Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎన్నికల ప్రచార పర్వంలో అభ్యర్థుల ‘సాగరసంగమం భంగిమలు’…

November 10, 2023 by M S R

Gimmicks: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు రోడ్డు మీద అట్లకాడ చేతబట్టి దోసెలు వేస్తారు. బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఆటో నడుపుతారు. పళ్లమ్ముతారు. బస్సులో ప్రయాణిస్తారు. బైక్ నడుపుతారు. దుక్కి దున్ని, నీరు నిలిపిన బురద పొలంలోకి దిగి నాట్లు వేస్తారు. కొడవలి చేతబట్టి కోతలు కోస్తారు. చెబితే బాగోదు కానీ…ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు.

గెలిచాక, ఓడిన తరువాత అదే అభ్యర్థులు అవే పనులు చేయాలని మనం కోరుకోము. ఒకవేళ మనం కోరుకున్నా వారు చేయరు. అంటే ఎన్నికల ప్రచారంలో కొంత వైవిధ్యమైన ఫోటోలకు, వీడియోలకు తప్ప; మీడియాలో కొంత చోటుకు తప్ప ఈ సాగరసంగమం భంగిమ-1 , భంగిమ-2 , భంగిమ-3 దృశ్యాలు ఇంకెందుకూ పనికిరావన్నమాట.

Ads

పూజలు, వ్రతాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పురోహితుడు “మమ” అనుకోండి అని మనకు చెప్పగానే “మమ” అంటాం. వెంటనే వేరే పనులు చూసుకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, వచ్చినవారిని పలకరిస్తూ, కెమెరాల్లో సరిగ్గా పడుతున్నామో లేదో చూసుకుంటూ ఉంటాం. అందువల్ల మొక్కుబడిగా, అశ్రద్ధగా, అయ్యిందనిపించేలా చేసే దాన్ని “మమ అనిపించారు” అని అంటున్నాం. అలా ఎన్నికల వేళ అభ్యర్థులు మమ అనిపించాల్సినవి చాలా ఉంటాయని లోకం ఏనాడో అంగీకరించింది.

అయిదేళ్లపాటు ఆర్ టీ సి బస్టాండ్ ముందు అట్లు వేయడానికి, అయిదేళ్ల పాటు రోజూ ఉదయం చీపురు పట్టి వీధులు ఊడ్చడానికి, పొలంలో కలుపు తీయడానికి, బావిలో నీళ్లు చేది బక్కెట్లో పోయడానికి, బండమీద బట్టలు ఉతకడానికి, ఉతికి ఆరేసిన బట్టలు ఇస్త్రీ చేయడానికి కాదు కదా మనం ప్రతినిధికి ఓటు వేస్తున్నది! మనల్ను ఇంతకంటే మెరుగయిన స్థితిలో పెట్టడానికి, మన నియోజకవర్గాన్ని పట్టించుకోవడానికి ఓటు వేస్తున్నామని మనకు తెలుసు. నియోజకవర్గంలో దోసెల బండి, మురుగు కాల్వ, కలుపు మొక్క, మటన్ ముక్క… అన్నీ అందరూ అంతర్భాగం.

అట్లకాడ పట్టిన అభ్యర్థిని చూడగానే అట్లమ్ముకునేవారందరూ ఓట్లు వేస్తారని...చీపురు పట్టిన అభ్యర్థిని చూడగానే చీపుళ్లు పట్టినవారందరూ ఓట్లు వేస్తారని…ఆటో నడిపిన అభ్యర్థిని చూడగానే ఆటో నడిపేవారందరూ ఓట్లు వేస్తారని- ఒక నమ్మకం. ఈ నమ్మకం ఓట్లు కుమ్మరించినట్లు శాస్త్రీయమైన గణాంక ఆధారాలేమీ లేవు. నమ్మకాలే కొంతకాలానికి ఆచారాలుగా స్థిరపడి…అవే సంప్రదాయాలుగా మారిపోతాయి.

“కమ్మరి కొలిమీ
కుమ్మరి చక్రం
జాలరి పగ్గం
సాలెల మగ్గం
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు
నా వినుతించే..
నా విరుతించే..
నా వినుతించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి
భావం.. భాగ్యం.. ప్రాణం.. ప్రణవం ..”
అంటూ అభ్యర్థులు శ్రీశ్రీలకు పాఠాలు చెప్పే నవీన వృత్తులను నవనవోన్మేషంగా చేపడుతుంటే ఓటర్లుగా మనం-


“మేము సైతం
ప్రపంచాగ్నికి ఓటునొక్కటి ఆహుతిచ్చాము;
మేము సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాము;
మేము సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాము…”
అని పాడుకోవడం తప్ప చేయగలిగింది లేదు!

నిజానికి రాజకీయం ఒక వృత్తి. అందులో ఎన్నికలు అంతర్ వృత్తి.  ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అనేక వృత్తులు చేపట్టడం ప్రతీకాత్మక పునరంతర్ వృత్తి! అందుకే- ఈ కనిపించే ప్రపంచమే ఒక చిత్త భ్రాంతి అని స్పష్టంగా ఏనాడో తేల్చిపారేశారు వేదాంతులు!  -పమిడికాల్వ మధుసూదన్      9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions