అబ్బెబ్బె… నో, నో… మేం అస్సలు కోర్టుకు పోవడం లేదు… పోయే ఉద్దేశమే లేదు… కాకపోతే మా సినిమాకు జరగబోయే నష్టంపై సీఎంను కలుస్తాం, పరిష్కారం చూపమని అడుగుతాం……… ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ట్విట్టర్లో అధికారికంగానే పోస్ట్ చేశాడు ఇలా..! ఇండస్ట్రీలో మామూలు వ్యక్తిని కదిలించినా సరే… ‘‘అవును కదండీ, టికెట్ల ధరలు తగ్గిస్తే నిర్మాతలకు నష్టం కాదా..? లవ్ స్టోరీ సినిమాయే చూడండి, తెలంగాణలో మంచి వసూళ్లు, ఏపీలో నష్టాలు… దానయ్య అడిగేది సబబే కదండీ’’ అంటారు… కానీ..? ఏది లాభం..? ఏది నష్టం..? అంతలేసి పారితోషికాలు దర్శకుడు, హీరోలకు ఎవడు ఇవ్వమన్నాడు..? సినిమాలకు అంతగా ఖర్చెవడు పెట్టమన్నాడు..?
భారీ రేట్లకు బయ్యర్లకు అమ్మేసుకుని, ఓటీటీలకు అమ్ముకుని, టీవీలకు అమ్ముకుని, ఓవర్సీస్ అమ్ముకుని, పలు భాషల్లోకి తర్జుమాలు చేయించి, ఆ రైట్స్ అమ్ముకుని… మళ్లీ టికెట్ల ధరలతో మాకు నష్టం అంటూ ప్రభుత్వం మీద ఎవడు ఏడవమన్నాడు..? నిర్మాత ఆశించిన డబ్బు వస్తేనే సరైన వసూళ్లా..? అసలు ఏపీ థియేటర్ల నుంచి వచ్చే షేర్ నిర్మాతకు ఈకమందం కాదు, తోకమందం కాదు… ఇది జనాభిప్రాయం..! అసలు ఒక థియేటర్ దగ్గరకు వెళ్లి సినిమాను చూసే పరిస్థితి ఉందా..? పార్కింగ్ దగ్గర నుంచి ప్రతిదీ వాయింపే…
Ads
ఆన్లైన్ టికెట్ల పద్ధతి తెస్తే ఒక ఏడుపు… టికెట్ల ధరలకు పరిమితి పెడితే మరో ఏడుపు… అసలు వినోద పరిశ్రమ మీద ప్రభుత్వ పెత్తనం ఏమిటి అంటారు ఒకరు… అంటే, జనం జేబులు కత్తిరించడానికి పర్మిషన్ ఇచ్చేయాలా..? సగటు సినిమా ప్రేక్షకుడి అభిమానాన్ని భారీగా సొమ్ము చేసుకునే అవకాశాలు కల్పించాలా..? పోనీ, ఆర్ఆర్ఆర్ సినిమా ఏమైనా అంత స్పెషలా..? ఏ సినిమాకు లేనట్టు ఈ సినిమా రాగానే ప్రభుత్వం తలవంచేసి, తన విధానాన్ని సడలించుకుని, నిర్మాత ఎదుట సాగిలబడాలా..? నిజానికి దానయ్య కోర్టుకు వెళ్లి ఉండాల్సింది… టికెట్ల రేట్ల మీద చర్చ జరిగితేనే బాగుండేది…
గిరిజనులు అధికంగా ప్రేమించే, పూజించే ఇద్దరు భిన్న ప్రాంతాల చారిత్రిక పోరాటవీరుల విషయంలో, ఏమాత్రం సమర్థనీయం కాని క్రియేటివ్ లిబర్టీ తీసుకుని, చరిత్రకు మోసం చేస్తున్నారనే విమర్శ కూడా ఈ సినిమా మీద ఉంది… పైగా ఆ పూజనీయ కేరక్టర్లతో చెత్త చెత్త డాన్సులు చేయించారు… సినిమా ఇండస్ట్రీ తాలూకు చెడ్డ నాటుతనాన్ని పూశారు… పక్కా కమర్షియల్ మూవీ, జనానికి అక్కరకొచ్చేదేమీ కాదు… మరి ఎందుకు ఈ సినిమా విషయంలో జగన్ ‘జీ హుజూర్’ అంటూ రాజమౌళి ఎదుట తలవంచాలి..? ఈ నిర్మాత, ఈ దర్శకుడు ఏమైనా ప్రభుత్వ విధానాలకు అతీతులా..? ఈ ఒక్క సినిమాకు గనుక అధిక రేట్ల చాన్స్ ఇస్తే, ఇక తన విధానాన్ని తానే తప్పుపట్టుకున్నట్టు కాదా..? ఆ తప్పు చేస్తాడా జగన్..? జగన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా..?!
Share this Article