Ashok Vemulapalli…….. “ధర్డ్ డిగ్రీ” (“నా”నీ” గుెండెల్లో మంటలు) వందమంది ధోషులు తప్పించుకున్నా..పర్వాలేదు గానీ ఒక్క నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదు.. చాలామంది న్యాయవాదుల నోటి నుంచి వచ్చే మాట ఇది.. చాలా సినిమాల్లో ఈ మాట వింటూ ఉంటాం.. ఇది నిజమేనా..ఇది నిజంగా భారత న్యాయశాస్త్రంలో ఉందో లేదో నాకు తెలీదు..కానీ వైజాగ్ హార్బర్ లో బోట్లు తగలబడిన కేసులో లోకల్ బాయ్ నానీ విషయంలో జరిగింది ఏంటి.. వాదోపవాదాలు ముగిసి న్యాయమూర్తి వేసే శిక్ష కంటే దారుణమైన శిక్ష లోకల్ బాయ్ నానీకి పడింది..సొసైటీలో ఉన్న అన్ని వ్యవస్థలు అతన్ని ధోషిని చేశాయి..అతడే బోట్లు తగలబెట్టాడంటూ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు తీర్పులు ఇచ్చేశాయి..
బోట్లు తగలబెట్టిన ఘటనలో నాకెలాంటి సంబంధం లేదు.నా భార్యకు ఎనిమిదోనెల.. ఆమెకు శీమంతం చేశాను..ఈ ఘటన జరిగిన రోజు ( నవంబర్19) రాత్రి నేను నా స్నేహితులకు ఒక హోటల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. ప్రమాదం జరిగిన తర్వాత ఫోన్ వచ్చింది..అప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాను. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది..నేను బోట్లు కాపాడాను గానీ బోట్లు తగలబెట్టలేదు.అయినా సరే పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మూడురోజుల పాటు పోలీ స్టేషన్ లో దారుణంగా కొట్టారు.నేనే బోట్లు తగలబెట్టానన్నారు. ఇది…వైజాగ్ లోకల్ బాయ్ నాని కన్నీటి వేదన.. అసలు సముద్రంమీద బతికే నేను మా అందరికీ అన్నం పెట్టే బోట్లని ఎందుకు తగలబెడతాను అని అతను ఆవేదనగా ప్రశ్నిస్తుంటే అతనికి సమాధానం చెప్పేవారే లేరు..
ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక అమాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకూడదు. భారతీయ న్యాయవ్యవస్థలో, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ అనే హక్కు ఉంది. ఈ హక్కును భారత రాజ్యాంగం యొక్క 19వ ఆర్టికల్ రక్షిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం, ఎవరినీ చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా నిర్బంధించకూడదు.
Ads
అందువల్ల, పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటే, ఆ వ్యక్తిపై ఏదైనా నేరం జరిగినట్లు ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలు నేర దర్యాప్తు ఫైల్‌లో ఉండాలి. పోలీసులు ఈ ఆధారాలను ప్రాసిక్యూటర్‌కు అందించాలి. ప్రాసిక్యూటర్ ఆ ఆధారాలను తనిఖీ చేసి, వాటి ఆధారంగా నేరం జరిగిందని భావిస్తే, ఆ వ్యక్తిపై నేరం మోపడానికి అనుమతి ఇస్తారు.అయితే, పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి హింసాత్మకంగా ప్రవర్తిస్తే, లేదా ఒక వ్యక్తి పారిపోయే ప్రమాదం ఉంటే, పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు. అయితే, ఈ సందర్భాల్లో కూడా, పోలీసులు ఆ వ్యక్తిని త్వరగానే కోర్టులో హాజరుపరచాలి.
కానీ లోకల్ బాయ్ నానిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. కేవలం అనుమానం మాత్రమే.. ఎవరో చెప్పారని ఒక మత్స్యకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మూడురోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచారు పైగా తనను పోలీసులు దారుణంగా హింసించారని బాధితుడు చెబుతున్నాడు.చివరికి అతని భార్య తన భర్త ఎక్కడ..అని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది.. ఏదైనా కేసులో ఫలానా వారి పాత్ర ఉందనిపిస్తే లేదా అనుమానం వస్తే కచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించవచ్చు. అది కూడా నోటీసు ఇచ్చి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించవచ్చు..కానీ ఇలా చేయని తప్పుకు.. ఎలాంటి సంబంధం లేకపోయినా..పోలీసులు అతన్ని మూడురోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచడం కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనే..
