ఇన్నాళ్లూ తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే ఖచ్చితంగా నిలబడి మాట్లాడిన పార్టీ… ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిపోయిందో, జాతీయ రాజకీయాల పాట అందుకుందో… తెలంగాణ కోణం దాటిపోయింది…! అవసరార్థం మునుపెన్నడూ లేనంత రాజనీతిజ్ఞత, ఔదార్యం, పరిణతి కేసీయార్ మాటల్లో కనిపిస్తోంది… బాబ్లీ అనేది పెద్ద ఇష్యూయే కాదు, వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, టీఎంసీ కూడా లేని బాబ్లీ పంచాయితీ దేనికి..? అదొక డ్రామా… నీటి లభ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వానికి నచ్చజెప్పి శ్రీరాంసాగర్ నీళ్లను ఎత్తిపోసుకొండి, పెద్ద మనసుతో చెబుతున్నా… అని చెప్పాడు నాందేడ్‌లో…
ఈ వార్తలు చదవగానే, అప్పట్లో ఎన్టీయార్ వ్యాఖ్యలు కొన్ని గుర్తొచ్చాయి… ఇన్నేళ్లు నాకు తిండిపెట్టింది, చెన్నై దాహం తీర్చకపోతే ఎలా మరి..? అందుకే తెలుగుగంగ చేపడుతున్నాం, చెన్నైకి తాగునీరు ఇస్తాను అని ఎన్టీయార్ ప్రకటన ఆరోజుల్లో… నీకు తిండి పెడితే, నీకు ఆశ్రయం ఇస్తే, నీకు అడ్డాగా మారితే, దానికి కృతజ్ఞతగా ఓ ప్రాజెక్టే చేపడతావా..? నీ సొంత జేబులో డబ్బులు అనుకున్నావా కృష్జాజలాలంటే… అనే విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో… సరే, ఆ పేరుతో అనేక ప్రాంతాలకు కృష్ణా జలాల్ని తరలించారు, అది వేరే కథ… కానీ ఒక ముఖ్యమంత్రి స్థూలంగా రాష్ట్ర ప్రయోజనాలను, తన వ్యక్తిగత రాగద్వేషాలతో లింక్ పెట్టొచ్చా అనేదే ప్రశ్న… ఎన్టీయార్ పెద్ద స్టేట్స్‌మన్ కాదు కాబట్టి, ఎవరూ అడగలేదు కాబట్టి, అడిగినా జవాబు చెప్పే అలవాటు లేదు కాబట్టి ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది… మళ్లీ ఇప్పుడు కేసీయార్…
Ads
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌ను బాబ్లీ వాడుకుంటోంది… అసలు బ్యాక్ వాటర్స్‌లో ఓ లిఫ్ట్ పెట్టడమే అబ్సర్డ్… అందుకే తెలంగాణ గానీ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానీ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించాయి… ఇక్కడ ఒక్క టీఎంసీయా, అర టీఎంసీయా అనేది ఇష్యూ కాదు, మహారాష్ట్ర పోకడ అభ్యంతరకరం… ఇదే గోదావరి జలాలపై మహారాష్ట్రకూ మనకూ బొచ్చెడు ఇష్యూస్ ఉన్నాయి… ఇప్పుడు కేసీయార్ చెబుతున్నాడు కాళేశ్వరానికి మహారాష్ట్రను ఒప్పించాం, చర్చిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి అని… కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్లకేం నష్టం లేదు కాబట్టి అంగీకరించారు…
సో, బాబ్లీతో మన నీళ్లను ఎంత తీసుకుపోతున్నారు అనేది ప్రశ్న కాదు… దిగువ రాష్ట్ర ప్రయోజనాలను బేఖాతరు చేస్తూ, బాబ్లీకి ఎగువన అనేక ప్రాజెక్టులు కట్టింది మహారాష్ట్ర… దిగువకు రావల్సిన బోలెడంత నీటిని వాడుకుంటోంది… మరి బాబ్లీ డ్రామా ఎలా అవుతుంది..? బాబ్లీ, దాని ఎగువ ప్రాజెక్టులన్నీ ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకాలే… అలాంటిది బాబ్లీ ఓ ఇష్యూయే కాదు, అవసరమైతే శ్రీరాంసాగర్ నీటినీ ఎత్తిపోసుకొండి, పెద్ద మనసుతో చెబుతున్నా అని ఓ ముఖ్యమంత్రి ఎలా అంటాడు..?
