.
Chhaava… ఛావా… ఈ వారం రిలీజ్ కాబోయే హిందీ సినిమా మీద విపరీతమైన ప్రచారం సాగుతోంది… బజ్ క్రియేటవుతోంది… చాన్నాళ్లుగా అసలు హిందీ సినిమా పట్టుమని పది రోజులు థియేటర్లలో ఆడిందే లేదు కదా… దీని మీద మాత్రం కాస్త ఆసక్తి నిర్మితమవుతోంది… కారణం…
అది ఛత్రపతి శంభాజీ మహారాజ్ మీద తీస్తున్న సినిమా… తను మరాఠా చక్రవర్తి… శివాజీ కొడుకు… సో, హిందీ బెల్టులో ఆదరణను ఆశిస్తోంది సినిమా టీం… శివాజీ సావంత్ రాసిన ఛావా అనే నవల ఆధారంగా సినిమా కథను రాసుకున్నారు…
Ads
లక్ష్మణ్ ఉటేకర్ దీనికి దర్శకుడు… హిందీ, మరాఠీ సినిమాలు తీశాడు, సినిమాటోగ్రాఫర్ కూడా… పెద్ద సూపర్ హిట్ సినిమాలు ఏమీ లేవు కానీ… ఆకర్షిస్తున్నది విక్కీ కౌశల్ శంభాజీ పాత్ర పోషించడం, నేషనల్ క్రష్‌గా బాగా పాపులర్ అయిపోయిన రష్మిక మంథాన కథానాయిక…
ఏఆర్ రెహమాన్ సంగీతం, తను స్వయంగా ఓ పాట పాడాడు కూడా… ఇలా దీనిపై ఆసక్తి ఏర్పడుతోంది… విక్కీ కౌశల్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్‌తో వెలుగులోకి వచ్చినా తనకు ఉరి, రాజీ, సర్దార్ ఉధమ్ తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చాయి… ఇక శామ్ బహదూర్ సినిమాలో ఆ పాత్రలోకి దూరిపోయాడు అక్షరాలా… దాంతో అభిమానులను పెంచుకున్నాడు…
అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్ర చేశాడు… రష్మిక సరేసరి… పుష్ప, యానిమల్ సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోయింది… సరే, నటీనటులు బాగా కుదిరితే సినిమా హిట్ కావాలని ఏమీ లేదు కానీ… ఈ కథ కొంచెం ఇంట్రస్టింగు… అందరికీ శివాజీ కథ తెలుసు… తన మీద బోలెడు సాహిత్యం, నాటకాలు, కళారూపాలు… కానీ తన కొడుకు శంభాజీ కథ దేశంలోని ఇతర ప్రాంతాల్లోని చాలామందికి తెలియదు…
ఆ ఫ్యాక్టరే ఈ సినిమాను జనానికి చేరువ చేస్తుందని అంటున్నాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్… ట్రెయిలర్లు, ఫస్ట్ లుక్కులు గట్రా ఇప్పటికే బాగా వైరలయ్యాయి కూడా… శంభాజీ మీద గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి… క్లిష్టమైన కథ ఇది… శంభాజీ మీద భిన్నమైన కథనాలు ఉన్నాయి…
శంభాజీ పాత్రకు కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉంటాయి… తండ్రే తనను భరించలేక ఓ కోటలో బందీగా ఉంచుతాడు కొన్నాళ్లు… శివాజీ మరణం తరువాత సింహాసనం కోసం వారసత్వ కుట్రలు… ఆరేడేళ్లు మాత్రమే తన అధికారం… ఔరంగజేబు శంభాజీని మతం మార్చుకోవాలని కోరితే, నీ కుమార్తెను నాకిచ్చినా సరే అంగీకరించను అని నిరాకరించాడనీ, అందుకే ఔరంగజేబు తనను ఉరితీయించాడని మరాఠీ కథనాలు…
కానీ తన పాలనలో ముస్లింలపై శంభాజీ బలగాలు సాగించిన దాడులు, దోపిడీలు, హత్యలు, అవమానాలకు శిక్షగా తనను ఔరంగజేబు ఉరితీయించాడని మరికొన్ని కథనాలు… వాటిల్లో ఈ దర్శకుడు ఏ వెర్షన్ తీసుకుని ఎలా ప్రజెంట్ చేశాడనేది ఇంట్రస్టింగు పాయింట్..!! స్వధర్మానికి కట్టుబడి మరణశిక్షను ధైర్యంగా ఆహ్వానించిన ధీరుడిగానా..? ఔరంగజేబుతో ఓడిపోయి తనువు చాలించిన ఓ సైనికుడిగానా..? అప్పటి ఓ సగటు హిందూ రాజుగానా..?!
Share this Article