బుట్టబొమ్మ… ఈ సినిమా ఎలా ఉందనే విశ్లేషణలకు ముందు… నిర్మాత సాయిసౌజన్య అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్యకు ఒక అభినందన… సినిమా లవ్ స్టోరీ అయినా, అక్కడక్కడా డర్టీ రొమాన్స్ సీన్లతో గతి తప్పే అవకాశాలున్నా సరే, ఎక్కడా అసభ్యతకు, అశ్లీలానికి తావివ్వలేదు… ప్లెయిన్ అండ్ ఫెయిర్‌గా ఉంది సినిమా… (క్లాసికల్ డాన్సర్ అయిన ఆమె సిరివెన్నెల సీతారామశాస్త్రికి స్వయానా మేనకోడలు…)
ఒకరకంగా త్రివిక్రమ్ సినిమాయే… అందుకే ఈ చిన్న సినిమా మీద రివ్యూయర్ల ఆసక్తి… లేకపోతే దేకకపోయేవాళ్లేమో… ఇది కపేలా సినిమాకు రీమేక్… నిజానికి ఈ సినిమా మలయాళంలో థియేటర్లలో విడుదల కాలేదు… ఓటీటీలో రిలీజైంది… అవును, సినిమా ఓటీటీ సరుకే… థియేటర్లకు రప్పించేంత సీన్ లేదు కూడా… ఐనా మలయాళ ప్రేక్షకుల అభిరుచికీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికీ నడుమ తేడా ఉంది బోలెడు…
ఈ సినిమాను యథాతథంగా తెలుగులో రీమేక్ చేశారు తప్ప పెద్దగా తెలుగీకరణ ప్రయోగాలు ఏమీ లేవు… కొత్తగా ఏ మసాలాలూ చల్లలేదు… దర్శకుడు శౌరి చంద్రశేఖర్ పెద్దగా రిస్క్ తీసుకోలేదు… ఆల్‌రెడీ హిట్ టాక్ ఉన్న సినిమాలో వేలుపెట్టి చెడగొట్టడం దేనికి అనుకున్నాడేమో, కానీ కాస్త ఎక్కువ తెలుగీకరించే ప్రయత్నం చేస్తేనే బాగుండేది… ఆల్‌రెడీ ఓటీటీలో సబ్‌టైటిల్స్‌తో ఉన్న సినిమాను దాదాపు యథాతథంగా తెలుగులో రీమేక్ చేయడం వల్ల ఫాయిదా ఏముంటుంది..?
Ads
నటీనటులు బాగానే చేశారు… కానీ ఎంచుకున్న కథ థిన్ లైన్… దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడి తడబాటు ఉంది… ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం, అందులో ఓ అమ్మాయి, రీల్స్ పిచ్చి, దానికి స్మార్ట్ ఫోన్ కావాలి… అనుకోకుండా ఎవరో రాంగ్ నెంబర్ ద్వారా పరిచయం, అది కాస్తా ప్రణయంగా మారుతుంది… ఈలోపు మరో సంబంధం ఖాయం చేస్తారు తల్లిదండ్రులు… చెప్పాపెట్టకుండా సిటీకి సదరు ఆటో డ్రైవర్ ప్రియుడి కోసం వెళ్లిపోతుంది ఆ అమ్మాయి… మరో పాత్ర ఎంట్రీ… దర్శకుడు అక్కడక్కడా వుమెన్ ట్రాఫికింగ్ సమస్యను టచ్ చేస్తాడు…
ఇటు ఆ సమస్యను డీప్‌గా చర్చించడు… అటు ఓ లవ్ స్టోరీని ప్రధానంగా తీసుకోడు… పైగా ప్రేక్షకుడిని ఆకట్టుకునే సీన్లు తక్కువ… దీంతో షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ అన్నట్టు తయారైంది… ఇలాంటివి ఓటీటీల్లో చల్తా… థియేటర్లకు చెలామణీ ఉండదు… బిర్యానీ కాదు, ఉప్మా… చద్దన్నం… ఎవరెవరో ముక్కూమొహం తెలియని వాళ్లను ఎంచుకోవడంకన్నా తెలుగులో టీవీల్లో, చిన్న సినిమాల్లో నటించే మనవారినే ఈ పాత్రలకు ఎంచుకుంటే బాగుండేది… ఉదాహరణకు నవ్య స్వామి… వాళ్లకు ప్రోత్సాహం ఉండేది…
మలయాళ సినిమాల్లో కథలు, ప్రయోగాలు, వైవిధ్యం ఎక్కువే… నిజమే… కానీ వాళ్ల అభిరుచి మేరకు వాళ్ల సినిమాలు రూపొందుతాయి… ఆ దర్శకులకు వాళ్ల మార్కెట్ ముఖ్యం… అవి అన్నీ మనకు ఎక్కాలని ఏమీలేదు… వాటి మీద పడిపోయి, రీమేకుల రైట్స్ కొనుగోలు చేయడం వరకు ఓకే… కానీ అవి మన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్టవుతాయని ఓసారి ఆలోచించాలి… కపెలా సినిమా విషయంలో అలా జరగనట్టుంది…! ఆ నటీనటులు కూడా మనకు తెలిసిన మొహాలు కాదు పెద్దగా… అందుకని వారి నటనపైనా విశ్లేషణ, సమీక్ష పెద్దగా అవసరమేమీ లేదేమో..!!
Share this Article