ఆ ఉపఎన్నికలో అభ్యర్థిత్వం ఖరారు నిజంగా బయట ప్రచారం జరుగుతున్నంత క్లిష్టంగా ఉందా కేసీయార్‌కు..? అసలు ఉపఎన్నికలంటేనే ఉఫ్ అని ఊదిపారేస్తుంటాడు కదా… జస్ట్, ఎవరో అభ్యర్థి అంటాడు, తరువాత హరీష్ చూసుకుంటాడు… ఎవరిని కొనాలో, ఎవరిని కేసులతో కొట్టాలో, ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఓ లెక్కప్రకారం జరిగిపోతూ ఉంటుంది… బహుశా మొదటిసారి ఈ వ్యూహం తల్లకిందులై హరీష్ తెల్లమొహం వేసింది దుబ్బాకలోనే కావచ్చు… ఇప్పుడు హుజూరాబాద్ కూడా టఫేనా..? లేక చిన్న ఈటలను పెద్ద పాముతో కొట్టాలి అనుకుంటున్నారా..? లేక నిజంగానే ఈటల పెద్ద పామా..? కేసీయార్ ఇమేజీని మింగేసేంత పెద్ద పామా..? దుబ్బాక రిపీట్ కావొద్దనే భావనతో అభ్యర్థిత్వం ప్రకటన మీద టీఆర్ఎస్ హైకమాండ్ గింజుకుంటున్నదా..?
ఎస్సీ పాట పాడుతున్నాడు కొన్నిరోజులుగా కేసీయార్… ఆంతర్యం అందరికీ అర్థమైపోతూనే ఉంది, తనే చెప్పుకుంటున్నాడు… మాది సన్నాసుల మఠం కాదు, బరాబర్ ఖజానా నుంచి పథకాలు ప్రకటించి మరీ వోట్లు సంపాదిస్తాను అని… బీసీల వోట్లు ఎక్కువ, సో, ఎస్సీ అనే ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందా లేదా అనే డైలమా ఉన్నట్టుంది… పోనీ, టీఆర్ఎస్‌వీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస యాదవ్‌ను నిలుపుదామా అనే ఆలోచన కూడా బలంగానే ఉన్నట్టుంది… బీసీ మీద బీసీ… ఈటల బీసీ మంత్రానికి బీసీ విరుగుడు… మంచి ఈక్వేషనే… నో, నో, కేసీయార్ మదిలో వేర్వేరు పేర్లు తిరుగుతున్నాయనీ అంటున్నారు… కానీ ఎవరు చెప్పగలరు..? బ్రహ్మదేవుడికీ ఆయన చెప్పడు… మొన్న భారీతనంతో టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి ఇస్తాడా..? ఒకవేళ రెడ్డినే నిలబెట్టాలి అనుకుంటే కౌశికుడేనా..? ఇంకా వేరే రెడ్లు ఉన్నారా..? అయితే ఎవరు..? నియోజకవర్గంలో రెడ్ల ప్రభావం కూడా ఎక్కువే…
Ads
గతంలో ఈ ఏరియా ముద్దసాని దామోదర్‌రెడ్డి అడ్డా… 1985లో కావచ్చు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించింది… నాలుగుసార్లు గెలిచి, మూడుసార్లు మంత్రిగా చేశాడు… కానీ 2004లో ఈటల చేతిలో ఓడిపోయిక ఇక మళ్లీ గెలవలేదు… దాదాపు అదే పీరియడ్, ఇక్కడ సిద్దిపేట అడ్డాగా చేసుకుని, కేసీయార్ కూడా వరుసగా గెలుస్తూ, మంత్రిగా పనిచేశాడు… 9 ఏళ్ల క్రితం ముద్దసాని మరణించాడు… ఆ ఫ్యామిలీ మీద కేసీయార్‌కు సదభిప్రాయమే ఉంది… కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి, దామోదర్‌రెడ్డి సోదరుడు పురుషోత్తంరెడ్డి రిటైరయ్యాక కూడా కేసీయార్ క్యాంపుతో సత్సంబంధాల్లో ఉన్నాడు… వేములవాడ టెంపుల్ డెలవప్‌మెంట్ అథారిటీకి ఆయననే ఎంపిక చేశాడు కేసీయార్… కొన్నాళ్లు పీఆర్సీ కార్యదర్శిగా కూడా చేసినట్టున్నాడు… తనను పోటీలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది కేసీయార్‌కు… అప్పట్లో కాంగ్రెస్‌లో ఉండి, అందులో నుంచి ఈమధ్య టీఆర్ఎస్‌లోకి చేరాడు దామోదర్‌రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి…
తనకు టికెట్ ఇస్తాడా అనేది కొంచెం డౌటే… ఎందుకంటే..? 2014లో ఆయన పోటీచేశాడు… మూడో స్థానంలో నిలిచాడు… అప్పట్లో టీడీపీ, బీజేపీ కంబైన్డ్ అభ్యర్థిగా ఉన్నా సరైన వోట్లు రాలేదు… 2018లో ట్రై చేసినట్టున్నాడు కానీ కౌశిక్ రెడ్డి ఆ టికెట్ పొందాడు, పర్లేదు, చెప్పుకోదగిన సంఖ్యలోనే వోట్లు వచ్చాయి… ఇప్పుడు తను కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయాడు… నాకే టికెట్టు అని చెప్పుకుంటున్నాడు… ‘‘ఇది నాదే’’ అని చెప్పుకునే సీన్ టీఆర్ఎస్‌లో ఏమీ ఉండదు… సరే, ఆ కశ్యపుడు, ఈ కౌశికుడు గాకుండా… ఆ పురుషోత్తముడు కూడా కాకుండా… ఏకంగా దామోదర్‌రెడ్డి భార్య మాలతిరెడ్డిని నిలబెట్టే చాన్స్ ఉందని ఇప్పుడు కొత్త ప్రచారం స్టార్టయింది… ఆమె SC ప్లస్ రెడ్డి ఫ్యాక్టర్…. ఇంకేం కావాలి…?!
కానీ ఆమె ఇంట్రస్టు కూడా చూడాలి… బలవంతంగా దింపితే దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను నిలబెట్టిన చేదుఅనుభవం మళ్లీ తప్పదు, జిపాటిస్ కూడా ముఖ్యమే కదా… మరో రెడ్డి ఉన్నాడు… ఆయన పేరు పెద్దిరెడ్డి… తను కూడా గతంలో మంత్రి… బీజేపీలో ఉన్నాడు, కానీ ఈటల చేరిక పట్ల అసంతృప్తితో ఉన్నాడు… వెళ్తాడు అంటున్నారు, వెళ్తే టీఆర్ఎస్‌లోకేనా..? వెళ్తే ఫాయిదా ఏమిటి..? అక్కడ టీఆర్ఎస్‌లోనే ఉండి, పార్టీ వర్క్ చేస్తున్న బలమైన రెడ్డి లీడర్ ఎవరూ లేరు… మరి అకస్మాత్తుగా జంపితే, వెంటనే టికెట్టు ఇచ్చేస్తాడా కేసీయార్..? అసలు కేసీయార్‌కు అక్కడ రెడ్లకు చాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడా అనేది ప్రధానమైన ప్రశ్న… అదిప్పుడప్పుడే తేలదు…!!
Share this Article