ఇటు దుబ్బాక… గ్రేటర్… ఈ ఫలితాల ఉత్సాహంతో ఏపీలో కూడా బీజేపీ దూకుడు పెంచబోతోందనీ… ఏపీ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందనీ… ఏపీలోనూ బలపడే సూచనలున్నాయనీ… కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి… నిజమేనా..? అంత సీన్ ఉందా ఇప్పుడు..? తెలంగాణ బీజేపీ విజయాలు ఏపీ పార్టీకి జవసత్వాలను నింపుతోందా..? నిర్మొహమాటంగా చెప్పాలంటే… లేదు…! ఇప్పటికిప్పుడు వాళ్లు కాలర్ ఎగరేసే కాలం ఏమీ రాబోవడం లేదు… నిజం కదా, నిష్ఠురంగానే ఉంటుంది ఇలా…
ఒక బెంగాల్… మమత బెనర్జీ లెఫ్ట్ పార్టీని చావుదెబ్బ తీస్తూ పోయింది… ఖాళీ అవుతున్న స్పేస్‌లోకి బీజేపీ విస్తరించుకుంటూ పోయింది… ఒక తెలంగాణ… కేసీయార్ కాంగ్రెస్‌ను చంపేస్తూ పోయాడు… ఆ స్పేస్‌లోకి బీజేపీ పాకిపోయింది… ఒక ఒడిశా… కాంగ్రెస్ నాయకత్వలేమితో తనంతటతానే దెబ్బతిన్నది… బీజేపీ ఆ స్పేస్ ఆక్రమించింది… జస్ట్ ఉదాహరణలు ఇవి… ఏపీలో తెలుగుదేశం అలా దెబ్బతింటే తప్ప బీజేపీకి ఎదిగే చాన్స్ ఉండదు… ఆ స్పేస్ ఖాళీ అయితే కదా… అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడప్పుడే ఏమీ నష్టపోదు… వ్యాప్తి చెందడానికి స్కోప్ ఎక్కడ ఉంది బీజేపీకి..? అసలు తన ప్రధాన, ప్రథమ ప్రత్యర్థి ఎవరో బీజేపీ ఇప్పటికీ తేల్చుకోలేదు… ఎవరితో పోరాడాలి…? నో, నో, ఇద్దరితోనూ పోరాడతాం, మా అనుకూలతల సాయంతో విస్తరిస్తాం అని ఎవరైనా వివరణ ఇచ్చే పక్షంలో… వాళ్లకు ఫీల్డ్ రియాలిటీ తెలియదు అని అర్థం…
Ads
ఒక కేరళ… దేశంలో ఎక్కడా లేనట్టుగా… ప్రాణాలకు తెగించే కేడర్ ఉంది బీజేపికి… దశాబ్దాలుగా ఇటు కాంగ్రెస్, అటు లెఫ్ట్‌తో పారాడుతూనే ఉంది పార్టీ… కానీ విస్తరించలేకపోతోంది… వోట్లు, సీట్లు పరంగా… ఒక తమిళనాడు… ఇక్కడా మస్తు ట్రై చేస్తోంది… ఫలితం లేదు… ఎందుకు..? లెఫ్ట్ మీద కోపమొస్తే కాంగ్రెస్ కనిపిస్తోంది కేరళ ప్రజలకు… అన్నాడీఎంకే మీద కోపమొస్తే డీఎంకే కనిపిస్తోంది అక్కడ… ప్రతిపక్షం ఉంది… అలాంటప్పుడు బీజేపీకి చాన్స్ ఎలా దొరికేది..? ఏపీలోనూ అంతే… ఇప్పుడు సీట్ల సంఖ్యలో టీడీపీ బలహీనంగా కనిపించవచ్చుగాక… కానీ అది ఏపీలో ఇప్పటికీ బలమైన రాజకీయశక్తి…
ఏళ్ల తరబడీ ఏపీలో, తెలంగాణలో బీజేపీని తెలుగుదేశం పార్టీ కోసం దెబ్బతీశారు… తోక పార్టీగా చేశారు… ఆడుకున్నారు… ఏపీలో పెద్దగా పార్టీకి బలం లేదు కాబట్టి జరిగిన నష్టం లెక్కలోనికి రాలేదు పెద్దగా… కానీ తెలంగాణలో పార్టీకి బేస్ ఉంది… తెలంగాణ వచ్చాక కూడా… తెలుగుదేశంపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర బలంగా పడ్డ తరువాత కూడా బీజేపీ దాంతో అంటకాగాల్సి వచ్చింది… దెబ్బతిన్నది… తరువాత తెలుగుదేశం దూరమైనా కేసీయార్ అనుకూల నేతల వల్ల ఇంకాస్త దెబ్బతిన్నది… ఆ శిథిలాల నుంచి ఇప్పుడిప్పుడే కొత్త ప్రాణం పోసుకుని లేస్తున్నది పార్టీ…
