.
Mohammed Rafee
……… షిరిడిలో మానవత్వం పరిమళించిన శుభవేళ… “మాయమై పోతున్నడమ్మ మడిసన్న వాడు” అనే పాట ఎంత వాస్తవమో, అయినా ఇంకా అక్కడక్కడ మానవీయ చుక్కలు మెరుస్తూనే ఉన్నాయనేది వాస్తవమే! హైదరాబాద్ కు చెందిన రాజు కుటుంబం సాయిబాబా పై భక్తితో షిరిడి వచ్చారు!
షిరిడి రావాలంటే రైలు ప్రయాణీకులు నగర్ సోల్ లో దిగి అక్కడ నుంచి క్యాబ్స్ లేదా సాయిబాబా భక్తి నివాసంకు చెందిన ఉచిత బస్సుల్లో షిరిడి చేరుకుంటారు! అక్కడ నుంచి 50 కిలోమీటర్లు షిరిడి! నేరుగా సాయినగర్ కు కూడా ట్రైన్స్ వస్తాయి కానీ, అవి మన్మాడ్ వెళ్లి సాయినగర్ షిరిడి చేరుకోవడానికి అదనంగా మూడు గంటలు పడుతుంది! అదే నగర్ సోల్ నుంచి 45 నిముషాల్లో షిరిడి చేరుకోవచ్చు! షిరిడి వెళ్లే వారికి ఇది తెలిసిన విషయమే అనుకోండి!
Ads
నగర్ సోల్ లో వ్యాన్లు, కార్లు వందలాది సంఖ్యలో ఉంటాయి! క్యాబ్ డ్రైవర్ల యూనియన్ కూడా వుంది! ఫ్యామిలీ ప్రయాణిస్తే 1200 నుంచి రెండు వేలు తీసుకుంటారు. షేరింగ్ అయితే ఒక్కో సీటుకు 300 తీసుకుంటారు. ట్రైన్ ఆగిన వెంటనే వారి దందా మొదలవుతుంది! ఎక్కువ రేటు చెప్పి నచ్చిన రేటు గిట్టుబాటు అయ్యేంత వరకు బేరాలు ఆడి వెంటపడి విసిగించి మొత్తానికి రోజును నెట్టేస్తుంటారు!
సరే, అసలు విషయానికి వస్తే, అంత గీచి గీచి బేరాలు ఆడి జీవనోపాధి గడుపుతున్న వారిలోనూ మానవీయ కోణం ఉందని చాటుకున్నారు! ఇప్పుడే కాదు, ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారట! అది సాయిబాబా భక్తిలో వారు నేర్చుకున్న పాఠం అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది!
రాజు (పేరు మార్చడం జరిగింది), హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటారు! ఏదో ప్రైవేట్ కంపెనీలో రోజు వారీ కూలీ! అతను భార్య ముగ్గురు కుమార్తెలతో షిరిడి వచ్చాడు! కుమార్తెలు చిన్న పిల్లలు! గురువారం ఉదయం కాచిగూడ మన్మాడ్ ఎక్స్ ప్రెస్ లో నగర్ సోల్ దిగి అక్కడ ఫ్రీ బస్సు ఎక్కాడు!
షిరిడిలో దిగేటప్పుడు తన లగేజ్ తీసుకుని రూమ్ కు వెళ్ళాడు! వెళ్ళాక చూసుకుంటే అతని బ్యాగ్ ఒకటి మిస్ అయ్యింది! వేరే బ్యాగ్ ఒకటి యాడ్ అయ్యింది! వెంటనే బస్సు దగ్గరకు వెళితే బస్సు అక్కడ లేదు!
సెక్యూరిటీ వారికి ఫిర్యాదు చేశాడు! మళ్ళీ నగర్ సోల్ వెళ్లి ఆ బస్సు తిరిగి వచ్చేంత వరకు అక్కడే ఉండి చూసాడు! బస్సు వచ్చింది! ఆ బస్సు లో అతని బ్యాగ్ లేదు! ఇతనికి వచ్చిన బ్యాగ్ గురించి ఆచూకి కోసం ఎవ్వరూ రాలేదు! ఆ బ్యాగులో రెండు జతల బట్టలు ఉన్నాయి! రాజు బ్యాగులో ఆరు వేల రూపాయలు పర్సు, అందులోనే తన ఆధార్ కార్డు నుంచి ఓటరు కార్డు వరకు ఉన్నాయి!
నేను గురువారం షిరిడి వెళ్ళాను! బాబా దర్శనం కోసం గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు పిఆర్వో ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పారు! వెంటనే ఆ దగ్గరలోనే ఉన్న బాబా భక్తి ఆశ్రమంకు వెళ్ళాను! అక్కడ జనం గుమి కూడి ఉన్నారు! మధ్యలో రాజు అతని కుటుంబం! భార్యా భర్తలు ఇద్దరూ కన్నీటి పర్యంతమవుతున్నారు!
ఇక వారి దగ్గర ఒక్క రూపాయి లేదు! ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోవడంతో ఆ మిస్ అయిన బ్యాగులోనే పెట్టాడట! పిల్లలు చూస్తే చిటుకుల్లా రెండేళ్లు ఒకరు, నాలుగేళ్లు ఒకరు, ఐదేళ్లు ఒకరు! ముగ్గురూ అమ్మాయిలే! ఫోన్ పే ఛాన్స్ కూడా లేదు! ఇదే భగవంతుడి లీల! ఆట ఇలాగే ఆడిస్తాడు!
