———————
తెలంగాణలో ఏకైక ముదిరాజ్ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి సాగనంపి ఏడాది నిడుతోంది. నల్లగొండ జిల్లా వీరోచిత రెడ్లకు సంపన్న అల్లుడైన రాజేందర్ గారు తనపై టీఆరెస్ సర్కారు నుంచి ‘వేధింపులు’ ఎదురైనప్పుడు తాను ‘రెడ్స్’ దామాద్ అని బెదిరించకుండా ముదిరాజ బిడ్డనని వినమ్రంగా విలేఖరులకు చెప్పారు. ముదిమి, బలిమి గల మరో ముదిరాజ్ చట్టసభ సభ్యుడు పార్టీలో లేకపోవడం వల్లేమోగాని కేసీఆర్ ఈటల స్థానాన్ని ఆయన కులం నేతతో నింపలేకపోయారు.
Ads
ఆంధ్రప్రదేశ్ పాత కేబినెట్ లోని ఏకైక రాజుల మంత్రిని (చెరుకువాడ శ్రీ రంగనాథరాజు) సీఎం వైఎస్ జగన్ తొలగించారు. కాని పాత నల్లగొండ జిల్లా (ప్రస్తుత భువనగిరి) తుర్కపల్లి మండలం కొండాపురంలో మూలాలున్న కుటుంబంలో పుట్టిన విడదల రజనీకి మంత్రి పదవి ఇచ్చారు. తండ్రి రాగుల సత్తెయ్యను బట్టి ముదిరాజ వారసత్వం లభించిన రజనికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ముదిరాజ బిడ్డకు ఏపీలో ప్రాతినిథ్యం ఇచ్చారు-
రజనీ మాదిరిగానే హైద్రాబాద్ లో చదివిన జగన్. ఓసీ కాపు కుటుంబానికి కోడలు అయిన రజనిని బీసీలంతా తమ బిడ్డ అని ఓన్ చేసుకుంటున్నారు. ఆమె తండ్రి ముదిరాజు కావడం దీనికి ప్రధాన కారణం. అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏకైక ‘సమరశీల’ కమ్మ ప్రతినిధి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు తప్పుకున్నాక ఆయన కులానికి మళ్లీ జగన్ కేబినెట్లో చోటు దక్కలేదు అని కమ్మవారు బాధపడే పనిలేదు.
ఎందుకంటే, కమ్మల ఆధిపత్యం ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ప్రఖ్యాత కమ్యూనిస్టు పువ్వాడ నాగేశ్వరరావు గారబ్బాయి అజయ్ కుమార్ ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో కీలక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు 1995-99 కేబినెట్లో కొన్నేళ్లు కే చంద్రశేఖర్ రావు నిర్వహించిన రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సమ్మెకు ముందు నుంచే కొనసాగుతున్నారు.
అంతేగాక, ఖమ్మం లోక్ సభ్యుడు, కమ్మ పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు గారు టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నేత. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ కమ్మ కులంలోనే పుట్టారు. నీరజ, ఆమె భర్త రామబ్రహ్మం 35 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా గుడివాడ దెగ్గిరి పెదపారుపూడి నుంచి వచ్చి ఖమ్మంలో స్థిరపడ్డారు. ఈ పెదపారుపూడి చెరుకూరి రామోజీరావు గారి సొంతూరు.
అంతేగాక ఐటీవల ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తెరాస టికెట్ పై గెలిచిన తాతా మధుసూదన్ కూడా పుట్టుకతో కమ్మ కులస్తుడే. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ లో దక్కని ప్రాతినిధ్యం, ఒక జిల్లాలో ఆధిపత్యం తెలంగాణలో కమ్మలకు సునాయాసంగా లభించాయి. ఖమ్మం జిల్లాలోనేగాక హైదరాబాద్ నగరంలో తన తెలంగాణ రాష్ట్ర సమితికి చిక్కదనంతో పాటు ‘కమ్మదనం’ అవసరమని గుర్తించగల దురంధరుడు సిద్దిపేట పెద్ద పద్మనాయకుడు.
అందుకే తెలంగాణ పాలకపక్షంలో అజయ్ కుమార్ తో కలిపి ఐదుగురు శాసనసభ్యులున్నారు. హైదరాబాద్ జిల్లాలోని జూబిలీ హిల్స్ మాగంటి గోపీనాథ్, శేరీ లింగంపల్లి అరికపూడి గాంధీ, ఇంకా మిర్యాలగూడ నల్లమోతు భాస్కరరావు, సిర్పూర్ కోనేరు కొనప్ప -ఈ ఐదుగురు కమ్మ ఎమ్మెల్యేలు 2018లో గెలిచారు. ఈ రకంగా కమ్మ కుబేరులకు స్థావరమైన తెలంగాణలోనే ఈ సామాజికవర్గం పరిస్థితి ‘ఆశావహకంగా’ కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన ఏడాది లోపే అంటే 2014 డిసెంబరులో రాష్ట్ర చట్టసభల్లో దేనిలోనూ సభ్యత్వం లేని తన మాజీ కేబినెట్ కలీగ్ తుమ్మల నాగేశ్వరరావును మంత్రిని చేయడమేగాక కీలక రహదారులు, భవనాల శాఖ అప్పగించారు కేసీఆర్. తన రాజకీయ జీవితం చంద్రబాబు మాదిరిగానే యువజన కాంగ్రెసులో మొదలయినప్పటికీ తనకు సుస్థిర రాజకీయ జీవితం ప్రసాదించిన పార్టీకి సామాజిక పునాది అయిన కమ్మ సామాజికవర్గం ప్రాధాన్యం విస్మరించలేదు తెలంగాణ ముఖ్యమంత్రి.
1973 డిసెంబర్ నుంచి 1978 మార్చ్ వరకూ దాదాపు నాలుగున్నరేళ్లు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న జలగం వెంగళరావు గారు రాష్టంలోని రెండో ప్రధాన వ్యవసాయ కులం కమ్మలను ‘పట్టించుకున్న’ తీరును బట్టి చాలా ఏళ్లు కమ్మ శ్రేయోభిలాషిగా చెలామణి అయ్యారు. ఎంతైనా తెలంగాణ పద్మనాయక వెలమలు అవసరానికి మించిన తెలివితేటలు ఉన్నోళ్లని ఎవరో పెద్దలు చెప్పిన మాటలు నిజమేననిపిస్తున్నాయి.
Share this Article