ప్రపంచ అద్భుతం, నదికి కొత్త నడకలు… ఇంకా ఏవేవో ఉపమానాలతో, కేసీయార్‌ను అపర భగీరథుడు అంటూ మొన్నమొన్నటిదాకా ఆకాశానికి ఎత్తారు కదా… మేడిగడ్డ కుంగిపోతే అబ్బే, ఇవన్నీ సహజమేనని కొట్టిపారేశారు కదా… మరీ కేటీయార్ అయితే పీసా టవర్‌తో పోల్చి అపహాస్యం చేశాడు కదా… మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర బృందం తేల్చి చెప్పింది కదా… ఈరోజుకూ దీనికి హోల్‌సేల్ బాధ్యుడైన కేసీయార్ ఒక్క ముక్క మాట్లాడలేదు… అసలు అది కాదు, ఆశ్చర్యపోయే బాధ్యతారాహిత్యం ఇంకా ఉంది… తెలంగాణ సమాజాన్ని నిండా ముంచేసి, మోసగించేసిన తీరు మరింత స్పష్టంగా బయటికి వస్తోంది…
డెక్కన్ క్రానికల్‌లో వంశీ శ్రీనివాస్ రాశాడు… ఆ వార్త ప్రకారం మన స్టోరీలోకి వెళ్దాం… అసలు 2019లోనే వరదలు వచ్చినప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టుకు డ్యామేజీ జరిగింది… మరి అప్పుడు రిపేర్లు ఎవరు చేశారు..? ఎల్‌అండ్‌టీ ఇప్పుడు చెబుతున్నట్టుగానే మాకేమీ సంబంధం లేదు అని తేల్చేసింది అప్పట్లో కూడా… నిజానికి కంట్రాక్టు ఒప్పందాల్లో ఏముంది..? అంతా బాగుంటే సదరు ఎల్‌అండ్‌టీ చెవులు పిండి రిపేర్లు చేయించాలి కదా, కాదంటే లీగల్ ఫైట్ చేయాలి కదా… అదేమీ లేదు, రివైజ్డ్ ఎస్టిమేట్లలో 500 కోట్లను అడ్జస్ట్ చేసి పారేసింది…
అదుగో ఆ అలుసుతోనే మొన్న కూడా మేడిగడ్డ రిపేర్ మేం చేయము, మా పని కాదు, మా బాధ్యత కాదు, ఖర్చు భరిస్తానంటే వోకే అని లేఖ రాసింది… ఇంకా రేవంత్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో తెలియదు… రిపేరు పనులు, కాఫర్ డ్యామ్ నిర్మాణం ప్రారంభమైనట్టు వార్తలయితే వచ్చాయి… ఆ ఖర్చు ఎవరిది..? 2019లోనే ఎల్అండ్‌టీ రిపేర్లకు మొరాయిస్తే, మరి మొన్న బరాజ్ కుంగుబాటు, ఇతర బరాజుల్లో లీకేజీల ఖర్చు మొత్తం ఎల్అండ్‌టీయే భరిస్తుందని హరీశ్, కేటీయార్ ఎందుకు చెప్పినట్టు..? ఎందుకీ అబద్ధాలు..? మోసం కాదా..?
