కావచ్చు… 12 మంది టీఆర్ఎస్ సిట్టింగుల మీద బీజేపీ వలవిసిరి ఉండవచ్చు… వస్తే కాషాయకండువాలు కప్పవచ్చు… కానీ వాళ్లతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు రప్పించి, కేసీయార్‌ను చికాకు పెట్టే ఆలోచన బీజేపీకి ఉండదు… దేశవ్యాప్తంగా బీజేపీది ఒకే పాలసీ… వీలైనంతవరకూ కూల్‌గా వ్యవహారాలు సాగిపోవాలి… అంతేతప్ప ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తాయో తెలియని స్థితిలో బీజేపీ ఈ ఉపఎన్నికల రిస్క్ తీసుకోదు…
కేసీయార్ మార్క్ స్వేచ్ఛతో చెలరేగిపోయి, జనంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగులను గనుక బీజేపీ ఆదరిస్తే… అది కేసీయార్‌కే లాభం, బీజేపికి నష్టం, తెలంగాణ సొసైటీకి నష్టం… చాలామంది సిట్టింగుల మీద జనంలో అసంతృప్తి విపరీతంగా ఉంది… అది కేసీయార్‌కు కూడా తెలుసు… మళ్లీ వాళ్లకే టికెట్లు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు, ఏం చేయాలో తనకే అంతుచిక్కడం లేదు… తను ఎంతగా మోడీని బజారుకు లాగి, గోకి, గీకి, గిల్లి రచ్చచేసి, కృత్రిమంగా ఓ సెంటిమెంట్ రగల్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నా సరే, మోడీ దేశముదురు కదా, జస్ట్, కేసీయార్‌ను అసలు పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నాడు… దీంతో కేసీయార్ మరింత రగిలిపోతున్నాడు… (ఇదంతా నిజమేనా..? వైరస్నేహమా అనేది వేరే ప్రశ్న)
హుజూరాబాద్ కథ వేరు… టీఆర్ఎస్‌లోకి వేర్వేరు పార్టీల నుంచి ఎందరు వచ్చినా సరే, వాళ్లు రాజీనామాలు చేయరు, ప్రజాతీర్పులు కోరరు, నైతికతలు వాళ్లకు వర్తించవు, కానీ అర్జెంటుగా ఈటల రాజీనామా చేసి, ప్రజాతీర్పు కోరాలంటూ వెంటపడ్డారు టీఆర్ఎస్ నేతలు… ఎందుకంటే, ఈటలను అసెంబ్లీలో చూడదల్చుకోలేదు కేసీయార్… ఈటల కూడా హుందాగా, ధైర్యంగా ప్రజాతీర్పుకు సిద్ధపడ్డాడు, పొందాడు, తలెత్తుకుని నడుస్తున్నాడు… వేర్వేరు పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎందరు ఎమ్మెల్యేలు ఇలా తలలెత్తగలరు..?
Ads
నిజానికి కేసీయార్ తక్షణ సమస్య ఈ ఉపఎన్నికలు కావు… ఓ పదిమంది పార్టీని వదిలేసినా తనకేమీ ఫరక్ పడదు… ఎవరినైనా తను గెలిపించుకోవల్సిందే తప్ప ఎమ్మెల్యే అభ్యర్థుల వల్ల పెద్దగా ప్రయోజనమూ ఉండదు… ఒకవేళ వాళ్లు రాజీనామాలు చేసి, బీజేపీ నిజంగానే ఉపఎన్నికలకు సిద్ధపడినా కేసీయార్ ఇక ఆ జోలికి పోడు, వీలైతే అసెంబ్లీ రద్దు చేసి, నేరుగా ఎన్నికలకే సై అంటాడు… తను రెడీగా ఉన్నాడు… పైగా ఇంకా కాలం గడిస్తే జనంలో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందనీ, బీజేపీ ఇంకాస్త బలపడుతుందనీ సందేహిస్తున్నాడు… తన కొత్త దోస్త్ పీకే కూడా అదే చెబుతున్నాడట మరి…
కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది… వెంటనే అసెంబ్లీ గనుక రద్దు చేస్తే, బీజేపీ గనుక రాష్ట్రపతి పాలన పెట్టేస్తే మొదటికే మోసం… కేసీయార్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసి, ఒక్కసారిగా బీజేపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది… అది ఎన్నికల్లో కేసీయార్‌కు చాలా నష్టం… పోనీ, షెడ్యూల్ ప్రకారం ఆగుదామా అంటే, జనంలో వ్యతిరేకత పెరుగుతోంది, ఎన్నికల సంఘం కూడా జనరల్ (లోకసభ) ఎన్నికలతో కలిపేస్తే అదీ కేసీయార్‌కు నష్టమే… జనరల్ ఎన్నికల్లో జనం మూడ్ వేరే ఉంటుంది… అది కేసీయార్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చు… గత ఎంపీ ఎన్నికల్లో చూశాం కదా… అసలే మైనసులో ఉన్న ఈ స్థితిలో ఆ మైనస్ కూడా తోడయితే అది ఇంకా కష్టం…
అందుకే అసెంబ్లీ రద్దుపై ఏదీ తేల్చుకోలేని సందిగ్ధత… ఒకవేళ ఓ పది మందిని నిజంగానే బీజేపీ లాగేసి, ఉపఎన్నికలకు సై అంటే మాత్రం… దేశం కనీవినీ ఎరుగని యుద్ధాన్ని చూడాల్సి ఉంటుంది… భౌతికం కాదు… ఆర్థికం… హుజూరాబాద్ ఉపఎన్నికనే విశ్వరికార్డులకు ఎక్కించినంతగా ఓ రేంజుకు తీసుకుపోయిన కేసీయార్ వీటిని వదులుతాడా..? డబ్బులకు కొదువ లేదు… మరోవైపు బీజేపీ ధనిక పార్టీయే… ఇక చూడాలి పోరు…
నిజానికి బీజేపీకి కూడా అంత ఈజీగా ఏమీ లేదు… కోమటిరెడ్డి వంటి నేతల పేర్లు తరచూ వినిపించడమే తప్ప వాళ్లు బయటికి వచ్చిందీ లేదు, కాషాయం పూసుకున్నదీ లేదు… వాళ్లెప్పుడూ బీజేపీ వంటి పార్టీకి నమ్మబుల్ కూడా కాదు… ఖమ్మం, పాలమూరు, నల్లగొండ… ఏ జిల్లా నేతల్ని తీసుకున్నా అలాగే ఉంది… విచ్చలవిడి అధికార ధోరణులకు అలవాటు పడిన నాయకుల షరతులకు అంత తేలికగా బీజేపీ లొంగదు, బీజేపీ కట్టుబాట్లలో వాళ్లు ఇమడలేరు… సో, తెలంగాణ రాజకీయం ప్రస్తుతానికి ఓ అనిశ్చితి…!!
Share this Article