ఒకటి క్లియర్…. ఇప్పుడు కాదు, ఎప్పుడూ….. కేసీయార్ పదే పదే ఒక అంశంపై గాయిగాయి గత్తర చేస్తున్నాడంటే, అది కేవలం తాత్కాలికం అని అర్థం… తన మాటలు వేరు, చేతలు వేరు……….. నాటి గురుకుల్ దగ్గర్నుంచి నేటి దేవరయాంజాల్ వరకు….. నిజానికి దేవరయాంజాల్ కేసును ఈటల కోణంలో కెలకడం ఓ తప్పు రాజకీయ నిర్ణయం… అది తనకూ తెలుసు, కానీ ఈటలపై అవసరార్థం ప్రయోగించిన ఓ ఈటె అది… ఈటల కబ్జాకోరు అని చెప్పడానికి ఆ భూముల ఇష్యూను కెలికాడు… తీరా ఏమైంది..? ఉల్టా కొట్టింది… సొంత డప్పు నమస్తే తెలంగాణలో కథనం రాయించేయడం కాదు… దాని పూర్వాపరాలు ఆలోచించాల్సింది… ఎందుకంటే..? అవే భూముల్లో నమస్తే తెలంగాణ ప్రింటింగ్ యూనిట్ ఉంది… దాని సీఎండీ పేరిట భూములున్నయ్ అని రేవంత్ రెడ్డి బయటపెట్టాడు… సో వాట్ అని కేసీయార్ బుల్డోజ్ చేయడానికి కూడా వీల్లేకుండా ఉంది… ఎందుకంటే..?
మొత్తం 1500 పైచిలుకు ఎకరాల భూమి అది… ఎవడి ఇష్టారాజ్యంగా వాడు అమ్మేసుకున్నాడు, బోలెడు క్రయవిక్రయాల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు… ఎమ్మార్వోలు తమకు తోచినట్టు…. సారీ, రేటు ఉంటుంది లెండి… నో ఆబ్జెక్షన్లు ఇచ్చేశారు… దాదాపు 200 నిర్మాణాలున్నయ్ ఆ భూముల్లో… నలుగురు ఐఏఎస్‌ల కమిటీ వేసి, ఈటల తాట తీయండి అని కేసీయార్ చెప్పాడు అనుకుందాం… నిజంగా ఆ కమిటీ సమస్య లోతుల్లోకి వెళ్తుందా..? వెళ్తే ఆ మొత్తం తేనెతుట్టెను కదిలించడానికి కేసీయార్ రెడీగా ఉన్నాడా..? ఇలాంటివి చాలా చూశాం కదా…. నాలుగు రోజులాగి మళ్లీ దీనిపై మాట్లాడేవాడు ఉండడు… పోనీ, దీని మీద సీరియస్‌గా ఉన్నాడు అనుకుందాం…
Ads
మనం చూస్తూనే ఉన్నాం కదా…. రెవిన్యూ సిస్టమ్‌ను సారు గారు ఎలా కుప్పకుప్ప చేశాడో… ధరణి దగ్గర్నుంచి రెవిన్యూ వ్యవస్థ దాకా…. ఆగమాగం, గందరగోళం… కేసీయార్ టీం అలా ఉంది, తన ఆలోచనలు అలాగే ఉన్నయ్… సరే, ఈ 1500 ఎకరాల భూమిని ప్రక్షాళన చేస్తాడు, సారు సూపర్ అనుకుందాం… పాత కమిటీ ఏం చెప్పింది, ఈ కొత్త కమిటీ ఏం చెబుతుందో చూడాలి… ఒకవేళ వీళ్లు అక్రమాలు, చట్టవ్యతిరేకం అని రిపోర్ట్ ఇచ్చారు అనుకుందాం… రాష్ట్రంలో ఉన్న వేల ఎకరాల అసైన్డ్, దేవాదాయ భూములకు ఈ రిపోర్టు వర్తిస్తే..? స్వాధీనం చేసుకునే సిట్యుయేషన్ వస్తే…? హైకోర్టు ఇంకా లోతుల్లోకి వెళ్తే…?! సో, తాత్కాలికంగా ఈటలను టార్గెట్ చేసి కొట్టాలనుకుంటే వేరే మార్గాలు బెటర్…
ఏ సమస్యయినా తను లోతుల్లోకి వెళ్లడు, తదుపరి యాక్షన్ ఎలాగూ ఉండదు కాబట్టి ఈ భూముల సంగతి కూడా నాలుగు రోజులాగితే ఇక ఎవరూ మాట్లాడరు… కేసీయారే మాట్లాడడు… ఈటలను బదనాం చేయాలనే ప్లాన్ పొలిటికల్‌గా తన ఇష్టం, కానీ ఈటల ఏదో దొంగ అనే ముద్ర వేయడం వేస్ట్… ఈటల శుద్ధపూస కాదు, బయటికి ఏం చెప్పుకున్నా సరే, ఈటల కూడా నిన్నటి దాకా ఆ గులాబీ తానులో ముక్కే… ప్రజల్లోకి ఈ ఇష్యూ అంతా వెళ్తోంది అనేది ప్రధానమే… ‘‘ఈటల దొంగే, సరే, కానీ ఎవరు తక్కువ..?’’ అనే ప్రచారం ఎదురుతంతోంది… ప్రత్యేకించి కేసీయార్ బలంగా సపోర్ట్ చేస్తూ ప్రేమిస్తున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల గురించి ఆయా నియోజకవర్గాల్లో అందరికీ తెలుసు… కాకపోతే ప్రతిపక్షాల్లో తనను కౌంటర్ చేసే ‘‘మగాడు’’ (ఈ పదప్రయోగానికి క్షమించాలి)) ఎవరూ లేనందున కేసీయార్ అడుగులు వర్కవుట్ అవుతున్నయ్… ఐనా పత్రికలు, ప్రతిపక్షాలను ఎలా పాతాళంలోకి తొక్కాలో కేసీయార్‌కు బాగా తెలుసు కదా… ఆ సక్సెస్‌లో ఈ తప్పుటడుగులు తనకు నష్టం చేయలేకపోతున్నయ్..! మేల్ మమత…!! ప్రత్యేకించి ఓ దిశ, ఓ దశ, దిక్కూదివాణం లేకుండా కొట్టుకుపోతున్న తెలంగాణ బీజేపీ శాఖకు కేసీయార్ రోజుకోసారి థాంక్స్ చెప్పాలి…!!
Share this Article