ఔనా..? పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టుకున్నాక ఎప్పుడూ చిరంజీవితో అవసరం పడలేదు… ఆ పాత ప్రజారాజ్యం ఫార్మాట్‌నే ఇష్టపడలేదు… నాడు తన అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకోవడమే తనకు ఇష్టం లేదు… అందుకని తన పంథాలో తను వెళ్తున్నాడు… మరి హఠాత్తుగా పవన్ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీస్సులు, నైతిక మద్దతు ఎందుకు కావల్సి వచ్చినయ్…? అన్నగారి అండ ఎందుకు అవసరపడింది..? ఇది ప్రశ్న… పెద్ద ప్రశ్నే… లెఫ్ట్, టీడీపీ, బీఎస్పీ వగైరా అన్నీ అయిపోయి… మళ్లీ ఆ పాత కాషాయమే ముద్దనిపించి… ఆ మోడీ ఫోటోనే మళ్లీ గట్టిగా కౌగిలించుకున్న వేళ… కేంద్రంలోనే అధికారంలో ఉన్న పెద్ద బీజేపీ అండగా ఉండగా…. పార్టీ నడపలేక, సోనియా చేతుల్లో పెట్టేసి, పాలిటిక్స్ కు దూరంగా ‘అమ్మడూ, కుమ్ముడూ’ పాటలతో కాలక్షేపం చేసుకుంటున్న చిరంజీవిని మళ్లీ ఎందుకు రాజకీయబజారులోకి లాగుతున్నాడు..?
సరే, ఇన్నాళ్లూ అన్నయ్య గొప్పతనం, ప్రభావం అర్థం కాలేదు, నష్టం జరిగింది… ప్రజారాజ్యం 18 సీట్లు గెలిస్తే, జనసేన ఒక్కటే గెలవగలిగింది… అంటే ప్రజారాజ్యం ఫార్మాటే బెటర్ అన్నమాట… అన్నగారి మీద అభిమానం ఎంతోకొంత వోట్లుగా టర్న్ అయ్యిందన్నమాట… రెడ్డి, కమ్మ మాత్రమే కాదు, కాపు అనేది కూడా ఆలోచించదగిన కేస్ట్ ఫ్యాక్టర్ అయ్యిందన్నమాట… అన్నయ్య అండ ఉంటే తనకు ఇంకా అదనపు బలం అని తెలిసొచ్చింది అన్నమాట… అందుకేనా..? ‘‘పవన్‌కు చిరంజీవి అండగా ఉంటాఅన్నారు… ఓ రెండేళ్లు సినిమాలపై కాన్సంట్రేట్ చేసి, తరువాత ఈ పాలిటిక్స్ పనిబడదాం’’ అని జనసేన్ డిప్యూటీ కమాండర్ నాదండ్ల మనోహర్ ఏదో పార్టీ మీటింగులో చెప్పాడు… (అందుకేనా, ఇక సినిమాలు చేయబోను, జనంలోనే ఉంటాను అన్న సేనాని ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు)
Ads
అవునూ, అంతటి చిరంజీవి భావోద్వేగంతో ‘థమ్ముడూ, నేనూ వస్తా, ఇక బరిలో కుమ్ముడే కుమ్ముడూ’ అని నిజంగానే చెప్పాడు అనుకుందాం… తను కాలేకపోయినా, ఏపీ ముఖ్యమంత్రిగా తమ్ముడిని చూసుకోవాలనే కోరిక బలంగా ఉందనే అనుకుందాం… మరి ఒక్కసారి కూడా చిరంజీవి జనసేనకు అనుగుణంగా ఒక్క బహిరంగ ప్రకటన చేయలేదేం..? మొన్నటి ఎన్నికల్లోనూ ఆమడ దూరంలో