హబ్బబ్బ… నిన్నటి నుంచీ తెగరాసేస్తున్నారు… అదేదో ఆహా అనే ఓటీటీ ఉందిగా అల్లు అరవింద్‌కు… అందులో అక్కినేని నాగసమంత అల్లు అర్జునుడిని ఇంటర్వ్యూలాంటిది ఏదో చేసిందట… మరి దానికి ప్రొమో లేదా ప్రమోషన్ అంటూ చేసుకుని ఏడవాలి కదా… ఆ ప్రకటనల్లో సదరు అల్లు అర్జునుడు అనేబడే చిరంజీవికి అల్లుడు వరుస హీరోను మెగాస్టార్ అని రాశారట… ఇంకేముంది..? అసలే అది మెగా ఫ్యామిలీ… బొచ్చెడు మంది హీరోలు… చిన్న చిన్న అంశాలూ పెద్దపెద్దగా ప్రచారంలోకి వస్తాయి కదా…
హవునా, హల్లు హరవింద్ హప్పుడే హంత పెద్దవాడైపోయాడా..? బావనే ధిక్కరిస్తున్నాడా..? చిరంజీవి ప్లేసులోకి బన్నీని ప్రమోట్ చేస్తూ కావాలనే ఇలా మెగాస్టార్ అంటూ ప్రచారం మొదలుపెట్టాడా..? రేయ్, అరవిందూ, తప్పు ఒప్పుకో, లేదంటే తాటతీస్తాం అన్నట్టుగా భారీ ఎత్తున ట్రోలింగ్ మొదలైంది…
Ads
ఈ నష్టాన్ని గమనించి, పొరపాటున చిరంజీవికి ఈ విషయంలో గనుక కోపమొస్తే తన బతుకు ఏమిటని ఓసారి ఆలోచించుకుని, అరవిందుడు ఆహా ఓటీటీలో బాధ్యులను బూతులు తిట్టేసినట్టున్నాడు… దాంతో ఆ టీం మరింత విచిత్రమైన క్షమాపణలు కోరింది చిరంజీవి అభిమానులను…
It' the last day of a crazy year. So, let's forgive, forget and step into 2021 with love, light and laughter! 🧡 pic.twitter.com/9CDluQ1U90
— ahavideoin (@ahavideoIN) December 31, 2020
ఇది సంవత్సరంలో చివరిరోజు, పాతవన్నీ ఎందుకు, అన్ని మరిచిపోదాం, క్షమించేద్దాం… హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ అంటూ… మెగాస్టార్ ఒక్కడే, అదెవరో మీకూ తెలుసు అని ఓ ట్వీట్ కొట్టేసింది ఆ టీం… అతి తెలివి… చిరంజీవే మెగాస్టార్ అని ఏడవొచ్చు కదా… అయిపోయేది… మళ్లీ అక్కడ ఏదో దిక్కుమాలిన ఇగో…
ఇవేమైనా ప్రభుత్వ పురస్కారాలా..? ఈ మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు ఎవడో నిర్మాత స్టార్ట్ చేస్తాడు, ఫ్యాన్స్‌కు వేరే పని ఉండదుగా… ఆ పేర్లు కలవరిస్తారు… సరే, చిరంజీవి మెగాస్టార్… ఈ మెగా అనే పదం పరమపవిత్రం… ఇంకెవరూ దాన్ని వాడటానికి వీల్లేదు… అలా తయారైంది… అప్పట్లో ప్రజారాజ్యం బదులు మెగారాజ్యం అని పెట్టుకోకపోయాడా..?
సరే, ఆహా టీంలో ఎవరో మెగా హీరో అని రాయబోయి, మెగాస్టార్ అని రాసి ఉంటాడు… మెగా కంపౌండ్ హీరోలందరినీ మెగా హీరో అని సంబోధిస్తారు కదా… అలాగన్నమాట… అది కాస్తా ఫుల్ రివర్స్ పంచ్ కొట్టింది… అల్లు అరవిందుడికి వాచిపోయింది… అసలు ఈ బావమరిదిలోనే ఏవో దురుద్దేశాలు ఉండి ఉంటాయనీ, చిరంజీవిని రాజకీయంగా భ్రష్టుపట్టించింది కూడా ఆయనేననీ, ఇప్పుడు చివరకు ఆ మెగాస్టార్ అనే కిరీటాన్ని కూడా లాగేసే ప్రయత్నంలో ఉన్నాడనీ సందేహించేవాళ్లే ఎక్కువ… తన క్రెడిబులిటీ లెవల్ అది… డబ్బు దగ్గర బావ లేదు, బావమరిది లేదు…
నిజం… ప్రస్తుతం టాలీవుడ్లో రియల్ మెగాస్టార్ చిరంజీవే… అన్ని విభాగాలకూ సంబంధించి తను పెద్దమనిషి… ప్రభుత్వాలతో సంధానకర్త… ఇమేజీ ఉంది, వయసుతోపాటు వచ్చిన పరిణతి ఉంది, చేదు అనుభవాల గతం ఉంది, ఆచితూచి మాట్లాడే నేర్పు ఉంది… ఈ స్ధితిలో మనసులో ఏ దురుద్దేశం ఉన్నా సరే బావమరిది తనతో గోక్కుంటాడా..? పైగా గోక్కుంటే వచ్చే ఫాయిదా ఏముంది..? చిరంజీవిని ఈరోజుకూ వాడేసుకుంటే బెటర్ అనే ఆలోచిస్తాడు కదా అరవిందుడిలోని వ్యాపారి… సో, మెగాస్టార్ అనే పదభంగం వెనుక అరవిందుడి కుట్ర ఏమీ లేకపోవచ్చునని యావత్తూ చిరంజీవి ఫ్యాన్సు గమనించగలరు… క్షమించేయగలరు… ఐనా, అల్లు గారూ… అప్పుడే తొందరేముంది..? మీ అబ్బాయి ఇంకా పసివాడే కదా, కాస్త ముదరనీ, తరువాత మెగా వారసత్వాల్ని తేల్చేద్దాం… ఏమంటారు..?
Share this Article