ఎవరినైనా సరే విచారించే హక్కు తమకుందని పోలీసులు అనొచ్చు..కానీ సమాజంలో జీవించే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి మనిషికి భారత రాజ్యాంగం ఇచ్చింది.. ఈ హక్కును హరిస్తూ ఒక వ్యక్తిని అకారణంగా పోలీస్ స్టేషన్లో అన్ని రోజులు ఉంచొచ్చా..అనేది అసలు ప్రశ్న..ఆఖరికి తప్పు చేసిన నిందితుడిని కూడా 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చాలని రాజ్యాంగం చెబుతోంది..అలాంటప్పుడు మూడురోజుల పాటు లోకల్ బాయ్ నానీని పోలీస్ స్టేషన్లో ఉంచడం సరైన పద్దతేనా అన్నది పోలీసులు ఆలోచించాలి.. చివరికి అతనికి ఈ బోటు ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్వయానా సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.. అతని తప్పేం లేదని పోలీస్ స్టేషన్ నుంచి పంపేశారు సరే.. మరి మూడురోజులు పాటు అతన్ని హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవద్దా.. ?? దీనిపై రాష్ట్ర డీజీపీ, వైజాగ్ సీపీ , పోలీస్ అధికారుల సంఘం, హోంమంత్రి కచ్చితంగా సీరియస్ గా ఆలోచించాలి..
మరోవైపు …ఈఘటనపై పూర్వాపరాలు తెలీకుండానే లోకల్ బాయ్ నానీనే బోట్లు తగలబెట్టాడంటూ అటు ప్రింట్ మీడియా,ఇటు ఎలక్ట్రానిక్ మీడియా , యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు ఇష్టమొచ్చినట్టు రాసేశాయి..లోకల్ బాయ్ నానీ మీ పార్టీ వాడంటే మీపార్టీ వాడంటూ పొలిటికల్ పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోశాయి..హార్బర్ లో బోట్లో స్నేహితులకు పార్టీ ఇచ్చాడని తాగిన మైకంలో బోట్లు తగలబెట్టాడని ఒకరు, యూట్యూబ్ ఛానెల్లో వ్యూస్ కోసం బోట్లు తగలబెట్టాడని ఇంకొకరు ఇలా పోటీలు పడి ధంబ్ నెయిల్స్ పెట్టి కథనాలు వండి వార్చేశారు..ఒక జర్నలిస్టుగా ఇవన్నీ చదివి నేను కూడా ఇది నిజమే అనుకున్నాను.. అలాగే జనాలు నమ్మేశారు.ఆఖరికి అతని తో నిన్నామొన్నటి వరకూ కలిసి తిరిగిన వాళ్లు కూడా ఇది నిజమేనేమో ..అనుకునేంతగా మూడురోజుల పాటు అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఊదరగొట్టేశారు.. అయ్యో.. వందకోట్ల విలువ చేసే బోట్లు తగలబెట్టేశాడా..అది కూడా యూట్యూబ్ లో వీడియోల కోసం ఇంత ఘాతుకానికి పాల్పడతారా..అని నేను కూడా అనుకున్నాను. నిత్యం వార్తలు అందించే నాలాంటి జర్నలిస్ట్ కూడా ఇది నిజమని నమ్మాను..అలాగే సొసైటీ మొత్తం నమ్మేసింది.. కానీ చివరికి ఏం జరిగింది?
ఒక మత్స్యకార సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాని.. లోకల్ బాయ్ నానీ అనేంతగా..అందరూ గుర్తు పట్టే స్థాయికి తన కష్టంతో తెలివితేటలతో వచ్చాడు.. సముద్రంలోకి అందరు జాలర్ల మాదిరిగానే వెళ్లి చేపలు పట్టుకునే నాని.. కాస్తం డిఫరెంట్ గా ఆలోచించి లైఫ్ లో సక్సెస్ అయ్యాడు.. సముద్రంలో దొరికే చేపల్లో ఉండే రకాలు..వేట ఎలా సాగుతుంది..రోజుల తరబడి కుటుంబానికి దూరంగా సముద్రం మధ్యలో మత్స్యకారులు ఎలా సముద్రంలో గడుపుతారు..చేపల వేటలో పడే కష్టాలేంటి.. సముద్రంలో బోటులోనే చేపల కూర ఎలా వండుకుంటారు లాంటి వన్నీ చక్కగా వివరిస్తూ తన సెల్ ఫోన్ తో వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేసి సెలబ్రిటి అయిపోయాడు. మత్స్యకార సమాజం అంతా గర్వపడే స్థాయికి చేరుకున్నాడు..
