బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు తీసుకుని దివాలా తీశామని ఎగ్గొట్టడం సులభం. పెట్టే బేడా సర్దుకుని లండన్లో స్థిరపడి సెలెబ్రిటీల పునరపి పెళ్లి...పునరపి రిసిప్షన్లలో మందు గ్లాసులు పట్టుకుని చిరునవ్వులు చిందించడం సులభం. వెయ్యి కోట్లు అప్పు తీసుకుని రెండొందల కోట్లు కట్టి…ఎనిమిదొందల కోట్లు ఉద్దేశపూర్వకంగా కట్టకుండా పరపతి ఉపయోగించి వన్ టైమ్ సెటిల్మెంట్లో రెండొందల కోట్లు మాత్రమే కట్టి దర్జాగా ఆరొందల కోట్లు ఎగ్గొట్టడం కూడా సులభమే. పాతిక వేల కోట్లు అప్పులు తీసుకుని…ఎగ్గొట్టి రాజకీయ పార్టీలో చేరి…దేశ ఆర్థిక ప్రగతికి ఏమి చేస్తే బాగుంటుందో ఆర్థిక శాఖా మంత్రికి సలహాలివ్వడం ఇంకా సులభం. పదివేల కోట్లు అప్పు తీసుకుని కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి మళ్లించి…వ్యాపారంలో నష్టమొచ్చిందంటూ నిజాయితీగా ఒప్పుకుని జైలుకెళ్లి…కుటుంబాన్ని కాపాడడం కూడా కొంతలో కొంత సులభమే.
కానీ…ఒక ఆర్ టీ సీ బస్సును దొంగిలించి…నడిపి…ఆ బస్సెక్కిన ప్రయాణికుల దగ్గరి నుండి వసూలు చేసిన టికెట్ చార్జీలతో పరార్ కావాలనుకోవడం మాత్రం చాలా సాహసం. అనేక వ్యయప్రయాసలతో కూడుకున్న దుస్సాహసం.
Ads
ఆర్ టీ సి సొంత వాహనాలతో పాటు అద్దెకు తీసుకున్న బస్సులను కూడా తన రూట్లలో నడుపుకుంటూ ఉంటుంది. అలా సిద్దిపేట ఆర్ టీ సి డిపోలో ఒక అద్దె బస్సును పార్క్ చేసి తాళాలు డిపో మేనేజర్ దగ్గర ఎప్పటిలా పెట్టి వెళ్ళాడు డ్రయివర్. సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక దొంగ ఆ తాళాలను తీసుకుని బస్సులో డీజిల్ ఉన్నంతవరకు- దాదాపు 250 కిలో మీటర్లు నడుపుకుంటూ టికెట్ ఇవ్వకుండా ప్రయాణికుల నుండి చార్జీలు వసూలు చేస్తూ తిప్పాడు. డీజిల్ అయిపోయి ఆగిన చోట బస్సును వదిలేసి పరారయ్యాడు. అద్దె బస్సు యజమాని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
అతడిది అక్షరాలా తప్పే కావచ్చు. అతడిది శిక్షార్హమయిన నేరమే కావచ్చు. ఒక బస్సును దొంగిలించి…పట్ట పగలు పబ్లిక్ రహదారుల మీద నడుపుతూ వెయ్యో, రెండు వేలో కొల్లగొట్టవచ్చు అని అనుకున్న అతడి చోర ప్రణాళికలో చాలా లోపాలున్నాయి. అజ్ఞానం ఉంది. అమాయకత్వం ఉంది.
పాపం…అతడికి డ్రయివింగ్ తప్ప ఇంకేమీ తెలిసినట్లు లేదు. మంచి డ్రయివర్ ఉద్యోగం వచ్చి ఉంటే…బస్సును దొంగిలించి ఉండేవాడు కాదేమో! ఏమో!