Ads
అప్పట్లో కూడా RCC wearing coat, CC curtain walls, CC blocks, apron దెబ్బతిన్నాయంటే, మళ్లీ ఇప్పుడు ఏకంగా బరాజే కుంగిపోయిందంటే ఎంత నాసిరకం నిర్మాణం తెలంగాణ సమాజం మీద రుద్దబడిందో అర్థమవుతూనే ఉంది… కాగ్ డ్రాఫ్ట్ పర్‌ఫామెన్స్ రిపోర్ట్ కూడా పలు లోపాల్ని ఎత్తిచూపింది… అప్పట్లోనే రిపేర్ల కోసం ఇరిగేషన్ శాఖ కంట్రాక్టు ఏజెన్సీలను సంప్రదిస్తే… మీరు అనుమతించిన డిజైన్లతోనే నిర్మాణం చేశాం, ఇక మాదేం బాధ్యత అని చేతులు దులిపేసుకుందట ఎల్‌అండ్‌టీ…
అంటే ప్రాజెక్టు డిజైన్లలోనే లోపం ఉందని స్పష్టంగా తేటతెల్లమైనట్టే కదా… వరద నీటి ప్రవాహ తీవ్రత, పరిమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్లు చోటుచేసుకోలేదు అనేది కాగ్ పరిశీలన… ఐనాసరే, ప్రజలకు నిజాలు తెలియకుండా దాచారు, చివరకు మేడిగడ్డ కుంగిపోయి నిర్మాణ నాణ్యతలోని డొల్లదనం ప్రజలందరికీ తెలిశాక కూడా ఏవేవో చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు… ఒక్క రూపాయి భారం కూడా ఖజానా మీద పడబోదని ఎందుకు చెప్పినట్టు..?
కాలేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నిరకాల రిపేర్లు అవసరం..? అసలు దాని భవిష్యత్తు ఏమిటి..? రిపేర్ల ఖర్చు ఎవరు భరించాలి..? ఇవేకాదు, పంపు హౌజుల పరిస్థితేమిటి..? ఆమధ్య ఓ పంపుహౌజు మునిగి, సోకాల్డ్ బాహుబలి మోటార్లు కాలిపోయాయి కదా… ఈ ప్రశ్నలకు ఇంకా రేవంత్ ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంది… రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టు జుడిషియల్ ఎంక్వయిరీ జరిగి, బాధ్యులను పనిష్ చేయాలి… లక్ష కోట్ల ప్రజాధనం నిరర్థకం చేశారంటే అది మామూలు ద్రోహం కాదు కదా… అసలు ఈ బరాజులే కాదు, మరో తీవ్ర ప్రమాద హెచ్చరిక ఉంది…
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ కెపాసిటీ మీద నిపుణులు ఆది నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు… భూసేకరణ వివాదాలను పక్కన పెడితే, దాన్ని 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించారు… కానీ సీస్మిక్ జోన్‌లో ఉంది… అంటే భూకంప ప్రమాదం ఉందని అర్థం… సవివరమైన సీస్మిక్ స్టడీ జరగకుండానే నిర్మిస్తూ వెళ్లారు… ఇరిగేషన్ శాఖ ఎన్‌జీఆర్ఐని సీస్మిక్ విశ్లేషణ కోరుతూ 2016, 2017లో అప్రోచైంది… ఆ రిపోర్టుల కోసం వేచి ఉండకుండానే 2017 డిసెంబరులో కంట్రాక్టర్లకు పనులు ఇచ్చేసింది… 2020లో ప్రాజెక్టు పూర్తి కావల్సిందేనని చెప్పింది… తీరా ఎన్‌జీఆర్ఐ అది సీస్మిక్ జోన్‌లోనే ఉన్నట్టు తెలిపింది…
దీని మీద కూడా కాగ్ అభ్యంతరాల్ని, భయసందేహాల్ని కూడా వ్యక్తపరిచింది… సీస్మిక్ స్టడీ లేకుండా, ఎమర్జన్సీ యాక్షన్ ప్లాన్ లేకుండా చకచకా హడావుడిగా రిజర్వాయర్‌ను కట్టేసింది… ఇప్పుడేదైనా జరిగితే దాని పరిసర ప్రజల పరిస్థితేమిటి..? ఆరు గ్యారంటీలు గట్రా కాదు రేవంత్ ఎదుట విషమ పరీక్ష ఏమిటంటే… లక్ష కోట్లు గోదావరిలో పోసిన ఈ కాలేశ్వరాన్ని మళ్లీ గాడిన పడేయడం ఎలా..? అసలు పడేయడం సాధ్యమేనా..? బాధ్యుల్ని ఫిక్స్ చేయగలడా..?
Share this Article