రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఏపీ సర్కారే కేసు పెట్టబోతోందా..? నిజానికి చట్టప్రకారం దానికి చాన్స్ ఉందా..? ఈ వివాదంలోకి జగన్ ఏకంగా ప్రధాని మోడీని కూడా లాగినట్టేనా..? కేబినెట్ సెక్రెటరీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందా..? నిజానికి పైపైన చదివితే…. ఎబ్బే, ఇవన్నీ మరీ ఊహాత్మక ప్రశ్నలు… అసాధారణం… అంత సీన్ లేదు… ఒక రాజ్యాంగవ్యవస్థకు చాలా అధికారాలుంటయ్… అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఏమీ చేయలేదు, జగన్ ఇరుకునపడ్డట్టే అని పైకి అనిపిస్తుంది… కానీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ రాసిన లేఖ నిమ్మగడ్డకు బహుశా మింగుడుపడకపోవచ్చు… ఇది కాస్త వివరంగా చెప్పుకోవాలి…
తెలిసి రాసినా, తెలియక రాసినా ఆంధ్రజ్యోతివాడు రాసింది కరెక్టే… మేం ఎన్నికల్ని నిర్వహించలేం మొర్రో అని చెబుతున్నా సరే… నిమ్మగడ్డ ఎన్నికలు ప్రకటించడం ఓరకంగా యుద్ధం ప్రకటించినట్టే…! కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి, తన ఆదేశాలు పాటించని అధికారులపై నిమ్మగడ్డ వేటు వేయొచ్చు… చీఫ్ సెక్రెటరీయే ధిక్కరిస్తున్నాడు, ఎన్నికల్ని నిర్వహించాల్సిన పంచాయతీరాజ్ కార్యదర్శి ఏకంగా ఇది దురహంకారమే అని వ్యాఖ్యానించాడు… వాళ్లిద్దరిపై వేటు వేస్తాడా నిమ్మగడ్డ..? దాన్ని ప్రభుత్వం పాటిస్తుందా..? అక్కడ మొదలవుతుంది అసలు యుద్ధం…
Ads
ముందుగా మనం కొన్ని విషయాల్ని పక్కనపెడదాం… అందరికీ తెలిసిన అంశాలే… నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల్ని వాయిదా వేశాడు, కారణం, కరోనా… ఇప్పుడు తనే ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, కోడ్ అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు… మరి అదే కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తూ, నిర్వహించలేమని చెబుతున్నా దాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది కీలకప్రశ్న… ఇక జగన్ తన స్థాయికి తగ్గి, నిమ్మగడ్డకు కులం రంగు పూయడం… నిమ్మగడ్డ అసహనంతో రగిలిపోవడం, జగన్ కూడా అంతే ఆగ్రహంతో వ్యవహరించడం… వైసీపీ నేతలు నిమ్మగడ్డపై దురుసు వ్యాఖ్యలు చేయడం, టీడీపీ నిమ్మగడ్డకు అనుకూలంగా డప్పు కొట్టడం… ఇది కులపంచాయితీయో, ఇంకే పంచాయితీయో అర్థం కాని దురవస్థ… అయితే..?
హైకోర్టు సెలవుల టైమింగు చూసుకునే నిమ్మగడ్డ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే అభిప్రాయాల్ని పక్కనపెడితే… నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తనంతటతాను కావాలని హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు… తను సింపుల్‌గా తన వాదనకు కట్టుబడి ఉంటే చాలు… కోర్టు ఆల్రెడీ ఈ ఇష్యూపై ‘సంప్రదింపులు’ అనే మాట వాడింది తప్ప… ఎన్నికల్ని నిర్వహించాల్సిందే అని చెప్పలేదు… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కెలకడానికి తను కోడ్ చూపించి, కొన్ని చర్యలు ప్రకటిస్తే… రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయదు… మరి అప్పుడేం చేయాలి..? ఎన్నికల సంఘమే మళ్లీ కోర్టుకు వెళ్లాలి… అప్పుడేం జరగొచ్చు..?
ఇది చూశారు కదా, ఆదిత్యనాథ్ దాస్ కావాలనే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.., ఎన్నికల సంఘానికి రాసిన తన లేఖలో ‘‘ఎన్డీఎంఏ చట్టం’’ అని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించాడు… అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్… ప్రత్యేకించి పాండెమిక్ సందర్భాల్లో ఇది పవర్ఫుల్… కరోనాను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విపత్తు అని గుర్తించింది… ప్రకటించింది… విపత్తు నిర్వహణ దిశలో ఎవరు అడ్డంకులు కల్పించినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అధికారాన్ని ఆ చట్టం కల్పిస్తోంది… ఇదీ ఆ చట్టంలోని ఓ రూల్…
ప్రస్తుతం దేశం లాక్ డౌన్ ఎత్తివేత దశలో ఉంది తప్ప… లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయబడలేదు… వేక్సినేషన్‌ను ఓ యుద్ధప్రాతిపదికన నిర్వహించాల్సిన కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది… సో, NDMA ప్రకారం మమ్మల్ని ఏం చేయమంటారు అని జగన్ సర్కారు కేంద్రాన్ని అడిగితే… కేబినెట్ సెక్రెటరీ క్లారిటీ ఇవ్వాలి… రేప్పొద్దున కోర్టు అడిగినా ఇవ్వకతప్పదు… అంటే ఇందులోకి జగన్ మోడీని కూడా లాగినట్టే..!
ఏమో… ఈ చట్టాన్ని చూపిస్తూ ఏకంగా నిమ్మగడ్డపై చర్యకు ఉపక్రమిస్తుందా అంటే వెంటనే జవాబు చెప్పలేం… సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా నిమ్మగడ్డ నిర్ణయం ఉందని చెబుతున్న పంచాయతీరాజ్ కార్యదర్శి ఏకంగా దీన్ని దురహంకారం అనే సీరియస్ వ్యాఖ్య చేశాడు… దీన్ని నిమ్మగడ్డ ఎలాగూ సహించడు… యాక్షన్ ఉండవచ్చు… అక్కడ అసలు ‘పంచాయితీ’ స్టార్ట్ కావచ్చు బహుశా… రాష్ట్ర ప్రభుత్వం సహకరించనిదే ఏ ఎన్నికలూ సాధ్యం కావు… రాష్ట్ర ప్రభుత్వానికి ఈయన ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్నంతకాలం ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేదు… సో, నిమ్మగడ్డ గనుక తన నిర్ణయం అమలు దిశలో అడుగులు వేసేకొద్దీ, ఇక రెండు వ్యవస్థల నడుమ ఘర్షణ అనివార్యం… అది ఎన్ని మలుపులు, ఎలా తిరుగుతుందో కూడా ఎవరూ చెప్పలేరు…!!
Share this Article