ఇంతలో ఒకతను 300 రూపాయలు ఇచ్చాడు! ముందు టిఫిన్ చేయమని చెప్పాము! ఫ్రెష్ అయ్యాక వారిని గుడి దగ్గరకు పీఆర్వో గదికి తీసుకు రమ్మని చెప్పి నేను వెనక్కి వచ్చేసాను! అర గంట తరువాత వాళ్ళు వచ్చారు! విఐపి ఫ్రీ పాస్ ఇప్పించాను! అందరినీ తీసుకెళ్లి అంత రష్ లోనూ 20 నిముషాల్లో ప్రత్యేక దర్శనం చేయించాను. వారితో పాటు నేనూ!
ఆ రోజు ఆశ్రమంలోనే రెస్ట్ తీసుకోమని చెప్పాను. వారికి తిరుగు ప్రయాణం శుక్రవారం అజంతా ఎక్స్ ప్రెస్! జనరల్ బో్గీ! ఆరు గంటలకు నగర్ సోల్ పంపిద్దామని వ్యాన్ మాట్లాడాను! జరిగిన విషయం చెప్పి 400 ఇస్తాను అందరినీ తీసుకెళ్లి నగర్ సోల్ కు చేర్చు అన్నాను!
ఆ డ్రైవర్ అక్కడే ఉన్న మరో డ్రైవర్ కు చెప్పడంతో క్యాబ్ ఫ్రీగా వారిని చేరుస్తాం, అయితే అక్కడ టిసితో మాట్లాడాలి, టికెట్ మిస్సింగ్ గురించి చెప్పాలి, నన్ను రమ్మన్నారు! సరే, నేను ఖాళీగా వున్నాను, పదండీ అంటూ వారితో నగర్ సోల్ ప్రయాణం!
- రాత్రి 9 గంటలకు ట్రైన్! అక్కడ స్టేషన్ మాస్టర్ తో మాట్లాడాను! ఆయన ఎక్కిద్దాం, ఏర్పాట్లు చేద్దాం అన్నారు! ఈ లోపు కారు డ్రైవర్ల సంఘం నేతలు, డ్రైవర్లు పూల మాలలు తీసుకుని వచ్చారు! వారిద్దరికీ దండలు వేశారు! అప్పటికప్పుడు అందరూ కొంత కొంత వేసుకుని 72 వేలు పోగు చేసి రాజు గారి భార్య సురేఖ చేతిలో పెట్టారు!
ఈ లోపు రైల్వే స్టేషన్ ఎదురుగా బిర్యానీ హోటల్ ఓనర్ వచ్చాడు! రాజు కుటుంబాన్ని తీసుకెళ్లి మంచి విందు భోజనం అందించారు. ట్రైన్ వచ్చాక టిసితో మాట్లాడి మూడు బెర్తులు ఇప్పించి రాజసంగా రాజు కుటుంబానికి వీడ్కోలు పలికారు!
రాజు సురేఖ దంపతులకు మాటలు లేవు! పాపం చేతులు జోడించి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని చూస్తూ ఉండిపోయారు! ఇది నిన్న రాత్రి నగర్ సోల్ లో జరిగిన వేడుక!
నేను తిరిగి షిరిడి బయలు దేరుతూ కాసేపు క్యాబ్ డ్రైవర్ యూనియన్ నేతలతో మాట్లాడాను! వారి జీవితాల్లో ఇలాంటి ఘట్టాలు షరా మామూలేనట! ఇలాంటి ఎన్నో కుటుంబాలకు వారు తోచిన రీతిలో సాయం చేస్తూనే ఉంటారట! ప్రాంతం భాష ఇవేమి పట్టించుకోరట!
నేను ఆ కుటుంబానికి అండగా నిలబడటం, నా మాటలు యూనియన్ నేతలకు స్ఫూర్తి ఇచ్చాయని, అందుకే ఈసారి పెద్ద ఎత్తున సహాయం చేసినట్లు తెలిపారు. నాకూ సంతోషం అనిపించింది! ఫోటోలు తీశారు కానీ, రాజు కుటుంబాన్ని చూపించడం నాకు మంచి అనిపించడం లేదు!
ఇంకో ఆసక్తికర విశేషం ఏమిటంటే, అక్కడ క్యాబ్ డ్రైవర్లు ఆడే “షో” లో ఆట! ఎక్కువ మంది అంటే ఒక కారుకు ఏడుగురు ప్యాసెంజర్లు! ఎవరు ఎక్కువ మందిని క్యాచ్ చేసినా అతని కారు కదలదు! టాస్ వేస్తారు! టాస్ లో ఛాలెంజ్ చేసిన వ్యక్తికి ఇతనికి పోటీ! ఎవరు టాస్ గెలిస్తే సవారీ వారిది! అయితే ఛాలెంజ్ చేసే వ్యక్తి ఎంపిక కూడా ప్యాసెంజర్లను బట్టి ఉంటుంది!
ఇలా ప్రతి రెండు వ్యాన్లకు టాస్ ఉంటుంది! గెలిచిన వాడికే డబ్బులు! విచిత్రంగా ఉంది కదూ! అంతే కాదు, ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఒక్క సవారీ చేయలేక పోయిన వారికి అందరూ కలసి 1500 ఇస్తారు!
అంటే ఏ డ్రైవరూ ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదు! బావుంది కదా ఐక్యత! నాకైతే భలే నచ్చేశారు! యూనియన్ నేతలు రవీంద్ర ఠాక్రె, నితిన్ పాటిల్, రఘురామ్ వాఖండేలకు కృతజ్ఞతలు చెప్పి వచ్చేసాను షిరిడికి! ఆదివారం నా తిరుగు ప్రయాణం! - డా. మహ్మద్ రఫీ
Share this Article