, ఏ లోకంలో ఉన్నారు సార్ తమరు..? జగన్ ప్రభుత్వం ఈరోజుకూ తన నిర్ణయానికే కట్టుబడి ఉంది… డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేసింది… మరి తమరికి తెలిసిందేమిటి..? చెప్పిందేమిటి..? పోనీ, తెలియనప్పుడు, ఇలాంటివన్నీ నాన్నే చూసుకుంటాడు అనే క్లారిటీ ఉన్నప్పుడు, ఇంటర్వ్యూలో ఏమీ చెప్పకుండా ఊరుకోవచ్చు కదా… ఈ జ్ఞానబోధ మాకేల సామీ, ఓ సామీ…? ద్యా-వుడా..!!
Share this Article