ఏపీ అంటేనే కులరాజకీయాల వేదిక కాబట్టి… ఒక రెడ్ల పార్టీ, ఒక కమ్మ పార్టీ… ఇప్పుడు బీజేపి ఏ పార్టీ..? ఆల్రెడీ తన దోస్త్ పవన్ కల్యాణ్ కాపు… పోనీ, బీసీల పార్టీ, బహుజన పార్టీగా ఎదగాలీ అనుకుంటే… ఈరోజుకూ బీజేపీకి ఆ సంకల్పం లేదు, ఆ అడుగుల్లేవు… పైగా ఇప్పటికీ ఎవరో రావాలీ, తనను ఉద్దరించాలీ అనే ధోరణి దేనికి..? పవన్ కల్యాణో, ఇంకెవరో బండిని తోస్తే తప్ప కదలదా..? సొంతంగా ఎదిగితేనే బలం… ఈ సోయి ఏపీబీజేపీకి ఇక ఎన్నటికీ రాదా..? అవునూ, రాబోయే రోజుల్లో ఇదే పవన్ కల్యాణ్ తమకు నష్టకారకం అవుతాడేమో… పలు కోణాల్లో… సరే, ఆ చర్చను వదిలేస్తే…
ఏపీ పార్టీకి, తెలంగాణ పార్టీకి మస్తు తేడాలున్నయ్… తెలంగాణలో ఏబీవీపీ, బీజేవైఎం, ఆర్ఎస్ఎస్ దగ్గర్నుంచీ బీజేపీకి పునాదులున్నయ్… మజ్లిస్ అనే శక్తితో, కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల సానుభూతిపరులతో కొట్లాడిన కేడర్ ఉండేది… ఆ పునాదుల మీద పార్టీని బతికించుకోవడం కాస్త ఈజీ… పైగా తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింటూ బీజేపీకి స్కోప్ ఇస్తోంది ఎదగడానికి… తెలంగాణ బీజేపీకి తన ప్రథమ, ప్రధాన ప్రత్యర్థి ఎవరో క్లారిటీ ఉంది… టార్గెట్ స్పష్టంగా ఉంది… చావో రేవో, పోరాటానికి ఒక డైరెక్షన్ ఉంది… టీఆర్ఎస్కు సాయం చేసే నేతల్ని గుర్తిస్తూ, కత్తిరిస్తూ… పాత విధేయులను కాన్ఫిడెన్స్‌లోకి తీసుకుంటూ… కొత్త ఊపిరికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు… బండి కొత్త దూకుడుతో పరుగు తీస్తోంది… నిబద్ధుడైన, నిజాయితీపరుడైన నాయకుడు ఉంటే వచ్చే అడ్వాంటేజ్ అది… బండి సంజయ్ తనే పెద్ద సూసైడ్ బ్యాచ్… ఇక కొత్తగా తనకు దూకుడు ఎవరూ నేర్పనక్కర్లేదు…
ఏపీలో అలాంటి నాయకుడు ఒకరు కావాలి… తన ప్రధాన, ప్రథమ ప్రత్యర్థి ఎవరో ముందుగా తేల్చుకోవాలి… ఈ అగ్రకుల పంచాయితీల జోలికి పోకుండా, బహుజన పంథా పట్టాలి… కొత్త దూకుడు కనిపించాలి… అది ఇప్పట్లో కనిపించేలా లేదు… అసలు అనేక అంశాలపై పార్టీ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదు, ఓ డైరెక్షన్ లేదు… సో, దుబ్బాక, గ్రేటర్ విజయాలు ఏపీ బీజేపీకి అందించే కొత్త ఊపిరి ఏమీ లేదు… ఇప్పటికిప్పుడు పార్టీ రథం వేగాన్ని అందుకునే సూచనలు కూడా లేవు… మరి రియాలిటీ అంటే ఇదే…!!
Share this Article