రాబోయేవన్నీ నీటి తగాదా రోజులే… ప్రతి చుక్కకూ పంచాయితీ తప్పదు… అలాంటప్పుడు ఇప్పుడు నీకు అవసరం కాబట్టి మహారాష్ట్ర పట్ల ఔదార్యం చూపించాలా..? ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది… అంతేతప్ప ముఖ్యమంత్రికి వోట్ల అవసరం రాగానే అర్జెంటుగా ‘పెద్ద మనస్సు’ వచ్చేసి, మా నీళ్లనూ మీరు ఎత్తిపోసుకొండి అనాలా..? అది తెలంగాణ ప్రజల హక్కు… గోదావరి జలాలపై మనకు వాటాలున్నయ్, ఎగువ నుంచి రావల్సిన నీళ్లు రావాలి, అవన్నీ వదిలేసి, నాకు మనసైంది, మీ ఇష్టమొచ్చినన్ని నీళ్లు తీసుకొండి అనడం ఎలా సబబు..?
రేప్పొద్దున కేసీయార్ గాకుండా మరో సీఎం రావచ్చు, పాలకులు చాలా పెద్ద మనసుతో చెబితే చాలా..? తెలంగాణ నీళ్లను ఆపేసుకోవచ్చా..? ఇదెలా ఉందంటే, నేను మస్తు దేవుళ్లకు మొక్కుకున్నాను అంటూ తెలంగాణ ఖజానా నుంచి వివిధ దేవుళ్లకు నగలు చేయించినట్టుంది… నువ్వు మొక్కుకుంటే నీ పార్టీ డబ్బో, నీ సొంత డబ్బో ఖర్చుపెట్టాలి గానీ తెలంగాణ ప్రజల సొమ్ము ఖర్చు చేస్తానంటే ఎలా..? వివిధ దేవుళ్ల హుండీల్లో తెలంగాణ ప్రజల సొమ్మును నువ్వే సొంత డబ్బులాగా వేసేస్తే ఎలా..?
సపోజ్, రేప్పొద్దున ఏపీలోనూ నాందేడ్ సభలాంటిది పెడతాడు… మరి ఏపీలోనూ బీఆర్ఎస్‌కు వోట్లు కావాలి కదా… వాళ్ల ఆదరణ కావాలి… సో, పోతిరెడ్డిపాడు ఏముందయ్యా, చిన్న ఇష్యూ, తీసుకుపొండి, మీకు ఇష్టం వచ్చిన నీళ్లను పారించుకొండి అంటాడా..? పోలవరం ఎంత ఎత్తుకైనా కట్టేసుకొండి పర్లేదు, పెద్ద మనసుతో చెబుతున్నాను అంటాడా..? అది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా..?
అంతెందుకు..? కర్నాటక బోర్డర్‌లో కూడా ఓ మీటింగు పెడతాడు… తుంగభద్ర ఆర్డీఎస్ చాలా చిన్న ఇష్యూస్, అప్పర్ కృష్ణా రెండు డ్యాములే కాదు, ఆలమట్టి ఎత్తు ఎంతయినా పెంచుకొండి అంటాడా..? నాందేడ్ సభ, ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన సరళి చూస్తుంటే ఇలా అనేట్టుగానే ఉంది సీన్… కర్నాటక అక్రమంగా కట్టుకునే ప్రాజెక్టులకు అనుమతిస్తాడా..? మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రయోజనాల మాటేమిటి..? పెద్ద మనసు సరే, తెలంగాణకు వచ్చిన ఫాయిదా ఏమిటి..? కేసీయార్ రాజకీయ అవసరాలను బట్టి రాష్ట్ర ప్రయోజనాలు, విధానాలు మారిపోవాలా..? ఇదెక్కడి ధోరణి..?!
అవునూ, ఇంత భారీ ఔదార్యం చూపించే కెసిఆర్ కు హైదరాబాద్ జర్నలిస్టుల మీద మాత్రం అది కనిపించదు ఏమిటో… ఆంధ్రా ఓట్లు కావాలి కానీ ఇక్కడే పనిచేసే ఆంధ్రా జర్నలిస్టుల బతుకులు మాత్రం అక్కర్లేదు…
Share this Article