నిల్చుండి పోయాడేం..? కనీసం నైతిక మద్దతు కూడా ప్రకటించలేదేం..? మరి ఇప్పుడు నాదెండ్ల చెబుతున్న ఈ మాట ఆంతర్యం ఏమిటి..? ఒకవేళ నిజంగానే పవన్ కల్యాణ్‌కు అండగా ఉండాలని, తిరిగి రాజకీయాల్లో ఏదో ఓ రూపంలో రావాలని చిరంజీవి అనుకునేపక్షంలో ఆయనే చెబుతాడు కదా… ఈ నంబర్‌టూ నాదెండ్లకు ఎందుకు ఆ బాధ్యత అప్పగిస్తాడు..? పోనీ, పవన్ కల్యాణే ఏదో ఓ సందర్భంలో చెప్పొచ్చు కదా, ఈ నంబర్ టూ మనోహరుడికి ఆ బాధ్యత ఎందుకు అప్పగిస్తాడు..? మరి పవన్ కల్యాణ్ చెప్పకుండా నాదెండ్ల మనోహర్ ఇలాంటి ఆంతరంగిక, అతి ముఖ్య, అతి కీలక, అతి ప్రభావ, అతి ప్రధాన విషయాల్ని పార్టీ వేదిక మీద ఎందుకు వెల్లడిస్తాడు..? అసలు ఏం జరుగుతోంది..?
ఈ వార్తలు చదివి, ఈ నాదెండ్ల వీడియో చూసి… ఓ మిత్రుడు ‘‘ఓహో, అల్లు అరవిందుడు కూడా తన బావతోపాటు జనసేనకు అండగా వస్తాడన్నమాట… శుభం… కథ సుఖాంతం…’’ అన్నాడు వ్యంగ్యంగా…! ప్రజారాజ్యం వైఫల్యాలకు అసలు కారకుడు ఎవరో చాలామందికి క్లారిటీ ఉంది.,. నిజంగానే తనూ వస్తాడా..? తన దర్శకత్వంలో ముగ్గురు అన్నదమ్ములూ సంయుక్త ప్రచారం చేసుకుంటారా..? పవన్ కల్యాణ్ ధోరణికీ, అల్లు అరవిందుడి వ్యవహార ధోరణికీ అస్సలు పొసగదు… పోనీ, బావమరిది లేకుండా బావ ఒక్క అడుగూ వేయడు… మరెలా..? ఇప్పుడిప్పుడే టాలీవుడ్ వోల్ మొత్తానికీ పెబ్బగా, అందరివాడుగా తనను తాను మౌల్డ్ చేసుకుంటూ, ఈ క్షుద్రరాజకీయాలు తనకు పడవు అనుకుని, ఇద్దరు సీఎంలతో రాజకీయేతర సత్సంబంధాల్లో ఉన్న చిరంజీవి మళ్లీ ఆ కాషాయ క్యాంపులో ఉన్న తమ్ముడికి అండగా వెళ్లి ‘కొందరివాడు’ అయిపోతాడా..? నాకు పార్టీ నడపడం చేతకాక దాన్ని వదిలేసుకున్నాను, నీ పార్టీలో చేరి, నీ వెంట ఉంటాను తమ్ముడూ అని పవన్ కల్యాణ్‌కు చెబుతాడా..? అసలు ఫర్ డిబేట్ సేక్… రేప్పొద్దున… పర్ సపోజ్… వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన సీట్లను కుమ్మేస్తే… ముఖ్యమంత్రి ఎవరు..? ‘హన్నయ్యా, నువ్వే సీఎం’ అని పవన్ అన్నకు గౌరవం ఇస్తాడా..? ‘నో, నో, థమ్ముడూ, ఇదంతా నీ సాగు ఫలితం, పంట నువ్వే కోసుకో…’ అని అన్నయ్య ఉదారంగా ఆశీర్వదిస్తాడా..?! ఈ నయా రాజకీయాల్లో లక్ష్మణుడి నాయకత్వాన్ని రాముడు బలపరిచి… పట్టాభిషిక్తుడిని చేస్తాడా..?!
Share this Article