ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా..? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది… కేజ్రీవాల్ జైలులో నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా..? వరుసగా తొమ్మిదిసార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, హైకోర్టులో తనకు ఏమీ రిలీఫ్ దక్కలేదు… అర్ధరాత్రయినా సరే, తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్… అరెస్టుకు ఈడీకి అధికారాలున్నయ్, తొమ్మిదిసార్లు సమన్లు పంపినా విచారణకు సహకరించలేదనే సాకు ఉంది… సో, శుక్రవారం ఉదయం వాదనలు వింటామన్న సుప్రీం అంతిమంగా ఏం చెబుతుందో చూడాల్సి ఉంది… కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన వెంటనే ఈడీ తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతుంది సహజంగానే… పేరున్న పెద్ద లాయర్లే కేజ్రీవాల్ తరఫున రంగంలోకి దిగారు…
ముఖ్యమంత్రి జైలు నుంచి విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉందా..? కొద్దిరోజులుగా ఆప్ వర్గాలు ఇదే చెబుతున్నాయి… తను రాజీనామా చేయడు, జైలులో నుంచే పాలిస్తాడు అని..! ఆప్‌లో నంబర్2 అని పిలవబడుతున్న అతిషి నిన్న కూడా అదే చెప్పింది… సో, ఎప్పటి నుంచో అరెస్టు తరువాత ఏమిటి అనే విషయంలో కేజ్రీవాల్ టీం మేధోమథనం జరుపుతూనే ఉందన్నమాట… దేశంలో పదవిలో ఉన్నప్పుడు అరెస్టు కాబడిన మొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్… సో, తన విషయంలో తదుపరి ఎలా వ్యవహరించాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది…
జైలు నుంచి పనిచేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుందా…? అసలు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా..? తను రాజీనామా చేయబోను అంటే రాజ్యాంగ సంక్షోభం ఏమైనా వస్తుందా..? ఇవీ ప్రస్తుతం ప్రశ్నలు… జైలులో నుంచి ముఖ్యమంత్రి పనిచేసిన ఉదాహరణ గతంలో ఎప్పుడూ లేదు…
Ads
గతంలో జయలలిత జైలుకు పోయింది, కానీ విచారణ జరుగుతున్న మూడేళ్లూ ఆమె ముఖ్యమంత్రిగానే ఉంది… ఎప్పుడైతే దోషిగా తేల్చి, కోర్టు శిక్ష విధించిందో అప్పుడు ఆమెకు దిగిపోక తప్పలేదు… జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను కూడా ఈమధ్యే ఈడీ అరెస్టు చేసింది… తను గవర్నర్‌ను కలిసి రాజీనామా ఇచ్చాకే అరెస్టు చేసినట్టు చూపించారు… కానీ తను దోషిగా నిరూపించబడలేదు… లాలూ కూడా అరెస్టుకు ముందే రాజీనామా చేసి, భార్యకు బాధ్యతలు అప్పగించి జైలుకు వెళ్లాడు… ఇలా రకరకాల ఉదాహరణలున్నాయి గానీ ఎవరూ జైలు నుంచి పరిపాలించలేదు…
కేజ్రీవాల్‌కు ముందే ఈ కేసులో తన మంత్రి సత్యేంద్ర జైన్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులతో పాటు రీసెంటుగా కేసీయార్ బిడ్డ కవిత కూడా అరెస్టయింది… ఎవరికీ అంత తేలికగా బెయిల్ కూడా దొరకడం లేదు… ఈడీ ఇవన్నీ ఆలోచించే లీగల్‌గా తన తప్పేమీ లేకుండా జాగ్రత్తపడుతోంది అరెస్టులకు ముందు..! జైలు నుంచి పాలించడంలో ఉన్న రియల్ ఇబ్బందులేమిటో పక్కన పెడితే, అసలు ఆ చాన్స్ ఉందానేది కీలకప్రశ్న…
రాజ్యంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు అరెస్టుల నుంచి ఇమ్యూనిటీ ఉంది… కానీ ప్రధాన మంత్రి సహా ముఖ్యమంత్రులకు ఆ వెసులుబాటు లేదు.,. అందరిలాగే వాళ్లూ..! ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకున్నంత అధికారాలు కూడా ఢిల్లీ ప్రభుత్వానికి ఉండదు… లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలే ఎక్కువ.,. ఒకవేళ నేను జైలు నుంచే పనిచేస్తాను అని భీష్మిస్తే పదవి నుంచి కేంద్ర హోం శాఖ తొలగించవచ్చా..? ముఖ్యమంత్రి పదవి కూడా ఓ ప్రభుత్వ అధికారి వంటి సర్వీసే కాబట్టి, ప్రభుత్వ కొలువులో ఉన్నవారిని ఎలా తొలగిస్తున్నారో ముఖ్యమంత్రినీ అలాగే తొలగించవచ్చునని ఓ వెర్షన్ వినిపిస్తోంది… కాదు, జైలు నుంచి పనిచేయకుండా ఒక ముఖ్యమంత్రిని లీగల్‌గా నిరోధించలేం అని మరో వెర్షన్…
అన్నింటికీ మించి జైలు అధికారులు ఒక విచారణ ఖైదీకి జైలులో జైలు మాన్యువల్‌కు భిన్నంగా ‘ముఖ్యమంత్రి ఆఫీసు వాతావరణానికి’ అనుమతిస్తారా..? దీనికి కోర్టు అంగీకరిస్తుందా..? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే… లీగల్ అంశాలు ఎలా ఉన్నా… ఓ కుంభకోణం కేసులో జైలుకు (విచారణ ఖైదీగా అయినా సరే) వెళ్లిన ఓ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగడం నైతికమేనా అనేది మరో ప్రధాన ప్రశ్న..!! ఈ అరెస్టు బీజేపీకి రాజకీయంగా ఉపయోగకరమా, నష్టమా అనేది వేరే చర్చ… ఢిల్లీలో ఎన్నికల వేళ ఏవైనా అవాంఛనీయ చర్యలకు ఒడిగట్టాలనుకునే శక్తులకు మాత్రం ఖచ్చితంగా కేజ్రీవాల్ అరెస్టు ఓ సెట్ బ్యాక్..!!
Share this Article