తనకు అన్నం పెట్టిన బోటు..తనకు గుర్తింపు తెచ్చిన బోట్లను ఎవరో తగలబెడితే ఆ నేరం తనపైనే వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొడతారని., సమాజం అంతా తననే నిందితుడిగా ముద్ర వేస్తుందని అతను కల్లో కూడా ఊహించి ఉండడు.. ఒక కాకి ఛస్తే వందకాకులు వస్తాయి..అరుస్తూ గోల పెడతాయి..కానీ ఒక యూట్యూబర్ కి అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం ప్రశ్నించడం మానేసి..అతనిపైనే నేరారోపణ చేసి విపరీతమైన ధంబ్ నెయిల్స్ తోసమాజం ముందు అతడినే దోషిని చేసే తద్వారా వచ్చే వ్యూస్ కోసం పాకులాడాయి తప్ప …అయ్యో పాపం అనలేదు.. బ్రేకింగ్ న్యూస్ కోసం పడే ఆరాటం,. తాపత్రయంలో ఎలక్ట్రానికి మీడియా కనీస జాలి చూపలేదు…
పోలీస్ విచారణలో తాను బోట్లు తగలబడిన సమయానికి ఫలానా హోటల్లో ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చానని నాని ఇచ్చిన స్టేట్మెంట్ తో పోలీసుసులు హోటల్ కి వెళ్లి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది..అతను హోటల్ లోపలికి వెళ్లి, రాత్రి బయటకు వస్తున్న దృశ్యాలు టైమ్ తో సహా రికార్డ్ అయి ఉంది.. ఆ తర్వాత పోలీసు విచారణలో అసలు నిందితులు ఇద్దరూ మరో సీసీ ఫుటేజ్ లో బయటపడడడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.. తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన హోటల్లో సీసీకెమేరాలు లేకపోయి ఉంటే..ఆ కెమేరాల్లో పొరబాటున నాని రాకపోకల దృశ్యాలు రికార్డ్ కాకపోయి ఉంటే..పరిస్థితి ఏంటి.? అసలు నిందితులు దొరక్కపోయి ఉంటే బహుశా…ఇప్పటికీ నాని పోలీసుల అదుపులోనే ఉండేవాడేమో.. అతను నిందితుడు కాదు..అమాయకుడని బయటి ప్రపంచానికి తెలిసి ఉండేది కాదేమో..
నిజం నిద్ర లేచి గుమ్మం దాటే లోపు అబద్దం ఊర్లో వీధులన్నీ తిరిగొచ్చేస్తుందంటారు..అలాగే లోకల్ బాయ్ నాని విషయంలో..అసలు నిజం తెలిసేలోపు అతనే దోషి అంటూ అబద్దం పుకార్లు,మీడియా రూపంలో దేశం మొత్తం చెప్పేసింది.. పైగా మూడురోజలు పాటు పోలీస్ స్టేషన్లో నరకయాతన.పైగా చిత్రహింసలు అతనికి అదనపు బోనస్..అమాయకుడిని మూడురోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి హింసించడం ఎంతటి తప్పో.. అసలు విషయం తెలుసుకోకుండా ఒక వ్యక్తిపై నేరస్తుడని ముద్రేసి రకరకాల ఊహాజనిత కథనాలు రాసేయడం,ప్రసారం చేయడం మీడియా తప్పు.
ప్రింట్ మీడియా చాలా వరకూ ఫర్వాలేదు..సాయంత్రం వరకూ సమాచారం సేకరించి..రాత్రి వార్తలు రాస్తే అర్థరాత్రి ప్రింటయి ఉదయానికి పేపర్ వస్తుంది..కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో సెకన్లలోనే ప్రసారమైపోతుంది.. అందులోనూ ఇప్పుడు పెరిగిన ఈ కాంపిటీషన్లో కనీసం క్రాస్ చెక్ కూడా చేయకుండానే.. వెరిఫై చేసుకోకుండా..వివరణ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యక్తుల జీవితాల మీద తప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇష్టమొచ్చినట్టు వేసేస్తున్నారు. దీనివల్ల చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయి..వారికి మానసిక వేదన మిగులుతోంది.
యూట్యూబ్ లో ఆదాయం కోసం.. వ్యూస్ కోసం పెట్టే ధంబ్ నెయిల్స్ తోచాలామంది జీవితాలే తారుమారువుతున్నాయి.. ఇందులో తప్పుడు వార్తలు వేసిన ప్రతి జర్నలిస్టూ, ప్రతి సంస్థా బాధ్యత వహించాల్సిందే.. చాలామంది ఇలా మీడియావల్ల పరువుపోగొట్టుకున్న బాధితులు ఏం చేయాలో తెలీక సర్దుకుపోతున్నారు.. మరికొంతమంది ఇప్పుడిప్పుడే క్రమినల్ డిఫమేషన్ కేసులు వేస్తున్నారు..ఇలాంటి వార్తల వల్లే మీడియా క్రెడిబిలిటీ పోయి..జనాలు మీడియాను అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ నేను మొత్తం జర్నలిస్ట్ సమాజాన్ని మీడియాలో ఉన్న అన్ని ఛానెళ్లు,యూట్యూబ్ ఛానెళ్ల గురించి తప్పుబట్టడం లేదు.. కేవలం లోకల్ బాయ్ నాని విషయంలో తప్పుడు వార్తలు రాసిన ప్రసారం చేసిన వారి గురించి మాత్రమే… ఒక మీడియా ప్రతినిధిగా నేను నిజంగా సిగ్గుపడుతున్నాను..జర్నలిజంలో ఉంటూ జర్నలిస్టుగా… ఒక అమాయకుడికి జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించలేని అసమర్థతతో నాకొచ్చిన నాలుగు అక్షరాల్లో నా ఆవేదనని ఇక్కడ రాస్తున్నాను..
Share this Article