ఎలా సంపాదించావు అని కాదు, ఎంత సంపాదించావు అనేదే ఇప్పటి లెక్క…! అవే సక్సెస్ స్టోరీలు… అవే ఇన్‌స్పిరేషన్ స్టోరీలు… నిజమే, ప్రస్తుతం ట్రెండ్ పైసామే పరమాత్మ… కానీ ఫెయిల్యూర్ స్టోరీల మాటేమిటి..? అవి కదా మనకు పాఠాలు నేర్పి, మనల్ని మరింత జాగ్రత్తగా మలుసుకునేలా చేసేవి…
ఫలానా వ్యక్తి ప్రపంచ ధనికుల జాబితాలో చేరాడు, ఫోర్బ్స్ జాబితాలో ఫలానా స్థానంలో ఉన్నాడు అని బోలెడు వార్తలు చదువుతున్నాం, రాస్తున్నాం, వింటున్నాం… కానీ గగనానికి ఎగిసి హఠాత్తుగా విరిగిపడిన కెరటాల మాటేమిటి..? అవి మాట్లాడుకోం… బైజూస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ జీవితమూ అంతే…
నో డౌట్, మొన్నమొన్నటివరకూ ఇది లీడింగ్ ఎడ్యుటెక్ కంపెనీ… తను వేగంగా ఎదిగిన తీరు చాలామందికి కన్నుకుట్టేలా కనిపించేది… అంతెందుకు..? సరిగ్గా గత ఏడాది ఇదే టైమ్‌కు తన ఆస్తి విలువ 22 బిలియన్ డాలర్లు… అంటే దాదాపు 17,545 కోట్లు… డెస్టినీ అంటే ఇదే… ప్రస్తుతం దాదాపు జీరో.., కళ్లముందే కరిగిపోయింది అన్ని వేల కోట్ల ఆస్తి…
Ads
ఫోర్బ్స్ గత జాబితాలో ఉన్నాడు తను… ఈసారి లేటెస్టు జాబితాలో లేడు… అప్పులు ఎక్కువైపోయాయి, ప్రస్తుతం తన దగ్గర సంపదేమీ లేదు… అంతేకాదు, జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది… ఒకరకంగా అది దివాలా తీసింది… దానికి అనేక నాటకీయ పరిణామాలు కారణాలు కావచ్చుగాక… పుష్కరం క్రితం కంపెనీ ప్రారంభించినప్పుడు పెద్దగా ఎవరికీ దీని మీద దృష్టి లేదు… కానీ కరోనా సమయంలో ఎప్పుడైతే ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం పెరిగిపోయిందో ఈ కంపెనీ కూడా అలాగే పెరిగిపోయింది…
పెద్ద మొత్తంలో బ్రాంచులు, ట్యూషన్ సెంటర్లను తెరిచింది… ఇలా వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు కూడా విస్తరించింది… వందల కొద్దీ ట్యూషన్ సెంటర్లను కూడా తెరిచారు… ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలు వచ్చాయి… దీంతో మనీలాండరింగ్ కేసు నమోదైంది… బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరిపింది… మరోవైపు అప్పుల భారం ఎక్కువైంది… బిజినెస్ పడిపోయింది… నిధుల సమీకరణ కష్టమైంది… దీంతో ఒక దశలో నిర్వహణే కష్టమైంది…
మరోవైపు ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేదు… పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు… ఉద్యోగుల్ని కూడా పెద్ద మొత్తంలో తీసేసింది… బోర్డు సభ్యులు కూడా వరుసగా రాజీనామాలు చేశారు… బైజూస్ నుంచి రవీంద్రన్‌ను తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి… రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి… ఇలా ఎన్నో సవాళ్ల నడుమ బైజూస్ వాల్యుయేషన్ కూడా ఒకప్పుడు ఘోరంగా పడిపోయింది…
ఇక ఇటీవల పదుల కొద్దీ ట్యూషన్ సెంటర్లను కూడా మూసేసింది బైజూస్… ఇంకా బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా ఆఫీసులన్నింటినీ మూసేసింది… గతేడాది రిచ్చెస్టుల లిస్ట్ నుంచి ఇప్పుడు కేవలం నలుగురు మాత్రమే బిలియనీర్ల జాబితా నుంచి వైదొలిగారని.. వారిలో ఒకరు బైజు రవీంద్రన్ అని ఫోర్బ్స్ ఈ సందర్భంగా వెల్లడించింది… ఈడీ దాడులు గట్రా ఏ ఎలక్టోరల్ బాండ్స్ కొనడం వల్లో తప్పించుకోవచ్చునేమో గానీ… పెరిగిన సంపదను కాపాడుకోవడం, మెయింటెయిన్ చేయడం కూడా ఓ ఆర్ట్ అని బైజూస్ నిరూపిస్తోంది… ఇదే బైజూస్ నేర్పించిన చివరి ఆన్‌లైన్ లెసన్..!!
Share this Article