మోడీ ప్రభుత్వానికి కరోనా మీద ఓ దశ లేదు, ఓ దిశ లేదు…. కుప్పకుప్ప చేసిపెట్టింది కేంద్ర ప్రభుత్వం…. చివరకు ఆక్సిజన్ మీద సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తను టాస్క్ ఫోర్స్ వేసి పర్యవేక్షిస్తోంది… ఒకరకంగా కరోనా మీద పోరాటం నీకు చేతకాదు అని మోడీని అభిశంసించినట్టే…! సగటు జనానికి కూడా అలాగూ ఊపిరాడటం లేదు నిజంగా…. ఆక్సిజన్ దొరకడం లేదు, వేక్సిన్లు లేవు, హాస్పిటళ్లలో బెడ్లు లేవు, శ్మశానాల్లో కూడా స్పేస్ లేదు… మరి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయని అడక్కండి…. ఇలాంటి విపత్తుల్లో కేంద్రం నిర్దయగా, సంపూర్ణంగా నియంత్రణాధికారాల్ని తన చేతుల్లోకి తీసుకోవాలనీ, పరిస్థితిని చక్కబెట్టాలనీ సగటు మనిషి కోరుకుంటున్నాడు…. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వాడు అధికారంలో ఉంటేనేం..? ప్రజల ప్రాణాలు కదా ముఖ్యం..? అది మోడీకి చేతకాలేదు… పైగా కీలకమైన వేక్సిన్ వంటి విషయాల్లో బ్లండర్స్… మోడీకి సరైన గైడెన్స్ లేదా..? లేక తనను మిస్ లీడ్ చేస్తున్నారా..? లేక ఒకవేళ తనే తప్పుటడుగులు వేస్తున్నాడా..?
కోవాగ్జిన్ విషయమే తీసుకుందాం… మన ప్రభుత్వ సంస్థలే సాయం చేశాయి, జాయింట్ రీసెర్చ్ అన్నారు… మంచి నీళ్ల సీసా ధర అన్నారు… తీరా ఏం జరిగింది..? ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చేసింది మోడీ ప్రభుత్వం… ఒక డ్రగ్ ధర ఖరారు చేయడానికి ఎన్నెన్నో రూల్స్ ఉన్నయ్… మరి ఈ వేక్సిన్ ఆ కేటగిరీలోకి రాదా..? మరెందుకు సర్కారీ భాగస్వామ్యం ఉన్నట్టు..? ప్రాణాంతక పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థ ఈ అడ్డగోలు వ్యాపారం చేయాలా..? కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రాలకు ఓ రేటు, ప్రజలకు ప్రైవేటుగా ఓ రేటు అన్నప్పుడే ప్రపంచం అంతా పకపకా నవ్వింది మనవైపు జాలిగా చూస్తూ..! చివరకు సుబ్రహ్మణ్యస్వామి వంటి సొంత పార్టీ ఎంపీలు కూడా ‘‘నీకు చేతకాదు, ఆ గడ్కరీకి అప్పగించు’’ అని బహిరంగ వ్యాఖ్యలకు దిగారు… వేక్సిన్లపై బ్లండర్ వల్ల వేక్సినేషన్ ప్రగతి ఎంత ఘోరంగా ఉందో చూస్తున్నాం… ఇక తాజా విషయానికొద్దాం…
Ads
డీఆర్డీవో… మన రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ… లాభాలు కాదు, దాని పరమోద్దేశం దేశరక్షణ… దానికి INMAS (The Institute of Nuclear Medicine and Allied Sciences) పేరిట ఓ అనుబంధ పరిశోధన సంస్థ ఉంది… అది 2-deoxy-D-glucose (2-DG) అంటే సంక్షిప్తంగా టూడీజీ అనే మందు రూపొందించింది… ఈ ప్రయోగాలకు డాక్టర్ రెడ్డీస్ సహకరించింది… ఇది కరోనాకు పూర్తి విరుగుడు ఏమీ కాదు… కానీ ఇతర మందులకు తోడుగా బాగా పనిచేస్తుంది… కరోనా కణవ్యాప్తిని అడ్డుకుంటుంది… ఆక్సిజన్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది… ఇప్పుడున్న స్థితిలో అది అవసరమే… (ఆక్సిజన్ అవసరం వచ్చేది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల కదా, మరి దానికీ ఈ టూడీజీ పనితీరుకూ లింకేమిటి అనే ఓ కీలకప్రశ్న సమాధానరహితంగా అలాగే ఉంది… నిజానికి ఈ molecule 2004 లోనే కాన్సర్ కోసం కనిపెట్టారు, దాన్నే కరోనా రోగులపై ప్రయోగించి చూశారు ఇప్పుడు.., కాన్సర్ కణాల వ్యాప్తి, వైరస్ వ్యాప్తి ఒకేతరహా ఉండదు కదా అనేది మరి ప్రశ్న… విజ్ఞులు స్పందిస్తే తెలుసుకోగలం..) వోకే, కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం వరకూ ఎఫెక్టివ్ అని ప్రయోగాల్లో తేలింది… మన డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూడా ‘అత్యవసర వినియోగం’ పేరిట అనుమతులు ఇచ్చేసింది… భారత్ బయోటెక్‌కు కూడా అలాగే ఇచ్చారు…
ఓ గ్లూకోజు పొట్లంలాగే…. ఆ పౌడర్ నీళ్లలో కలిపి తాగేయడమే అంటున్నాడు డీఆర్డీవో బాసు… వారం రోజుల్లో తయారీ స్టార్ట్ చేస్తాం అంటున్నాడు… కానీ ఎవరు చేయాలి..? డాక్టర్ రెడ్డీస్ వాళ్లు చేస్తారుట… ధర ఎంతో ఇప్పటికి తెలియదు… వాళ్లు కూడా భారత్ బయోటెక్, సీరం వాళ్లలాగా కోట్లకుకోట్లు కుమ్మేసే ధర నిర్ణయిస్తే..? మోడీ ప్రభుత్వం వోకే అంటుందా..? అదీ ఓ కార్పొరేట్ కంపెనీయే కదా…? పైగా వాళ్లు ఎంతమేరకు తయారు చేయగలరు..? రోజుకు 4 లక్షల మంది రోగం పాలవుతున్నప్పుడు… ఈ మందు తయారీలో మన డీఆర్డీవో మేధస్సు, శ్రమ ఉన్నప్పుడు… దేశం కల్లోలితంగా ఉన్నప్పుడు… రాయల్టీ ఏదో ఖరారు చేసి, ఈ మందు తయారీ అవకాశం వేరే కంపెనీలకు ఎందుకు ఇవ్వకూడదు..? అది కేంద్రం చెల్లించినా తప్పేమీ లేదు… మరి ఇప్పుడు ఆ మందు భారీగా అవసరం ఉందిగా… ఈ ‘‘యుద్ధ సమయంలో’’ అక్కరకు రానప్పుడు ఇక డీఆర్డీవో దేనికి..? అలాగే కరోనా మీద బాగా పనిచేస్తున్న యాంటీ వైరల్ పాత మందులు కొన్ని ఉన్నయ్… వాటి వినియోగ అనుమతిపై ఓ పాలసీ ఏది..? ఉదాహరణకు ఐవర్‌మెక్టిన్…! పరీక్షకాలంలోనే ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడాలి… సర్వశక్తులూ క్రోడీకరించాలి… కానీ లోపించింది అదే… మన దురదృష్టంకొద్దీ…!!
Share this Article