వెనుకటికి ఇలాగే ఆర్ టీ సీ బస్సును దొంగిలించి పార్ట్ పార్ట్ లుగా అమ్ముకున్న కథనాన్ని కూడా గుర్తు చేసుకుందాం.
వెల్లుల్లి తిని వాసన దాచగలరా? అని ఒక సామెత. అయితే బస్సును తిని జీర్ణించుకోగలం, వాసన పసికట్టకుండా దాచగలం – అని చెప్పడానికి ప్రయత్నించారు చోరశిఖామణులు.
అసలు బస్సు పోయిందన్నప్పటినుండి నాకు ఈ వార్త మీద చాలా ఉత్సాహంగా ఉంది వివరాలు తెలుసుకోవాలని. బస్సు చిన్నా చితకా వస్తువా? సంచిలో పెట్టుకుని వెళ్ళడానికి ? బస్సంటే బస్సంత పెద్దది. పైగా దాన్ని తాళం చెవి లేకుండా తెరవాలి. స్టార్ట్ చేయాలి. కొండంత బస్సును నడపాలి. దారిపొడుగునా సీ సీ టీ వీ కెమెరాలు దాటి గమ్యం చేరాలి. ఒక్క ఆనవాలు లేకుండా క్షణాల్లో ముక్కలు ముక్కలు చేయాలి. వెనువెంటనే తుక్కు తుక్కుగా అమ్మాలి. ఇంతా చేస్తే మిగిలే లక్షరూపాయలతో బిర్యానీ తిని, చుక్క ద్రవం గొంతులో పోసుకుని గౌలిగూడ బస్ స్టాండ్ పక్కన మురికి మూసీ ఒడ్డున లోకాన్ని మరచి హాయిగా నిద్రపోవాలి. ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టగల అధునాతన పోలీసులగురించి దొంగలు సరిగ్గా అంచనా వేయలేకపోయారు.
అయినా ఎవరయినా నగా నట్రా దొంగతనం చేస్తారు. అది యుగధర్మం. మనమూ, పోలీసులు కూడా దాన్ని సరే అంటాం. బస్సును దొంగతనం చేయడానికి చాలా తెగింపు, అంతకుమించిన అమాయకత్వం ఉండాలి. అయినా తొమ్మిదివేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో ఈము పక్షి కోటు (ప్రపంచంలో అత్యంత విలువయినదట – ఇక మొసలి చర్మం కోటు ఎంత ఉంటుందో ?) వేసుకుని హాయిగా చిల్ అయ్యే నీరవ్ లు, మాల్యాలు; పదివేల కోట్లు ఎగ్గొట్టి కేంద్రమంత్రిగా జాతికి హితోపదేశాలు చేయగల ఉత్తమ సంస్కారులు వీధికొకరు ఆదర్శంగా ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక లక్ష కోసం అన్నదమ్ములు, వారికి తోడు మరో ఆరుగురు మొత్తం ఎనిమిది మంది బస్సును దొంగిలించడం కేవలం వారి అజ్ఞానం.
అంటే వారిని సానుభూతితో వెళ్ళండి బాబూ ! వెళ్లి ఇదే స్ఫూర్తితో కాచిగూడలో రైలు, శంషాబాద్ లో విమానాన్ని దొంగిలించి అమ్మి బిర్యానీ పొట్లం కొనుక్కు తినండి – అని పోలీసులు ప్రాధేయపడాలని కాదు నా ఉద్దేశం.
అంతటి బస్సును, అంతదూరం తీసుకెళ్లి నామరూపాల్లేకుండా చేసి ఎలా జీర్ణం చేసుకోగలమనుకున్నారో నాకు ఇంకా అంతుపట్టడం లేదు. మూడొంతుల బస్సును మింగేయగా మిగిలిన అవశేషాలతో దొంగలను పట్టుకున్న పోలీసులను అభినందించాలి. లేకపోతే మరీ ఎగతాళిగా మిగిలిపోయేది ఈ కథ…. -పమిడికాల్వ మధుసూదన్, madhupamidikalva@gmail.com
Share this Article