నో డౌట్… ఏపీ ప్రభుత్వ వ్యవహారాలను అమరావతి ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ విభాగం ఇట్టే పట్టేసుకుంటోంది… మిగతా పత్రికలకు చేతకావడం లేదు… పత్రికల్లో అదొక్కటే కాస్త గట్స్ చూపిస్తోంది… ఐతే సమస్య ఎక్కడొస్తుందీ అంటే… పెండను, బెల్లాన్ని ఒకేరీతిన చూడటం, ప్రతిదీ జగన్ మీదకు విషంగా మార్చేసి అచ్చేయడం అలవాటైపోయింది దానికి… ఉదాహరణ కావాలా..? మొన్నామధ్య కొత్త జిల్లాల ఏర్పాటు మీద కేంద్రం నిషేధం పెట్టింది, జగన్ జనం చెవుల్లో పూలు పెడుతున్నాడు అని ఫస్ట్ పేజీలో ఓ కథనం కుమ్మేశారు… తీరా రెండు, మూడు రోజులకు ‘కాదు, కాదు… కొత్త జిల్లాల మీద, అనగా జిల్లాల సరిహద్దుల మార్పుల మీద నిషేధం ఏమీలేదు’ అని ఓ వివరణ కమ్ ఖండన కమ్ స్పష్టీకరణ వాళ్లే రాసుకున్నారు…
కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని పెట్టబోతోంది, ఇక జగన్ పని అయిపోయినట్టే అని మూడు నాలుగు నెలలు హోరెత్తించారు… అదయిపోయింది, ఇప్పుడిక ఉద్యోగుల్ని ఉసిగొల్పే యజ్ఞం చేస్తోంది… ఎస్, ఉద్యోగులు, ఉద్యోగాలు అనేసరికి ఎలా సంయమనం పాటించాలో, సొసైటీ కోణంలో ఏం ఆలోచించాలో కూడా ఆంధ్రజ్యోతి విజ్ఞతను, కర్తవ్యజ్ఞానాన్ని కోల్పోతోంది… ఈరోజు ఫస్ట్ పేజీలో 82 వేల కొలువులను జగన్ కసుక్కున కోసేయబోతున్నాడని ఓ పేద్ద వార్తను అచ్చేసింది…
Ads
దానికి సింపుల్‌గా ఓ వక్రబాష్యం చెప్పేసింది కూడా… ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది, అందుకని ఉద్యోగుల జీతభత్యాల పద్దును తగ్గించుకునేందుకు ఇలా కొలువులను కోసేస్తోంది అని దాని వివరణ… ఇప్పుడు పీఆర్సీ గొడవ సాగుతోంది కదా, ఇప్పుడు కాస్త పెట్రోల్ పోసే పని అన్నమాట… నిజంగానే జగన్ గనుక ఇందులోనూ యూటర్న్ తీసుకోకుండా, స్థిరంగా అడుగులు వేయగలిగితే జగన్‌ను మెచ్చుకోవచ్చు… జీతభత్యాల పద్దు తగ్గించడానికి ఐనా సరే, జనం సొమ్ము వినియోగానికి సార్థకత కోణంలో ఆలోచిస్తే జగన్ ప్రభుత్వ ఆలోచన, అడుగులు సరైనవే…
కాలం చెల్లిన పోస్టులు… అంటే ప్రస్తుతం పనిలేని విభాగాలు, కూర్చుండబెట్టి జీతాలు ఇస్తున్న ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల్ని ఐడెంటిఫై చేస్తారట… ఎస్, తప్పకుండా జరగాల్సిందే… ఇదేపని చంద్రబాబు చేసినప్పుడు ఇదే పత్రిక చప్పట్లు చరిచింది కదా… ఒకే పనిచేసే వేర్వేరు ప్రభుత్వ విభాగాల్ని ఏకం చేసేస్తారట… అదీ మంచిదే… ప్రత్యేకించి ఇంజనీరింగ్ విభాగాల్లో మదింపు, కుదింపు జరగాల్సిందే కదా… ఇప్పుడు ఏం ప్రాజెక్టుల పని ఉంది, నిధులెక్కడి నుంచి వస్తున్నాయి, పని లేని ఉద్యోగులు ఎందరున్నారు..? ఈ లెక్కలు తీస్తున్నారు… ఇందులో వ్యతిరేకించడానికి ఏముంది..?
అప్పనంగా జనం సొమ్ము తీసుకొచ్చి, పని లేని ఉద్యోగుల ఖాతాల్లో పోయడం దేనికి..? అదనపు సిబ్బంది, అవసరం లేని సిబ్బంది అనే కోణంలో ఖచ్చితంగా సమీక్ష జరగాల్సిందే కదా… కాకపోతే పనికిమాలిన బొచ్చెడు కార్పొరేషన్లను క్రియేట్ చేసిన జగన్ ఈ ప్రభుత్వ కొలువుల మదింపును సరిగ్గా చేస్తాడా, నిలబడతాడా అనేదే అసలు ప్రశ్న… శాస్త్రీయంగా ఈ పని కొనసాగితే అది ఉపయుక్తమే… (https://www.andhrajyothy.com/telugunews/ap-ngts-andhrapradesh-192202030206098)
ఆ వార్తను న్యూట్రల్ మెదడుతో చదివితే ఇదేదో ప్రభుత్వం ఇప్పటికైనా మంచి పని చేస్తోంది కదా అనిపించేలా ఉంది… ఎటొచ్చీ దాన్ని జగన్ మీదకు ఓ అస్త్రంలా విసరాలని ఆంధ్రజ్యోతి ఏదో విఫల, విషప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతోంది..!!
Share this Article